Secunderabad Cantonment
x

ఆర్మీ ఆయుధాలు చోరీ.. కంటోన్మెంట్‌లో హై అలెర్ట్!

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఆర్మీ ఆయుధాలు, 1,800కుపైగా బుల్లెట్లు మాయమయ్యాయి. పోలీసులు, ఆర్మీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.


సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలోని మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల దొంగతనం సంచలనంగా మారింది. ఆర్మీ ఆయుధాల స్థావరం నుంచే ఆయుధాలు దొంగతనం జరగటం కలకలం రేపుతోంది. ఆయుధాలు దొంగతనం జరిగినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ఆగస్టు 31వ తేదీన గుర్తించారు. వెంటనే బొల్లారం పోలీసుస్టేషన్లో ఆయుధాల దొంగతనంపై ఫిర్యాదు కూడా చేశారు. 12 మంది గార్డ్‌లు కాపలగా ఉన్న ఆయుధాల గది నుంచి మొత్తం 11 వెపన్స్ మిస్ అయినట్లు అధికారులు లెక్కతేల్చారు. దొంగతనాన్ని సిరయస్‌గా తీసుకున్న ఆర్మీ అధికారులు శాఖాపరంగా విచారణ చేస్తుండగా, పోలీసులు కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని సికింద్రాబాద్ కంటోన్నెంట్‌ ఏరియాలోని స్కూళ్ళల్లో తదుపరి ఆదేశాల వరకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వంతో ఆదేశాలు జారీచేయించారు.

ఆయుధాలుండే గదిలోకి వెళ్లే అనుమతి అతి తక్కువ మందికి మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. కొందరు మిలిటరీ అధికారులతో పాటు మరికొందరు ఆర్మీ ఉద్యోగులు మాత్రమే ఈ గదిలోకి వెళ్లగలరని వారు తెలిపారు. మిలిటరీ ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా గత కొన్ని రోజుల్లో ఈ గదిని ఎవరెవరు యాక్సెస్ చేశారు అన్న వివరాలను సేకరిస్తున్నారు.

చోరీ జరిగిన ఆయుధాల గదిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి పరిశీలించారు. అనంతరం ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె ప్రకటించారు. ఈ చోరీ ఒకేసారి జరిగిందా? లేకుంటే విడతల వారీగా జరిగిందా? ఇందులో ఆర్మీలోని ఎవరెవరి హస్తం ఉందనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు సుమతి తెలిపారు.

అత్యంత కట్టుదిట్టమైన సైనిక భద్రత ఉండే ప్రాంతంలో ఆయుధాలు ఉండ గది తలపులను బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడటంపై డీసీపీ అనేక అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. లోపలి సిబ్బంది ప్రమేయం ఉండొచ్చనే కోణంలో కూడా ర్యాప్తు చేస్తున్నామని, ఇందులో భాగంగానే 12 మంది సిబ్బందిని ప్రత్యేక బృందం అధికారులు విచారిస్తున్నారని డీసీపీ తెలిపారు. అంతేకాకుండా ఘటనాస్థలంలో వేలిముద్రలతో పాటు ఇతర సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నామని, వీలయినంత త్వరగా ఈ కేసులో అసలు నిందితులను పట్టుకుంటామని ఆమె ప్రకటించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 31 ఉదయం 7.50 గంటల సమయంలో సిబ్బంది ఆయుధాల గదిని తెరిచారు. అక్కడ తాళాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉంచిన బాక్సులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఆగస్టు 30 సాయంత్రం 6 గంటల సమయంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చివరిసారిగా లెక్కించారు. ఆ తర్వాత అవి ఎప్పుడు మాయమయ్యాయో స్పష్టంగా తెలియలేదు. అందుబాటులోని సమాచారం ప్రకారం ఆగస్టు 30వ తేదీ అర్ధరాత్రి దొంగతనం జరిగినట్లు అర్ధమవుతోంది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం 12 తుపాకులు దొంగతనం జరిగాయి.

ఇందులో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, తొమ్మిది 9 ఎంఎం పిస్టళ్లు ఉన్నాయి. ఒక సివిలియన్‌ 6.35 బోర్‌ పిస్టల్‌ కూడా ఉంది. వీటితో పాటు 21 మ్యాగజైన్లు, ఒక నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌ కూడా మాయమయ్యాయి. 1,800కు పైగా బుల్లెట్లు కనిపించకుండా పోయాయి. మాయమైన వాటిలో ఏకే-47 రైఫిళ్లకు సంబంధించిన 720 రౌండ్లు ఉన్నాయి. 9 ఎంఎం పిస్టళ్లకు సంబంధించిన 1,120 రౌండ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇన్సాస్‌ రైఫిల్‌కు సంబంధించిన బుల్లెట్లు, ట్రేసర్‌, బ్లాంక్‌ రౌండ్లు ఉన్నాయి.

ఘటన వెలుగుచూసిన వెంటనే ఆర్మీ అధికారులు ఆయుధాలు, మందుగుండు ఆయుధాల లెక్కలను మరోసారి పరిశీలించారు. స్టోరేజ్‌ ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రదేశాల్లో తనిఖీలు చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడికి అనుమతితో వెళ్లే సిబ్బందిని ప్రశ్నించారు. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాంగణంలోని కొన్ని ప్రాంతాలను సీజ్‌ చేశారు. ఆర్మీ అంతర్గత విచారణను కూడా ప్రారంభించింది.

స్కూల్స్‌కు కీలక ఆదేశాలు

ఆర్మీ రెజిమెంట్‌ నుంచి ఆయుధాలు చోరీ జరగడంతో ఆర్మీ అధికారులు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆయుధాలు అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లి అనుకోని ఘటనలు జరిగే ప్రమాదం ఉందని ఆర్మీ అధికారులు అనుమానించారు. అందుకనే ఇదే విషయాన్ని ప్రభుత్వంతో చెప్పారు. కంటోన్మెంట్ ఏరియా పరిధిలో ఉండే స్కూళ్ళలో ముందు జాగ్రత్తగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ద్వారా స్కూళ్ళ యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేయించారు.

Read More
Next Story