x

తెలంగాణలో భయపెడుతున్న ఎయిడ్స్ కేసులు

అధికారుల తాజా లెక్కల ప్రకారం సుమారుగా 1.30 లక్షల మంది ఎయిడ్స్ రోగులున్నారు.


తెలంగాణలో ఎయిడ్స్ కేసుల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. అధికారుల తాజా లెక్కల ప్రకారం సుమారుగా 1.30 లక్షల మంది ఎయిడ్స్ రోగులున్నారు. వీరంతా ప్రభుత్వ రికార్డుల్లో కనబడుతున్న రోగులు మాత్రమే. అనుమానంతో పరీక్షలు చేయించుకుని, హెచ్ఐవీ నిర్ధారణ అయిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారి వివరాలు, సంఖ్య ఎంత అన్న సమాచారం ప్రభుత్వం దగ్గరలేదు.

ఎయిడ్స్ రోగుల సంఖ్యకు సంబంధించి జాతీయ సగటు 0.24 అయితే తెలంగాణలో 0.48గా ఉండటం అంటే కచ్చితంగా ఆందోళనకరమనే చెప్పాలి. తెలంగాణలోని 33 జిల్లాల్లో మెదక్ జిల్లాలో పరిస్ధితి మరింత ఆందోళనగా ఉంది. దీంతో పాటు హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. మెదక్ జిల్లాలో 12 వేలమంది రోగులున్నారు. హెచ్ఐవీ సోకకుండా నియంత్రణకు ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో సమస్య ఎందుకు పెరిగిపోతోందో ఎవరికీ అర్ధంకావటంలేదు.

అధికారికంగా నమోదైన కేసులే 12 వేలుంటే ఇక అనధికారికంగా ఇంకెన్ని కేసులున్నాయో ఎవరికీ అర్దంకావటంలేదు. హెచ్ఐవీ ప్రధానంగా సెక్స్ వర్కర్ల వల్ల వ్యాప్తి జరుగుతోందని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ గుర్తించింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 7 వేలమంది సెక్స్ వర్కర్లున్నారు. వీరందిరకీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్ఐవీ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి చెబుతునే ఉంది. హెచ్ఐవీ పైన అవగాహనా కార్యక్రమాలను కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉమ్మడి జిల్లాలో 12 వేల కేసులు నమోదయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story