
కొల్లాపూర్ మామిడితోట : రైతులకు చేదు ఫలాలు
తోటలో తీయ మామిడి, బతుకులో చేదు పోదు
ఇదీ కొల్లాపూర్ కథ. దిగుబడి తగ్గింది…ధర లేదు.
ఫలాల్లో రారాజుగా పేరొందిన మామిడి పండ్లలో తియ్యదనానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొల్లాపూర్ రకం మామిడి ఈసారి రైతులకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిలిస్తోంది. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ దళారులు, వ్యాపారుల కుమ్మక్కుతో ఆశించిన ధర దక్కక మామిడి రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. దీనికితోడు గాలివానలు, వడగళ్ల వానలతో పూత, పిందె దశలోనే రాలిపోవడంతో మామిడి దిగుబడి తగ్గింది. జీఐ ట్యాగ్ లేకపోవడం, మార్కెట్ సదుపాయాల లోపం, అనుబంధ పరిశ్రమల కొరత...అన్నీ కలిసి కొల్లాపూర్ మామిడి రైతుల పరిస్థితిని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి.
అత్యంత తియ్యగా ఉండే కొల్లాపూర్ రకం మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. కొల్లాపూర్ రకం మామిడి రకం తోటలు నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో 57,344 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు.తెలంగాణలోని కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా, దళారులు, వ్యాపారులు కుమ్మక్కవడంతో రైతులకు ఆశించిన మేర ధర లభించడం లేదు.
గాలివానల వల్ల పూత, పిందెలు రాలి తగ్గిన దిగుబడి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 17,,284 మంది మామిడి రైతులు ఏటా సాధారణంగా 2,29,376 టన్నుల పండ్లను దిగుబడి చేస్తున్నారు.
ఎకరానికి 4 టన్నుల చొప్పున దిగుబడి వస్తుందనుకుంటే ఈ ఏడాది వడగళ్ల వర్షాలు, తీవ్ర గాలుల వల్ల పూత, పిందె దశలో రాలడంతో దిగుబడి తగ్గిందని కొల్లాపూర్ మామిడి రైతు కె. నారాయణరెడ్డి ఆవేదనగా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తామరపురుగుల బెడదతో తీరని నష్టం
కొల్లాపూర్ మామిడి తోటల్లో రసం పీల్చే తామర పురుగులు ఆశించడంతో కాయలు గరకుగా తయారయ్యాయని మహబూబ్ నగర్ జిల్లా ఉద్యానశాఖ అధికారి టి వేణుగోపాల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంచు కురవడంతోపాటు గాలివానల వల్ల మామిడి పూత, పిందె రాలి మామిడి దిగుబడి 20 శాతం తగ్గిందని ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రతిపాదనల్లోనే జీఐ ట్యాగ్
తియ్యదనంతో పాటు నాణ్యత గల ఈ అరుదైన మామిడి పండ్లకు జియోగ్రాఫికల్ ట్యాగ్ ఇవ్వాలని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసినా ఇంకా ప్రతిపాదనల్లోనే మగ్గుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోని అయిదు జిల్లాల్లో కొల్లాపూర్ మామిడిని 57,344 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కొల్లాపూర్ మామిడికి విశిష్ఠత ఉన్నా, ఈ ఏడాది సరైన మార్కెట్ లేదు.
ఇప్పటికైనా తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్శిటీ, ఉద్యానవన శాఖ అధికారులు జోక్యం చేసుకొని కొల్లాపూర్ మామిడికి జీఐ ట్యాగ్ వచ్చేలా చేయాలని రైతులు కోరుతున్నారు.
రామాపురంలో మామిడి మార్కెట్ యార్డు నిర్మాణమేది?
కొల్లాపూర్ మండలంలోని రామాపురంలో మామిడి మార్కెట్ యార్డు నిర్మాణానికి నిధులు విడుదల చేసినా నిర్మాణం చేపట్టలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రామాపురం గ్రామంలో మామిడి మార్కెట్ నిర్మాణం కోసం 4 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఈ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం రూ.15కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.నిధులు కేటాయించినా స్థల సేకరణ జరగక పోవడంతో మార్కెట్ నిర్మాణం కాలేదు.గతంలో మామిడి రైతుల సమాఖ్యను ఏర్పాటు చేసి మామిడి పండ్లను కొనుగోలు చేసినా దాన్ని నిలిపివేశారు. గతంలో కొల్లాపూర్ మామిడికి మంచి ధర కల్పించడం కోసం మహిళా డ్వాక్రా సంఘాల ద్వారా మామిడిపండ్లను కొనుగోలు చేయించినా, దాన్ని కొనసాగించలేదు.
మామిడి అనుబంధ పరిశ్రమలేవి?
కొల్లాపూర్ మామిడికి మంచి ధర లభించాలంటే దీనికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొల్లాపూర్ మామిడి పండ్ల నుంచి పల్ప్ తీసి నిల్వ చేసే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. మామిడి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి చర్యలు తీసుకోక పోవడంతో మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు. కొల్లాపూర్ మామిడితో మామిడి తాండ్ర, జామ్, జెల్లీ, పానీయాల తయారు చేయడం, ఆమ్ చూర్, నిల్వ పచ్చళ్ల యూనిట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి.
మామిడి పండ్ల విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులకు మంచి ధర లభించడంతో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదని మామిడి రైతులు ఆవేదనగా చెప్పారు.
బయ్యర్లు, దళారులదే రాజ్యం
కొల్లాపూర్ ప్రాంతానికి పొరుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్స్ వచ్చి తక్కువ ధరకు మామిడిని కొని మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులదే రాజ్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాపారులు వచ్చి తక్కువ ధరకు కొల్లాపూర్ మామిడిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. దీని వల్ల రైతులకు ఆశించిన మేర ధర లభించడం లేదు. రైతులు తమ మామిడి తోటలను మధ్య దళారులకు లీజుకు ఇస్తుండటం వల్ల వారికి సరైన ధర రావడం లేదు. కష్టపడి పండించిన మేలు రకమైన కొల్లాపూర్ మామిడికి సరైన మార్కెటింగ్ సదుపాయం లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడితోటలను బయ్యర్లు లీజుకు తీసుకోవడం వల్ల రైతులకు ఆశించిన మేర ఫలాలు దక్కడం లేదని హార్టికల్చర్ ఆఫీసర్ డి. వెంకటేశం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలు చొరవ తీసుకుని మార్కెట్ యార్డు నిర్మాణం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, జీఐ ట్యాగ్ సాధన దిశగా చర్యలు చేపడితేనే కొల్లాపూర్ మామిడి రైతుల జీవితాల్లో మళ్లీ తీపి తిరిగి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

