
నీలోఫర్ కప్పు ఇరానీ చాయ్ : ఇక ప్రియం (ఎక్స్ పోస్టు)
కప్పు ఇరానీ చాయ్ రూ.80! నీలోఫర్ ధరల పెంపుపై హైదరాబాదీల ఆగ్రహం
రూ.80 ధరపై చర్చ,టీ ధరల పెంపుపై సోషల్ మీడియాలో నిరసనలు
హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఇరానీ చాయ్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చాయ్ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కేఫ్ నీలోఫర్ కప్పు టీ ధరను రూ.80కు పెంచడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు ‘ఇరానీ చాయ్ బాయ్‌కాట్’కు పిలుపునిస్తూ తక్కువ ధరల కేఫ్‌లకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
పార్శిల్ టీ కప్పు రూ.90
వేడివేడిగా పొగలు కక్కతూ ఉండే హైదరాబాదీ ఇరానీ చాయ్ ప్రత్యేకత వేరు.పర్షియన్ వ్యాపారస్థుల ద్వారా ఈ చాయ్ పరిచయమై 600 ఏళ్ల హైదరాబాద్ నగర సంస్కృతిలో భాగమైంది.1978 వ సంవత్సరం నుంచి నగరంలో ఒక ప్రసిద్ధ చాయ్ కేంద్రంగా ఉన్న కేఫ్ నీలోఫర్ మే నెల 20వతేదీ నుంచి టీ ధరలను అనూహ్యంగా పెంచింది. కప్పు టీ ధర రూ.80, ఒక సింగిల్ టీ ధర రూ. 60, పార్శిల్ టీ ధర 90రూపాయలకు పెంచింది. ప్రసిద్ధి చెందిన నీలోఫర్ కేఫ్‌లో ఆకర్షణీయమైన సైన్ , మెనూ బోర్డులో పెరిగిన ధరలను ఉంచారు.
నీలోఫర్ ఇరానీ చాయ్ ధరల పెంపు పట్టిక
నెటిజన్ల ఆగ్రహం...ఇరానీ చాయ్ బాయ్ కాట్ కు పిలుపు
ఇరానీ చాయ్ ధరల పెంపుపై హైదరాబాదీల్లో వ్యతిరేకత మొదలైంది. ఆకస్మికంగా ఇరానీ చాయ్ ధరల పెంపుపై చాలా మంది చాయ్ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కప్పు ఇరానీ టీ ధరను 80రూపాయలకు పెంచడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిర్యాదుల వర్షం కురిపిస్తున్నారు. కొందరు చాయ్ ప్రియులైతే ఏకంగా ఇరానీ చాయ్ బాయ్ కాట్ కు పిలుపునిచ్చారు. కప్పు టీ ధర 80 రూపాయలకు పెంచడంపై పలువురు చాయ్ ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ ధరల పెంపుతో ‘‘నక్కో జావో భాయ్ నీలోఫర్ కో’’అంటూ నెటిజన్లు ప్రచారం ప్రారంభించారు.
ఇరానీ చాయ్ లగ్జరీనా ?
హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ తాగడం సాధారణ దైనందిన చర్య. టెకీల నుంచి రోజువారీ కూలీల వరకు ప్రతి ఒక్కరూ స్థానిక కేఫ్‌లలో గుమిగూడి అక్కడ వేడి వేడి ఒక్క కప్పు చాయ్ తాగుతుంటారు. ఇరానీ చాయ్ ఎప్పుడూ ఖరీదైనదిగా ఉండకూడదు. పాలు, టీ ఆకులు, నీళ్లు వంటి పదార్థాలకు రూ.80 వసూలు చేయడం అన్యాయమని స్థానిక ప్రజలు వాదిస్తున్నారు.ఇరానీ చాయ్ బహిష్కరణకు పిలుపునిస్తున్న వారు కేఫ్ నీలోఫర్‌కు వెళ్లడం మానేసి, తక్కువ ధరలు ఉన్న చిన్న కేఫ్‌లకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.
హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ కేవలం ఒక పానీయం కాదు.. అది నగర జీవనశైలిలో భాగం. అయితే తాజా ధరల పెంపు చాయ్ ప్రియుల జేబుపై భారంగా మారడంతో ఈ నిర్ణయం ఎంతవరకు సఫలమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల స్పందన నేపథ్యంలో కేఫ్ యాజమాన్యం తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
Next Story

