‘నెలరాజు’ నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
x

‘నెలరాజు’ నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బుదవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపు పది హేను రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత మూడు నాలుగు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వైద్యలు పర్యవేక్షణలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే బుధవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.

‘నెలరాజు’ ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనను చెప్పుకుంటున్నా.. ఆ కుర్చీలో ఆయన ఉన్న సమయం తక్కువే. 16 ఆగస్టు 1984 నుంచి 16 సెప్టెంబరు 1984 వరకు అంటే సరిగ్గా 31 రోజులు నెల రోజులు ఆయన ముఖ్యమంత్రి పదవిలో బాధ్యతలు నిర్వర్దించారు. అందుకే ఆయనను చాలా మంది నెలరాజు అని పిలుస్తుంటారు.

నాదెండ్ల ప్రస్థానం..

ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, గతంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశాయి. 1936 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు, న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన ఆయన, కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చెన్నారెడ్డి మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఆయన రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమైంది. ఎన్టీ రామారావుతో కలిసి ముందుకు సాగిన ఆయన, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరించినట్లు పలుమార్లు చెప్పారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించగా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భాస్కరరావు ఆర్థిక మంత్రిగా కేబినెట్‌లో చేరారు.

1984లో ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో పార్టీలో సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సుమారు నెల రోజుల పాటు సీఎంగా కొనసాగారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం చాలా కాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2019లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీలో ముఖ్య నేతగా కొనసాగుతూ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read More
Next Story