
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.8 వేల కోట్ల బకాయిలు: సీఎం రేవంత్
పరీక్షల లీకేజీలు, హైడ్రా, విద్యా సంస్కరణలు, కేంద్రంతో సమావేశంపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియంబర్స్‌మెంట్ అంశంలో సరికొత్త విధానం తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగానే ఫీజు రియంబర్స్‌మెంట్ అంశంపై ఏపీ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గత ప్రభుత్వం వదిలిన బకాయిలే ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయని, పిల్లల జీవితాలను భారంగా మారుస్తున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ భారం ఉన్నప్పటికీ అర్హులైన విద్యార్థులకు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఏ ఏడాదికి సంబంధించిన ఫీజులు అదే ఏడాదిలో పూర్తిగా చెల్లించే విధానం అమలు చేస్తామని చెప్పారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,200 నుంచి రూ.2,400 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. అవసరమైతే ముందుగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. వసతులు లేకుండా తప్పుడు లెక్కలు చూపిన విద్యాసంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కొనసాగుతోందన్నారు. నిబంధనలు పాటించిన సంస్థలకు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఆన్‌లైన్ పరీక్షల్లో సమస్యలు తక్కువగా ఉంటాయని, ఆఫ్‌లైన్ పరీక్షల్లోనే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అనుమతి లేకుండా పెరుగుతున్న కోచింగ్ సెంటర్లపై దేశవ్యాప్తంగా ఒకే విధానం అవసరమని సూచించారు. గ్లోబరీనా వంటి సంస్థలపై గతంలో చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు సీబీఎస్ఈ వరకు విస్తరించాయని విమర్శించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసిన తర్వాత పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వాటిపై సానుకూల స్పందన వచ్చిందని వెల్లడించారు. హైడ్రాపై కూడా సీఎం స్పందించారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడటమే హైడ్రా బాధ్యత అని చెప్పారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, అదే సమయంలో హైడ్రా పనులు కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

