
ఎమ్మెల్సీపై ఎంఐఎం వేటు.. అసలు కారణమేంటి?
ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్‌ను ఎంఐఎం బహిష్కరించింది. రాజీనామాకు ఆదేశించింది. అయితే బహిష్కరణకు అసలు కారణంపై స్పష్టత రాలేదు.
తెలంగాణలో ఎంఐఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్‌పై వేటు వేసింది. పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే బేగ్‌ను ఎందుకు తొలగించారో పార్టీ స్పష్టంగా చెప్పకపోవడంతో ఈ వ్యవహారంపై ప్రశ్నలు మొదలయ్యాయి. బేగ్ ప్రస్తుతం ఉమ్రా యాత్రలో ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు, ఆయన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుస్తోంది. పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ ప్రకటన విడుదల చేశారు. బేగ్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా ఆదేశించారు.
అయితే ఇప్పటివరకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్‌కు బేగ్ రాజీనామా అందలేదు. మరోవైపు బహిష్కరణకు దారితీసిన అసలు కారణాలను ఎంఐఎం బహిరంగంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో బేగ్‌కు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వీడియోనే బహిష్కరణకు కారణమా అనే విషయంపై పార్టీ నుంచి స్పష్టత రాలేదు. ఎమ్మెల్సీపై తీసుకున్న చర్యకు కారణాలు బయటపెట్టాలని హైదరాబాద్ యూత్ కరేజ్ అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ డిమాండ్ చేశారు.
బేగ్‌పై ఫిర్యాదులు రావడంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెంటనే చర్యలు తీసుకున్నారని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. అయితే కారణాలు వెల్లడించకుండా బహిష్కరించడం సరికాదని అన్నారు. ఎంఐఎం ప్రజల ముందు నైతిక విలువలు, హక్కుల గురించి మాట్లాడుతుందని.. అలాంటి సమయంలో పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారంపై కూడా స్పష్టత ఉండాలని సల్మాన్ ఖాన్ కోరారు. అంతేకాదు, ఓ సిట్టింగ్ ఎంఐఎం ఎమ్మెల్యే, ఓ పార్టీ కార్పొరేటర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన ఆరోపించారు.
పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరి వ్యవహారాలను నాయకత్వం పరిశీలించాలని కోరారు. షేక్ సయీద్ బవాజిర్ హత్య కేసు విషయంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను కూడా సల్మాన్ ఖాన్ ప్రస్తావించారు. గతంలో చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చినా.. తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పార్టీ పదవుల్లో కొనసాగుతున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ యువమోర్చా నేత నితిన్ నందేకర్ కూడా బేగ్‌పై ఆరోపణలు చేశారు. గోషామహల్ ప్రాంతంలో స్థానిక కార్యకర్తలు, మున్సిపల్ అధికారులను బేగ్ తన పదవిని ఉపయోగించి బెదిరించేవారని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్లలోనే అధికారులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయని నందేకర్ పేర్కొన్నారు. బేగ్‌పై చర్యలు తీసుకోవడానికి ఆయన వ్యవహారశైలే కారణమై ఉండొచ్చని అన్నారు. అయితే ఈ ఆరోపణలపై మిర్జా రహమత్ బేగ్ వైపు నుంచి ఎలాంటి స్పందన ఉన్నట్లు సమాచారం లేదు. బేగ్‌ను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో ఎంఐఎం నాయకత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని సల్మాన్ ఖాన్, నితిన్ నందేకర్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బేగ్ రాజీనామా కౌన్సిల్ చైర్మన్‌కు అందలేదు. దీంతో బహిష్కరణకు అసలు కారణాలపై ఎంఐఎం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

