
తెలంగాణలో 71 వేలమందిని ముంచేసిన ‘నీట్’
మంచి స్కోరు వస్తుందని ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్ధులు శోకసముద్రంలో ముణిగిపోయారు.
ఈమధ్యనే జరిగిన నీట్ పరీక్ష రద్దవ్వటం వల్ల తెలంగాణలోని వేలాదిమంది విద్యార్ధులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఈసారి నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ప్రశ్నలు ఈజీగా వచ్చాయని 71,024 మంది విద్యార్ధులు సంబరపడ్డారు. ప్రశ్నలు తేలికగా వచ్చాయి కాబట్టి తమకు మంచి స్కోర్ రావటం ఖాయమని సంబరపడుతున్న నేపధ్యంలో ప్రశ్నపత్రం లీకేజీ అయ్యిందన్న కారణంగా ఏకంగా పరీక్షనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) రద్దుచేసింది. దాంతో మంచి స్కోరు వస్తుందని ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్ధులు శోకసముద్రంలో ముణిగిపోయారు.
నీట్ పరీక్షకు తెలంగాణలో 73,024 మంది రిజిస్టర్ చేసుకున్నారు. జాతీయ స్ధాయిలో వైద్య విద్యార్ధులు అందరికీ ఒకటే అర్హత పరీక్ష ఉండాలని 2016-17లో నీట్ యూజీ, పీజీ పరీక్షలను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్రం 2019లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించింది. కొంతకాలంగా ఏజెన్సీ నిర్వహిస్తున్న నీట్ పరీక్షలు లీకేజీ వివాదంలో కూరుకుపోతున్నాయి. 2024లో కూడా నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అయ్యిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆరోపణలను విచారించిన పోలీసులు ఝార్ఖండ్ లోని హజారీబాగ్, బీహార్ లోని పాట్నాలో ప్రశ్నపత్రం లీకైందని కనుక్కున్నారు. దాంతో నీట్ పరీక్షను రద్దుచేసి మళ్ళీ నిర్వహించారు.
అదే సంవత్సరంలో నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష కూడా లీకేజీల ఆరోపణలతోనే రద్దయ్యింది. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలను ఏజెన్సీ ఆటలాడుకుంటోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎవరెన్ని ఆరోపణలు చేస్తున్నా ఏజెన్సీ మాత్రం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోవటంలేదు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధుల విషయంలో ఏజెన్సీ ఎన్నో కండీషన్లు పెడుతోంది. వేసుకునే బట్టలను, బూట్లు, చెప్పులను కూడా తనిఖీచేస్తోంది. పరీక్షలు రాయటానికి వచ్చిన విద్యార్ధులపై అనేక ఆంక్షలు పెడుతున్న ఏజెన్సీ ప్రశ్నపత్రాల లీకేజీలను మాత్రం కంట్రోల్ చేయలేకపోతోంది. ఇప్పుడు రద్దయిన నీట్ పరీక్ష మళ్ళీ ఎప్పుడుంటుందా అని వేలాదిమంది విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. ఇపుడు లీకైన పేపర్ రాజస్ధాన్ లోని కోటాలో లీకైనట్లు పోలీసులు గుర్తించారు.
కఠినచర్యలు తీసుకోవాలి : దామోదర
ప్రశ్నపత్రం లీకేజీకి కారకులపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో 70 వేలమంది రాసిన నీట్ పరీక్షను దేశవ్యాప్గా 22 లక్షలమంది రాసినట్లు చెప్పారు. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న లీకువీరులను ప్రభుత్వం ఎట్టి పరిస్ధితుల్లోను విడిచిపెట్టకూడదని చెప్పారు. ఎన్నిసార్లు పేపర్లు లీకవుతున్నా ఏజెన్సీ తన వైఖరిని మార్చుకోకపోవటాన్ని మంత్రి తప్పుపట్టారు. మనోవేధనకు గురవుతున్న విద్యార్ధులు, వారి తల్లి, దండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది అని దామోదర్ భరోసా ఇచ్చారు.

