7,340 ఫ్లాట్లు.. 60 వేల ఆశలు! లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ
x

7,340 ఫ్లాట్లు.. 60 వేల ఆశలు! లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం

1) 7,340 ఫ్లాట్లు.. 60 వేల ఆశలు! లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ

2) రేషన్ కావాలంటే eKYC తప్పదు.. ఆగస్టు 31 డెడ్‌లైన్!

3) పాత ఆటోకు గుడ్‌బై..ఈవీకి మారితే రూ.1.50 లక్షల సబ్సిడీ!

1) 7,340 ఫ్లాట్లు.. 60 వేల ఆశలు! లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌.. అంటే CURE పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల కోసం ఏకంగా 60,014 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో ఫ్లాట్‌ కోసం సగటున 8 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎలా సెలెక్ట్ చేస్తారు అనేదాని మీద వుంది. "అర్హులైన దరఖాస్తుదారులను గుర్తించిన తర్వాత, ఆగస్టు 20 తర్వాత కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామ‌ని హౌసింగ్‌బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

ఈ పోటీలో కొన్ని నియోజకవర్గాల్లో డిమాండ్‌ మరింత ఎక్కువగా కనిపించింది. కూకట్‌పల్లిలో అత్యధికంగా 9,208 దరఖాస్తులు రాగా.. కుత్బుల్లాపూర్‌లో 7,210, ఖైరతాబాద్‌లో 6,970, నాంపల్లిలో 5,114, శేరిలింగంపల్లిలో 4,860 అప్లికేషన్లు వచ్చాయి. మలక్‌పేటలో 4,459, అంబర్‌పేటలో 3,893, కార్వాన్‌లో 2,773, రాజేంద్రనగర్‌లో 2,723 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఫ్లాట్ల కంటే దరఖాస్తుదారుల సంఖ్య భారీగా ఉండటంతో.. అర్హత పరిశీలన తర్వాత లాటరీ విధానంలోనే ఎంపిక చేయనున్నారు.

అయితే లక్కీ డ్రాలో పేరు రావాలంటే ముందుగా అర్హతల పరిశీలనలో నెగ్గాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలలోపు ఉండటం, సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివాసం ఉండటం, ఒక కుటుంబం నుంచి ఒక్కరే దరఖాస్తు చేయడం వంటి నిబంధనలను అధికారులు పరిశీలించనున్నారు.

ఆధార్‌, రేషన్‌ కార్డు, ప్రభుత్వ డేటాబేస్‌ల ఆధారంగా వివరాలను క్రాస్‌ చెక్‌ చేస్తారు. ఇప్పటికే ఇల్లు, ఫ్లాట్‌ లేదా ప్లాట్‌ ఉన్నవారికి అర్హత ఉండదు. ఒకే వ్యక్తి లేదా కుటుంబం నుంచి వేర్వేరు దరఖాస్తులు వచ్చినా గుర్తించి తొలగించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితా సిద్ధం చేస్తారు.

పదంతస్తుల టవర్‌లో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగు బిల్డప్ ఏరియా 400 ఎస్‌ఎఫ్‌టీ కార్పెట్ ఏరియాతో సింగిల్ బెడ్ రూమ్‌లు నిర్మించనున్నారు. స్థలం, 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుండగా.. లబ్ధిదారుడు సుమారు 6 లక్షల రూపాయలను నాలుగు విడతల్లో చెల్లించాలి.

దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 వేల రూపాయల ఈఎండీ లాటరీలో ఫ్లాట్‌ దక్కని వారికి తిరిగి చెల్లిస్తారు. ఫ్లాట్‌ దక్కిన తర్వాత ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వనుంది. అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

అయితే ఫ్లాట్‌ దక్కిందనే వెంటనే దాన్ని అమ్ముకోవడానికి లేదా అద్దెకు ఇచ్చేందుకు వీలుండదు. కేటాయించిన ఫ్లాట్‌ను పదేళ్లపాటు విక్రయించడం, కిరాయికి ఇవ్వడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. మరోవైపు కుటుంబంలోని మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లతో పాటు CURE పరిధిలో మొత్తం 7,340 ఎల్‌ఐజీ ఫ్లాట్ల కోసం ప్రభుత్వం 807 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఇప్పుడు వేలాది మంది ఎదురుచూస్తున్నది, అర్హుల జాబితాలో తమ పేరు ఉందా? లక్కీ డ్రాలో తమకు ఫ్లాట్‌ దక్కుతుందా? అన్నదే. ఆగస్టు 20 తర్వాత జరగనున్న లాటరీతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

ఎంపిక విధానం (లాటరీ పద్ధతి): ఒక్కో ఫ్లాట్‌కు సగటున 8 మందికి పైగా పోటీ ఉన్నందున, అర్హులైన దరఖాస్తుదారుల నుండి కంప్యూటరైజ్డ్ లాటరీ (డ్రా) ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

ఎంపిక తేదీ: ఆగస్టు 20, 2026 తర్వాత ఈ లబ్ధి ప్రక్రియ ప్రారంభం కానుంది.

డిపాజిట్ వాపసు: లాటరీలో ఇల్లు రాని వారికి వారు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని పూర్తిగా వెనక్కి ఇస్తారు.

మహిళల పేరున రిజిస్ట్రేషన్: ఇల్లాలు లేదా కుటుంబంలోని మహిళ పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు.

ఆదాయ పరిమితి: దరఖాస్తు చేసుకునే కుటుంబం యొక్క వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి.

దరఖాస్తు సమయంలో ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate) సమర్పించనవసరం లేదని మంత్రి ప్రకటించినప్పటికీ, వెరిఫికేషన్ సమయంలో కుటుంబ ఆర్థిక స్థితిని అధికారులు ప్రభుత్వ డేటా బేస్ ఆధారంగా ఆన్‌లైన్‌లో క్రాస్ చెక్ చేస్తారు.

దరఖాస్తుదారులకు ఆహార భద్రత కార్డు (Food Security Card) లేదా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటం ప్రాథమిక అర్హతగా పరిగణిస్తారు. ఇది ఒక కుటుంబం పేదరిక రేఖకు దిగువన (BPL) ఉందనడానికి ప్రధాన ఆధారం.

కుటుంబ సభ్యుల గుర్తింపు: ఒక కుటుంబం నుండి కేవలం ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. రేషన్ కార్డులో ఉన్న పేర్ల ఆధారంగా ఒకే కుటుంబం నుండి ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయా లేదా అనేది అధికారులు సులభంగా గుర్తిస్తారు.

బయోమెట్రిక్ & ఐడెంటిటీ: ఆధార్ నంబర్ ద్వారా దరఖాస్తుదారుడి అసలు గుర్తింపును (Identity) నిర్ధారిస్తారు.

ఆస్తుల తనిఖీ: ఆధార్ నంబర్‌ను రిజిస్ట్రేషన్ల శాఖ (Registration Department) డేటాతో లింక్ చేసి చూస్తారు. హైదరాబాద్ CURE లేదా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో దరఖాస్తుదారుడి పేరు మీద గానీ, వారి కుటుంబ సభ్యుల పేరు మీద గానీ ఇప్పటికే ఏదైనా సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉందో లేదో దీని ద్వారా తనిఖీ చేస్తారు. ఒకవేళ ఆస్తులు ఉంటే ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.

డూప్లికేట్ అప్లికేషన్ల గుర్తింపు: ఒకే వ్యక్తి వేర్వేరు నియోజకవర్గాల్లో దరఖాస్తులు చేసుకుంటే ఆధార్ నంబర్ ద్వారా దొరికిపోతారు. అలాంటి డూప్లికేట్ అప్లికేషన్లను సిస్టమ్ ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది.

స్థానికత: దరఖాస్తుదారుడు హైదరాబాద్ పరిధిలోనే కనీసం 10 ఏళ్లుగా నివసిస్తున్నారా లేదా అనేది కూడా ఆధార్‌లోని అడ్రస్ లేదా ఇతర ప్రభుత్వ రికార్డుల ద్వారా అధికారులు క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారు.

హైదరాబాద్ CURE పరిధిలోని ఈ ఇందిరమ్మ ఫ్లాట్ల దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ మరియు లక్కీ డ్రా నిర్వహణ ప్రక్రియలను తెలంగాణ గృహనిర్మాణ శాఖ మరియు జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


2) రేషన్ కావాలంటే eKYC తప్పదు.. ఆగస్టు 31 డెడ్‌లైన్!

తెలంగాణలో సుమారు 1.06 కోట్లకు పైగా రేషన్ (ఆహార భద్రత) కార్డులు ఉన్నాయి. ఈ-కేవైసీ (e-KYC) అప్‌డేట్ చేయడానికి చివరి గడువును ఆగస్ట్ 31, 2026 వరకు వుంది. అయితే ఆగస్టు 15న సీఎం రేవంత్‌రెడ్డి రేష‌న్ కార్డుల‌కు సంబంధించి కొత్త పీవీసీ కార్డుల పంపిణీ ప్రారంభించారు. అయితే కొత్త కార్డులు కావాల‌న్నా సెప్టెంబ‌ర్ నెల నుంచి రేష‌న్ కావాల‌న్న ఈకేవైసీ పూర్తి కావాల్సిందే. ఇప్ప‌ట్టి వ‌ర‌కు కేవ‌లం 75% మాత్ర‌మే ఈకేవైసీ జ‌రిగింది.

రేషన్ కార్డు ద్వారా చౌక ధరలకు లేదా ఉచితంగా సన్నబియ్యం పొందవచ్చు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందడానికి ఇది ప్రధాన ఆధారంగా పనిచేస్తుంది.

తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఆగస్టు 31లోపు eKYC పూర్తి చేసుకోవాలి. రేషన్ పంపిణీలో పారదర్శకత తీసుకురావడంతో పాటు.. అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. గడువులోగా eKYC పూర్తి చేసుకోకపోతే.. భవిష్యత్‌లో రేషన్ పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

eKYC కోసం లబ్ధిదారులు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. సమీపంలోని రేషన్ షాప్‌లోనే ఉచితంగా eKYC చేయించుకోవచ్చు. అక్కడ ఉన్న e-POS యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. రేషన్ షాప్‌లో వీలుకాని వారు సమీపంలోని మీసేవా కేంద్రంలో కూడా eKYC పూర్తి చేసుకోవచ్చు. వెళ్లేటప్పుడు ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు.. అందులో పేరున్న కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు వెంట తీసుకెళ్లాలి.

మీ eKYC పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి రేషన్ షాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ Smart PDS వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. Beneficiary Details ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రేషన్ కార్డు నంబర్, క్యాప్చా నమోదు చేస్తే.. కార్డులో ఉన్న సభ్యుల వివరాలతో పాటు వారి eKYC స్టేటస్ కనిపిస్తుంది. స్టేటస్ Active లేదా Verifiedగా ఉంటే.. eKYC పూర్తయినట్లు అర్థం.

స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే eKYC చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ముందుగా Google Play Store నుంచి State eKYC App, Aadhaar Face RD Appలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. State eKYC App ఓపెన్ చేసి Telanganaను ఎంచుకోవాలి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేసి.. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTPతో వెరిఫై చేయాలి. స్క్రీన్‌పై eKYC స్టేటస్ కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తయితే గ్రీన్ టిక్ కనిపిస్తుంది. లేకపోతే FACE eKYC ఆప్షన్ ద్వారా ప్రక్రియను కొనసాగించాలి.

Face eKYC కోసం ముందుగా నిబంధనలను Accept చేయాలి. ఆ తర్వాత ఫోన్ ఫ్రంట్ కెమెరా ముందు ముఖాన్ని ఉంచి.. యాప్ సూచనల ప్రకారం Face Scan పూర్తి చేయాలి. కళ్లను ఆర్పడం వంటి సూచనలను పాటిస్తే ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. స్కాన్ విజయవంతమైతే స్క్రీన్‌పై Green Tick కనిపిస్తుంది. అంటే మీ eKYC పూర్తయినట్లే.

కాబట్టి గడువు దగ్గర పడే వరకు వేచి ఉండకుండా.. ఆగస్టు 31లోపే కుటుంబ సభ్యులందరి eKYC పూర్తి చేసుకోవడం మంచిది.

మీ ఫోన్‌లోనే eKYC ప్రక్రియ చేసుకోవాలంట‌...

1. యాప్స్ డౌన్‌లోడ్ముందుగా Google Play Storeలో State eKYC App డౌన్‌లోడ్ చేసుకోవాలి.అదే Play Store నుంచి Aadhaar Face RD Appను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

2. రాష్ట్రం ఎంపికState eKYC App ఓపెన్ చేయాలి.రాష్ట్రాల జాబితాలో Telanganaను సెలెక్ట్ చేయాలి.

3. ఆధార్ వెరిఫికేషన్12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేసి NEXTపై క్లిక్ చేయాలి.ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.

4. eKYC స్టేటస్ చెక్వెరిఫికేషన్ తర్వాత స్క్రీన్‌పై మీ వివరాలు కనిపిస్తాయి.eKYC పూర్తయితే Green Tick (✔) కనిపిస్తుంది.eKYC పూర్తి కాకపోతే Empty లేదా Dash (—) కనిపిస్తుంది.

5. Face eKYC పూర్తి చేయడంeKYC పెండింగ్‌లో ఉంటే FACE eKYC ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

నిబంధనలను Accept చేసి ఫోన్ కెమెరాను ఓపెన్ చేయాలి.

ఫ్రంట్ కెమెరా ముందు ముఖాన్ని ఉంచి సూచనల ప్రకారం కళ్లను ఆర్పుతూ Face Scan పూర్తి చేయాలి.స్కాన్ విజయవంతమైతే Green Tick కనిపిస్తుంది.ఇంతటితో Face eKYC పూర్తవుతుంది.


3) పాత ఆటోకు గుడ్‌బై..ఈవీకి మారితే రూ.1.50 లక్షల సబ్సిడీ!

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు.. ఆటో డ్రైవర్లను ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026’ను అమలు చేయనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించింది. రాష్ట్రంలో 5.15 లక్షలకు పైగా ఆటోలు రిజిస్టర్ అయి ఉండగా.. హైదరాబాద్‌లోనే 2 లక్షలకు పైగా ఆటోలు తిరుగుతున్నట్లు అంచనా. వీటిలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈవీ మార్పిడిపై ఫోకస్ పెట్టింది.

CURE పరిధిలోని 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 11,254 డీజిల్ ఆటోలు, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి. ఒక్కో ఆటోకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ లేదా ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకానికి అవసరమైన రూ.200 కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున సమకూర్చేలా ప్రతిపాదించారు. ORR లోపల తిరిగే ఆటోల కాలుష్య ఉద్గారాలను తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

పాత ఆటోను ఎలక్ట్రిక్‌గా మార్చుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రెండు మార్గాలను అందిస్తోంది. మొదటిది.. AIS-123 నిబంధనలకు అనుగుణంగా ఆమోదిత ఎలక్ట్రిక్ కిట్‌ను పాత ఆటోకు అమర్చుకోవడం. రెండోది.. పాత ఆటోను మార్చుకుని కొత్తగా ఫ్యాక్టరీలో తయారైన ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడం. ఈ రెండు విధానాల్లోనూ అర్హత ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.

అయితే సబ్సిడీ అందుతున్నా.. మిగిలిన మొత్తాన్ని భరించడం పేద ఆటో డ్రైవర్లకు భారంగా మారే అవకాశం ఉందని ఆటో సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు ఈవీ ఆటోలు పెరగాలంటే చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సబ్సిడీ పొందే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు.. ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

పథకం అమలు కోసం రాష్ట్రం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీకి రోడ్లు-భవనాలు, రవాణాశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. రవాణాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో పథకం అమలు కమిటీ పనిచేస్తుంది. ఇక జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన మంజూరు కమిటీలు అర్హుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, సబ్సిడీ మంజూరు ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. మొత్తంగా.. ఆటో డ్రైవర్లకు ఆర్థిక అండతో పాటు హైదరాబాద్‌కు కాలుష్య నియంత్రణ అందించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

Read More
Next Story