నల్సార్‌లో సీఎజేఐకి షాక్.. 450 మంది విద్యార్థుల లేఖ
x

నల్సార్‌లో సీఎజేఐకి షాక్.. 450 మంది విద్యార్థుల లేఖ

‘ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడం మా విలువలకు విరుద్ధం’ అంటూ విద్యార్థుల అభ్యంతరం.


నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో సీఎజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు విద్యార్థుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. త్వరలో జరగనున్న స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించొద్దంటూ ఏకంగా 450 మంది విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని పునఃపరిశీలించాలని కోరారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని విద్యార్థులు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎవరిని పిలవాలని అన్న అంశం కూడా ఇంకా చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు. అందుకే తుది నిర్ణయం తీసుకునే ముందే తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

జంతర్ మంతర్ ఘటనపై అభ్యంతరం

జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనను విద్యార్థులు తమ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు చేసిన ప్రయత్నం సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యవహరించిన తీరుపై తమకు అభ్యంతరం ఉందని విద్యార్థులు పేర్కొన్నారు.

పోలీసుల చర్యల్లో పలువురు నిరసనకారులు గాయపడినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారని తెలిపారు. అయితే, పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోలను చూపించేందుకు న్యాయవాది ప్రయత్నించినప్పుడు వాటిని చూసేందుకు సమయం లేదని సీజేఐ పేర్కొన్నట్లు విద్యార్థులు గుర్తుచేశారు. నిరసనకు దారితీసిన కారణాలను న్యాయవాది వివరించేందుకు ప్రయత్నించిన సమయంలో ఆయనను మధ్యలోనే ఆపి ‘థాంక్యూ వెరీమచ్’ అని వ్యాఖ్యానించినట్లు నివేదికల్లో వచ్చిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. ‘ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడం మేము నేర్చుకున్న విలువలకు విరుద్ధం’ అని పేర్కొన్నాారు.

విద్యార్థులు తమ అభ్యంతరాన్ని కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా చూడొద్దని స్పష్టం చేశారు. తాము న్యాయ విద్యార్థులుగా, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని పట్టాలు అందుకోబోతున్న బ్యాచ్‌గా ఈ అంశాన్ని చూస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం, సమస్యలపై వివేకంతో స్పందించడం వంటి అంశాలు నల్సార్‌లో తాము నేర్చుకున్న విలువల్లో భాగమని పేర్కొన్నారు. అలాంటి విలువలు యూనివర్సిటీ నిర్ణయాల్లో కూడా కనిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

నిరసన చేస్తున్న పౌరులపై పోలీసుల చర్యలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వచ్చిన సందర్భంలో, వాటిని పట్టించుకోనట్టుగా వ్యవహరించిన వ్యక్తి చేతుల మీదుగా తమ డిగ్రీలు తీసుకోవడం తమకు నేర్పిన విలువలకు విరుద్ధంగా ఉంటుందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. అందువల్ల స్నాతకోత్సవ ముఖ్య అతిథి ఎంపికను యూనివర్సిటీ తీవ్రంగా పునఃపరిశీలించాలని కోరారు.

విద్యార్థి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను తెలుసుకోవాలని తెలిపారు. తమ వినతిని గౌరవపూర్వకమైన అభిప్రాయంగా పరిగణించాలని కోరారు. ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పందించాలని, ముఖ్యంగా సోమవారం లోగా సమాధానం ఇవ్వాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

స్నాతకోత్సవం వాయిదాపైనా చర్చ

ఇదిలా ఉండగా, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) స్నాతకోత్సవం వాయిదా పడటం కూడా ఈ నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 2న జరగాల్సిన టిస్ 86వ స్నాతకోత్సవానికి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే కార్యక్రమాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు. ‘అనుకోని పరిస్థితుల’ కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టిస్ ప్రకటించింది. అయితే వాయిదాకు సంబంధించిన కారణాలను అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు నల్సార్ విద్యార్థులు చేసిన ఈ విజ్ఞప్తిపై యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. విద్యార్థుల అభ్యంతరాలు, యూనివర్సిటీ నిర్ణయం తదుపరి పరిణామాలను నిర్ణయించనున్నాయి.


Read More
Next Story