ప్రభుత్వ ఆశలన్నీ యాదాద్రిపైనేనా ?
నాణ్యమైన బొగ్గు గ్రేడ్ 9 దొరకకపోవటంతో పాటు సాంకేతిక లోపాలతో జరగాల్సిన విద్యుత్ ఉత్పత్తి జరగటంలేదు
విద్యుత్ ఉత్పత్తి పెరిగే విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాదాద్రి పవర్ స్టేషన్ పైనే ఆశలు పెట్టుకున్నది. ఎందుకంటే ఎల్ నినో ప్రభావం కారణంగా తగ్గిపోతున్న విద్యుత్ ఉత్పత్తిని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషనే ఆదుకోవాలి. యాదాద్రి స్టేషన్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో నాలుగు స్టేషన్లు ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే నాణ్యమైన బొగ్గు గ్రేడ్ 9 దొరకకపోవటంతో పాటు సాంకేతిక లోపాలతో జరగాల్సిన విద్యుత్ ఉత్పత్తి జరగటంలేదు.
ఈ నేపధ్యంలోనే 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కెపాసిటితో ఐదో యూనిట్ ఉత్పత్తికి రెడీ అయ్యింది. మరో నెలరోజుల్లో కమర్షియల్ ఉత్పత్తి మొదలవుతుంది. గురువారం అధికారులు సింక్రనైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. ఐదు యూనిట్లలో మూడు యూనిట్లకు ఒడిస్సాలోని సింగరేణి గనుల నుండి గ్రేడ్ 9 బొగ్గు సరఫరా అవుతోంది. యూనిట్ తో పాటు కొత్తగా రెడీ అయిన 5 యూనిట్ కు ఒడిస్సాలోని మహానది కోల్ ఫీల్డ్స్, జార్ఖండ్ లోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి సరిపడా బొగ్గు సరఫరాకు కోల్ ఇండియా లిమిటెడ్ ఒప్పందం చేసుకున్నది.
5 యూనిట్లకు కలిపి ప్రతిరోజూ 27వేల టన్నుల బొగ్గు అవసరం. 28 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాల్సుండగా ప్రస్తుతం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉంటున్నాయి. కోల్ ఇండియా లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల పరిస్ధితి మారితే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రాన్ని కొంతమేర ఆదుకుంటుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఇందులోని ఐదు యూనిట్లలో మూడింటికి నైనీ నుండి మిగిలిన రెండు యూనిట్లకు కోల్ ఇండియా నుండి బొగ్గు సరఫరా అవుతుంది కాబట్టే విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం ఆశతో ఉంది.

