జాతీయ ప్రయోజనాల కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: ప్రధాని మోదీ పిలుపు
x

జాతీయ ప్రయోజనాల కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: ప్రధాని మోదీ పిలుపు

దేశమే ఫస్ట్ అనే నినాదం అందరూ పాటించాలని పిలుపు


Click the Play button to hear this message in audio format

మహిళా రిజర్వేషన్ల అమలుపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్న వేళ.. అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ సంస్థలు సమష్టిగా ముందుకు సాగాలని కోరారు.

దేశ ప్రజలు ముందుగా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే ‘నేషన్ ఫస్ట్’ సంకల్పాన్ని తీసుకోవాలని మోదీ సూచించారు. రాముడి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే పాలన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.
రామరాజ్యం అంటే వివక్షకు తావులేకుండా అందరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమేనని వివరించారు. దేశానికి హాని కలిగించే శక్తులు, సమాజానాన్ని విభజించే వ్యక్తులు, మన సంస్కృతిని ద్వేషించే మనస్తత్వాలు దేశానికి చాలా ప్రమాదమని హెచ్చరించారు.
దేశంలో రెజిమ్ ఛేంజ్(పాలకుల మార్పు తెస్తామని) సీజేపీ, కొన్ని ఎన్జీఓలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ తెలిపారు. దేశ వనరులపై నమ్మకంతో, సొంత శ్రమతో సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న సమయంలో ప్రధాని ఈ మేరకు పిలుపునిచ్చారు. ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, పార్లమెంటులో బిల్లుపై చర్చకు ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. ఇప్పటికే పలు పార్టీలతో చర్చలకు ప్రయత్నించామని, బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సహకారం అందించాలని కోరారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి గత ఏప్రిల్‌లో లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ప్రతిపాదన ఆమోదం పొందలేదు. ప్రస్తుతం ఈ బిల్లుపై మరోసారి ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు, పరస్పర సహకారం తదుపరి పరిణామాల్లో కీలకం కానున్నాయి.
లోక్ సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం, అలాగే ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లను 543 నుంచి 815కు పెంచేందుకు అధికార పక్షాలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే రెండింట మూడు వంతుల మెజారిటీ అవసరం.
ఆగష్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను ఇంకా వాయిదా వేయకపోవడంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దపడుతుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
Read More
Next Story