
ఎంఎంటీఎస్ రైలులో మహిళా ప్రయాణికులకు పింక్ పెట్రోల్ టీం సాయం (ఫొటో : దక్షిణమధ్య రైల్వే సౌజన్యంతో)
ఎంఎంటీఎస్‌లో మహిళల భద్రతపై అలర్ట్:డ్రోన్లతో ‘పింక్ పెట్రోల్’
ఎంఎంటీఎస్‌లో ఆకతాయిల అడ్డుకట్టకు హైటెక్ నిఘా
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ, భద్రతను బలోపేతం చేయడానికి రైల్వే శాఖ కీలక చర్యలు ప్రారంభించింది. డ్రోన్ టెక్నాలజీతో ‘పింక్ పెట్రోల్’, ‘శక్తి సాథీ’ వంటి ఆధునిక వ్యవస్థలతో మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో మహిళా ప్రయాణికులపై ఇటీవల ఆకతాయిల లైంగిక వేధింపుల ఘటనలు పెరిగాయి.మహిళా ప్రయాణికుల భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. గత ఏడాది మార్చిలో జరిగిన ఒక ఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
మహిళపై అత్యాచార యత్నం
గత ఏడాది మార్చి 22వతేదీన సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలులో 23 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని యువకుడు లైంగికంగా వేధించడంతోపాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.దీంతో బాధిత యువతి ఆకతాయి బారి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలు నుంచి దూకి తీవ్ర గాయాలపాలైంది.ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే, మరో రైలులో చిన్నారిని వేధించి వీడియోలు తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది.డబీర్‌పూర స్టేషన్ వద్ద మహిళా కోచ్‌లోకి వచ్చిన కొందరు యువకులు వికృతంగా ప్రవర్తించి భయాందోళనలకు గురిచేశారని రైల్వే పోలీసులకు కొందరు యువతులు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనలు జరిగిన బోగీలో ఆర్పీఎఫ్ సిబ్బంది లేకపోవడం, రైలులో సీసీ కెమెరాలు లేకపోవడం వంటి భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఈ ఘటన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మహిళలు పోలీసులను ఆశ్రయించేలా రైళ్లలో 'పానిక్ మోడ్ బటన్స్' ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
పింక్ పెట్రోల్ ప్రారంభం
ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్ సాంకేతికతతో కూడిన 'పింక్ పెట్రోల్' వ్యవస్థను గురువారం కాచిగూడ రైల్వే స్టేషనులోప్రారంభించారు.భారతీయ రైల్వేలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన డ్రోన్‌లను డీజీసీఏ (DGCA) ఆమోదించిన ఆర్పీఎఫ్ (RPF) మహిళా కానిస్టేబుళ్లు నిర్వహిస్తున్నారు.
వాట్సాప్ ఫిర్యాదులకు శక్తి సాథీ
ఎంఎంటీఎస్ రైళ్లలో లైంగిక వేధింపులపై 'శక్తి సాథీ' వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మహిళా ప్రయాణికులు నేరుగా ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సాయం పొందవచ్చు.ప్రయాణికులు నేరుగా సమాచారం అందించడానికి 'శక్తి సాథీ' వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు.
అత్యాధునిక డ్రోన్‌లు
హైదరాబాద్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ఎంఎంటీఎస్ సబర్బన్ రైళ్లలో మహిళల భద్రతను పెంపొందించడానికి 'పింక్ పెట్రోల్' డ్రోన్ బృందాలను ప్రారంభించింది.పింక్ పెట్రోల్ కింద, అధునాతన నిఘా సాంకేతికతతో కూడిన అత్యాధునిక డ్రోన్‌లను మోహరించారు. వీటిలో థర్మల్ ఇమేజింగ్ సెన్సార్లు, నైట్ విజన్ సామర్థ్యం గల ఆప్టిక్స్, హై-డెఫినిషన్ రియల్-టైమ్ వీడియో ప్రసారం, కచ్చితమైన పర్యవేక్షణ కోసం లాంగ్-రేంజ్ జూమ్ సామర్థ్యాలు, కదులుతున్న రైళ్లను నిరంతరం ట్రాక్ చేయడానికి స్థిరీకరించిన ఏరియల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.
పింక్ పెట్రోల్ ఎలా పనిచేస్తుందంటే...
పింక్ పెట్రోల్ డ్రోన్స్ టీంను మహిళా ఆర్ పీ ఎఫ్ కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేశఢారు. ప్రతీరోజు లక్షలాది మంది మహిళా ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్ పీ ఎఫ్ కంట్రోల్ టీంకు మహిళా ప్రయాణికులు శక్తి సాథి వాట్సాప్ ద్వారా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయగానే డ్యూటీలో ఉన్న ఆర్ పీఎఫ్ ఇన్ స్పెక్టరు దాన్ని ఆర్ పీ ఎఫ్ డ్రోన్ టీంకు పంపిస్తారు. డ్రోన్ టీంకు శక్తిసాధీ టీం నుంచి సమాచారం రాగానే దాన్ని రైల్వే స్టేషనులో ఉన్న మహిళా ఆర్ పీ ఎఫ్ బృందానికి తెలియజేస్తారు. వారు రైలు స్టేషనులో ఆగగానే ఈవ్ టీజర్లను అరెస్టు చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేస్తారు.
పానిక్ బటన్లు : ప్రతి మహిళా కోచ్‌లో కంట్రోల్ రూమ్, రైలు గార్డుతో అనుసంధానిస్తూ 'పానిక్ బటన్'లను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని రైళ్లలో మాత్రమే ఉన్న సీసీ కెమెరాలను, అన్ని ఎంఎంటీఎస్ రైళ్ల మహిళా బోగీల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మేరీ సహేలి బృందాలు: మహిళా ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేకంగా 'మేరీ సహేలి' బృందాలు రైళ్లలో పర్యటిస్తూ, భద్రతాపరమైన ఇబ్బందులను గమనిస్తున్నాయి. మహిళా బోగీల్లోకి పురుష ప్రయాణికులు ఎక్కితే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
మహిళా ప్రయాణికులకు సూచనలు
రైలులో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 139 (రైల్వే హెల్ప్‌లైన్) కి కాల్ చేయాలని ఆర్ పీ ఎఫ్ కోరింది.ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే రైలులోని అలారం చైన్‌ను లాగాలి లేదా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలి.
మహిళల భద్రత కేవలం రైల్వే ప్రొటెక్షన్ పోలీసుఅధికారుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రయాణికుల సహకారంతోనే మరింత బలపడుతుంది. అనుమానాస్పద ఘటనలు కనిపించిన వెంటనే స్పందించడం, హెల్ప్‌లైన్‌లను వినియోగించడం ద్వారా సురక్షిత ప్రయాణ వాతావరణాన్ని అందరూ కలసి ఏర్పాటు చేసుకోవాలి.
Next Story

