
మహబూబ్‌నగర్‌లో భారీ ప్రమాదం.. ఐదుగురు మృతి
పాలకొండ బైపాస్ వద్ద స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ సమీపంలోని బైపాస్ రోడ్డుపై స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం, కారు నెమ్మదిగా యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ కారును ఢీకొట్టింది. అదే సమయంలో బైక్ రేసింగ్ జరుగుతోందని కూడా స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గౌసియా, ఆమిర్, ఉజేఫా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో చిన్నారి ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన యాకూబ్ అఫ్జల్‌గా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన మహిళను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
బైపాస్ రోడ్డుపై రాత్రివేళల్లో బైక్ రేసింగ్ ఎక్కువవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అతి వేగమా, నిర్లక్ష్యమా, లేక యూటర్న్ సమయంలో జరిగిన పొరపాటా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది విచారణ తర్వాత స్పష్టంకానుంది.

