
అనుమతులొచ్చాయి.. నిధులున్నాయి.. మరి RRR ఎందుకు ఆగింది?
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) అనుమతులొచ్చాయి.. నిధులున్నాయి.. మరి RRR ఎందుకు ఆగింది?
2) బొగ్గు నుంచి బంగారం వరకు.. సింగరేణి కొత్త ప్రయాణం!
3) పేరు నుంచి కులం వరకు.. జనగణనలో 40 వివరాలు!
1) అనుమతులొచ్చాయి.. నిధులున్నాయి.. మరి RRR ఎందుకు ఆగింది?
హైదరాబాద్ చుట్టూ మరో భారీ రింగ్ రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమైంది..! అనుమతులు వచ్చాయి..! జాతీయ రహదారి నంబర్ కేటాయించారు. వేల కోట్ల నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఒకే ఒక్క దశలో ప్రాజెక్టు మళ్లీ మళ్లీ ఆగిపోతోంది. అదే టెండర్ల ప్రక్రియ. టెండర్లు పిలిచారు. బిడ్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. కానీ బిడ్లను తెరవకముందే గడువును మళ్లీ మళ్లీ పొడిగిస్తున్నారు. అసలు హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది. ఎన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది? నిధులు సిద్ధంగా ఉన్నా, పనులు ఎందుకు మొదలు కావడం లేదు?
హైదరాబాద్ అభివృద్ధి దిశను మార్చే భారీ ప్రాజెక్టు. నగరంపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించే మరో వలయాకార రహదారి. పరిశ్రమలు, లాజిస్టిక్స్, కొత్త టౌన్‌షిప్‌లు, పెట్టుబడులకు కొత్త దారులు తెరిచే మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. అదే హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు.. ఆర్.ఆర్.ఆర్. హైదరాబాద్ చుట్టూ సుమారు 347 కిలోమీటర్ల మేర ఈ భారీ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, ORRకు సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది.
ఈ ప్రాజెక్టును ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఉత్తర భాగం. మరొకటి దక్షిణ భాగం. ముందుగా ఉత్తర భాగం గురించి చూస్తే, సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి ప్రారంభమై, యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు సుమారు 161.518 కిలోమీటర్ల మేర ఆరు వరసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. విస్తృతంగా చూస్తే, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్‌పూర్, భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాల మీదుగా ఈ మార్గం చౌటుప్పల్ వైపు చేరుతుంది. ఈ రహదారి అనేక ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానించే కీలక కారిడార్‌గా మారనుంది.
ఉత్తర భాగానికి ఇప్పటికే దాదాపు అన్ని కీలక అనుమతులు వచ్చాయి. ఈ రహదారికి NH-161AA నంబర్ కూడా కేటాయించారు. ప్రాజెక్టు కోసం కేంద్రం మొత్తం సుమారు రూ.23,935 కోట్లు కేటాయించింది. ఇందులో సివిల్ పనుల కోసం సుమారు రూ.9,362 కోట్లను హ్యామ్ పద్ధతిలో చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. అంటే, అనుమతులు ఉన్నాయి. జాతీయ రహదారి గుర్తింపు ఉంది. నిధుల కేటాయింపులు ఉన్నాయి. అయితే, అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే. పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదు?
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ఉత్తర భాగం నిర్మాణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఈ పనులకు మే 20న టెండర్లు పిలిచారు. మొదట బిడ్లు దాఖలు చేసేందుకు జూలై 6 వరకు గడువు ఇచ్చారు.ఆ తర్వాత, గడువును ఆగస్టు 6 వరకు పొడిగించారు. అక్కడితో ఆగలేదు. మరోసారి ఆగస్టు 20 వరకు గడువు పెంచారు. ఇప్పుడు మరోసారి. బిడ్ల గడువును సెప్టెంబర్ 23 వరకు పొడిగించారు. అంటే, టెండర్లు పిలిచారు. కానీ బిడ్లు ఖరారు కాలేదు. బిడ్లు తెరవాల్సిన దశకు వెళ్లకముందే గడువు మీద గడువు పెరుగుతోంది.
“అనుమతులు వచ్చినా, నిధులు సిద్ధంగా ఉన్నా, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ప్రయాణం టెండర్ల దగ్గరే ఆగిపోయింది. గడువు పదే పదే పొడిగించడంతో, ఈ భారీ ఎక్స్‌ప్రెస్‌వే పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న ప్రశ్న మరింత కీలకంగా మారుతోంది.
”ఇక రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం గురించి చూస్తే, చౌటుప్పల్ నుంచి ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూర్, ఆమనగల్, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల మీదుగా తిరిగి సంగారెడ్డి వరకు చేరేలా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. సుమారు 182 కిలోమీటర్ల మేర ఈ దక్షిణ భాగం విస్తరించనుంది. ఈ మార్గం విజయవాడ - శ్రీశైలం - బెంగళూరు వైపు వెళ్లే ప్రధాన జాతీయ రహదారులకు కీలక అనుసంధానాన్ని కల్పించనుంది. ప్రస్తుతం ఈ మార్గానికి సంబంధించి అలైన్‌మెంట్ ఖరారు కాగా.. తదుపరి దశల ప్రక్రియ కొనసాగుతోంది.
మొత్తం రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తెలంగాణలోని సుమారు 8 జిల్లాలు, 20 కీలక పట్టణాలు, 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామాలను అనుసంధానించేలా రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం ఒక రోడ్డు ప్రాజెక్టు మాత్రమే కాదు. హైదరాబాద్ చుట్టూ కొత్త అభివృద్ధి వలయాన్ని సృష్టించే ప్రణాళికగా కూడా భావిస్తున్నారు.రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే, హైదరాబాద్ నగరంలోకి రాకుండానే భారీ వాహనాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో నగర ట్రాఫిక్‌పై కొంత భారం తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలోకొత్త పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, కొత్త నివాస ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ రహదారి ఊతమివ్వొచ్చు. హైదరాబాద్‌కు చుట్టూ మరో అభివృద్ధి వలయం ఏర్పడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
అయితే, ఇంత భారీ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. నిధులు కేటాయించారు. జాతీయ రహదారి నంబర్ కూడా ఇచ్చారు. కానీ, టెండర్ల ప్రక్రియ మాత్రం ఎందుకు ముందుకు సాగడం లేదు? పదే పదే బిడ్ల గడువు ఎందుకు పెరుగుతోంది? కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేదా? టెండర్లకు సంబంధించిన ఆర్థిక లేదా సాంకేతిక అంశాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేక మరేదైనా కారణంతో ప్రక్రియ ఆలస్యమవుతోందా? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ చుట్టూ మరో భారీ అభివృద్ధి వలయం నిర్మించాలన్న కలకు ఆర్‌ఆర్‌ఆర్ కీలక ప్రాజెక్టు. ఉత్తర భాగానికి అనుమతులు ఉన్నాయి. నిధులు ఉన్నాయి. ప్లాన్ సిద్ధంగా ఉంది. కానీ, పనులు మాత్రం ఇంకా మొదలుకాలేదు. టెండర్ల గడువు మళ్లీ మళ్లీ పెరుగుతుండటంతో, సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే ఎప్పుడు నేలమీదకు వస్తుంది? అనేదే ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న.
2) బొగ్గు నుంచి బంగారం వరకు.. సింగరేణి కొత్త ప్రయాణం!
ఇప్పటివరకు ప్రధానంగా బొగ్గు ఉత్పత్తితో గుర్తింపు పొందిన సింగరేణి.. ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. బొగ్గుతో పాటు దేశానికి కీలకమైన ఖనిజాలపై కూడా దృష్టి సారించింది. ఇప్పుడు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణను సింగరేణి ప్రారంభించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ్ బ్లాక్‌లో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణ హక్కులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో ఈ బ్లాక్‌ను సింగరేణి దక్కించుకుంది.
దీంతో దేవదుర్గ్ తాలూకాలోని లింగదహళ్లి గ్రామంలో ఖనిజ అన్వేషణ కార్యక్రమాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్‌తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భట్టి విక్రమార్క స్వయంగా ఖనిజ అన్వేషణ ప్రాంతాలను పరిశీలించారు. సింగరేణి అధికారులు సేకరించిన వివిధ ఖనిజ నమూనాలను కూడా ఆయన పరిశీలించారు.
ఈ ప్రాంతంలో బంగారం, రాగి నిల్వలు విస్తృతంగా లభిస్తే.. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా..ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం దేవదుర్గ్ ప్రాంతంలో త్వరలోనే సింగరేణి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అవసరమైన మౌలిక సదుపాయాల్లో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేసే యోచన కూడా ఉంది. ఇది సింగరేణికి ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రధానంగా బొగ్గు రంగంలో పనిచేసిన సింగరేణి..ఇప్పుడు క్రిటికల్ మినరల్స్, రాగి, బంగారం వంటి ఇతర ఖనిజాల అన్వేషణపై కూడా దృష్టి పెడుతోంది. భవిష్యత్తులో దేశానికి అవసరమైన కీలక ఖనిజాల రంగంలో సింగరేణి పాత్రను విస్తరించడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది.
అదే రోజు బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కె.జె. జార్జ్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగరేణి, కర్ణాటక విద్యుత్ సంస్థ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో బొగ్గు తవ్వకాల కోసం కలిసి పనిచేసే అవకాశాలను కూడా పరిశీలించారు. కర్ణాటకలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తెలంగాణ నుంచి బొగ్గు సరఫరాపై కూడా చర్చ జరిగింది. మొత్తానికి.. బొగ్గు కంపెనీగా పేరున్న సింగరేణి.. ఇప్పుడు బంగారం, రాగి వంటి కొత్త ఖనిజాల వైపు అడుగులు వేస్తోంది. కర్ణాటకలోని దేవదుర్గ్‌లో జరుగుతున్న ఈ అన్వేషణలో గణనీయమైన ఖనిజ నిల్వలు బయటపడితే..సింగరేణికి కొత్త అవకాశాలు రావడమే కాకుండా.. స్థానిక ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది. బొగ్గు నుంచి క్రిటికల్ మినరల్స్ వరకు.. సింగరేణి ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది!
3) పేరు నుంచి కులం వరకు.. జనగణనలో 40 వివరాలు!
తెలంగాణలో జనగణన ప్రక్రియకు కీలక ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన జనగణన గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో పునఃప్రచురించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 29వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణన ప్రక్రియ కొనసాగనుంది.
దీంతో రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రక్రియ అధికారికంగా వేగం పుంజుకోనుంది. ఈసారి కేవలం జనాభా లెక్కలే కాదు, కులం, విద్య, ఉద్యోగం, వృత్తి, వలసలు సహా దాదాపు 40 రకాల వివరాలను సేకరించనున్నారు. 1948 జనగణన చట్టం ప్రకారం నియమితులయ్యే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలను సేకరించనున్నారు. సెప్టెంబర్ నెలలో ఇంటింటి వివరాల సేకరణ ప్రక్రియ కొనసాగనుంది.పేరు, వయస్సు, లింగం, వైవాహిక స్థితి వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేస్తారు. అదే సమయంలో కులం, ఉపకులం, మతం, సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ వివరాలు వంటి సామాజిక అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్య, ఉద్యోగం, వృత్తి వివరాలు కూడా. ప్రజలు ఏ స్థాయి వరకు చదివారు?, ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఏ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు?, వంటి వివరాలను కూడా నమోదు చేయనున్నారు.
ఈసారి జనగణనలో మరో ముఖ్యమైన అంశం. వలసల సమాచారం. ఒక వ్యక్తి ఎక్కడ పుట్టారు? ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? గతంలో ఎక్కడ ఉండేవారు? వంటి వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు.. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రజలకు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే.. Self Enumeration సదుపాయం కూడా కల్పించారు.అంటే ఎన్యూమరేటర్ ఇంటికి రావడమే కాకుండా.. నిర్ణయించిన విధానంలో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈసారి జనగణనపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం. కుల గణనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం. జనాభా సంఖ్యతో పాటు, సామాజిక నిర్మాణం, విద్యా స్థాయి, ఉపాధి పరిస్థితులు, వలసల ధోరణులు వంటి అంశాలపై విస్తృత సమాచారం సేకరించనున్నారు.
మొత్తానికి తెలంగాణలో జనగణన ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించడంతో.. ఇంటింటి వివరాల సేకరణకు మార్గం సుగమం కానుంది. ఈసారి కేవలం. “ఎంత మంది ఉన్నారు?” అనే లెక్క మాత్రమే కాదు. “ఎవరు? ఏ సామాజిక వర్గం? ఎంత చదివారు? ఏం పని చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు?” అనే అంశాలపై దాదాపు 40 రకాల వివరాలతో, జనగణన 2027 తెలంగాణలో కీలక ప్రక్రియగా మారనుంది.
Next Story

