
ఇంటర్ సీటు కావాలంటే డ్రగ్ అఫిడవిట్ రూల్ !
తెలంగాణ ఇంటర్ 2026 అడ్మిషన్లలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆధార్‌తో పాటు ప్రత్యేక డిక్లరేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఇంటర్ అడ్మిషన్ల వేళ తెలంగాణ ఇంటర్ బోర్డ్ సరికొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. 2026-2027 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్ తీసుకునే ప్రతి విద్యార్థి కూడా యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీనిని సమర్పించాలి. ఈ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాతే అడ్మిషన్ ఖరారు అవుతుందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన “నషా ముక్త్ తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.
అఫిడవిట్‌లో విద్యార్థులు క్యాంపస్‌లో డ్రగ్స్ వాడకూడదని, వాటికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదని అంగీకరించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే మెడికల్ టెస్టులకు సహకరించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. నోటరీ అఫిడవిట్ అవసరమైతే విద్యార్థులు, తల్లిదండ్రులు లాయర్లను సంప్రదించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
దీంతో అదనపు ఖర్చు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణ రాతపూర్వక డిక్లరేషన్ తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుకుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ కూడా ఈ అంశంపై స్పష్టత కోరారు. నోటరీ ప్రక్రియ వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అందుకే సులభమైన విధానం తీసుకురావాలని బోర్డును కోరినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తొలి విడత అడ్మిషన్లు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ మే 31 వరకు కొనసాగుతుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తొలి విడత అడ్మిషన్లు జూన్ 30లోపు పూర్తి చేయాలని బోర్డు ఆదేశించింది. అడ్మిషన్ల కోసం జూనియర్ కాలేజీలు ఎలాంటి ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు స్పష్టం చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగానే సీట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆన్‌లైన్ మార్క్స్ మెమో ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు ఇవ్వొచ్చని, కానీ ఒరిజినల్ మెమో సమర్పించిన తర్వాతే ఫైనల్ అడ్మిషన్ ఖరారు అవుతుందని తెలిపింది. ఇక అన్ని విద్యార్థులకు ఆధార్ వివరాలు కూడా తప్పనిసరి చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

