స్వర్ణంతో ముగిసిన భారత్ షూటర్ల పోరాటం!
x

స్వర్ణంతో ముగిసిన భారత్ షూటర్ల పోరాటం!

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో స్వర్ణం, రజతం.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో అదరగొట్టిన సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ ..


Click the Play button to hear this message in audio format

ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటారు. వ్యక్తిగత ఈవెంట్లలో నిరాశపరిచిన తర్వాత.. సురుచి సింగ్, కమల్‌జీత్ అద్భుతంగా పుంజుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ మరో పతకం సాధించింది.

ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్‌తో కూడిన భారత జట్టు రజత పతకాన్ని సొంతం చేసుకుంది. భారత్ 1762 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. 1766 స్కోరుతో చైనా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 1751 స్కోరుతో దక్షిణ కొరియా కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మరోవైపు.. 3 పొజిషన్స్ వ్యక్తిగత ఈవెంట్‌లోనూ భారత షూటర్లు ఫైనల్‌కు చేరారు.

తోమర్ 589 స్కోరుతో మూడో స్థానంలో.. నీరజ్ కుమార్ 588 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించారు. ఒక దేశం నుంచి ఇద్దరు షూటర్లకు మాత్రమే వ్యక్తిగత ఫైనల్‌లో అవకాశం ఉండటంతో. రుద్రాంక్ష్ పాటిల్‌కు మాత్రం ఫైనల్ బెర్త్ దక్కలేదు. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో భారత జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కమల్‌జీత్, సురుచి కలిసి 484.6 స్కోరు సాధించారు. వారి తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సుహ్యోన్ హాంగ్, గేయున్ చూ 478.0 స్కోరుతో రెండో స్థానంలో నిలిచారు. అంటే.. భారత జోడీ కంటే కొరియా జంట ఏకంగా 6.6 పాయింట్లు వెనుకబడింది. దీంతో ఫైనల్‌లో సురుచి–కమల్‌జీత్ ఆధిపత్యం ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతోంది.

ఇరాన్ 415.8 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించింది. అంతకుముందు క్వాలిఫికేషన్‌లోనే భారత జోడీ తమ సత్తా చాటింది. తొలి సిరీస్‌లో 196 స్కోరు సాధించిన కమల్‌జీత్, సురుచి.. రెండో సిరీస్ ముగిసేసరికి మరో 195 పాయింట్లు జోడించారు. దీంతో మొత్తం స్కోరు 391కి చేరింది.

మూడో సిరీస్‌లో మరో 196 స్కోరు సాధించి.. మొత్తం స్కోరును 587కి తీసుకెళ్లారు. ఇందులో 29 ఇన్నర్ 10లు ఉండటం వారి ఖచ్చితత్వాన్ని చాటింది.

ఇక ఈ స్వర్ణం భారత్‌కు మరింత ప్రత్యేకం. ఎందుకంటే.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లలో భారత్‌కు నిరాశే ఎదురైంది. కమల్‌జీత్ వ్యక్తిగత క్వాలిఫికేషన్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచారు. సురుచి 26వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇద్దరూ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్లలోనూ భారత్ పతకాలను కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో..10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత్‌కు మిగిలిన చివరి అవకాశాన్ని సురుచి, కమల్‌జీత్ సద్వినియోగం చేసుకున్నారు. నిరాశ నుంచి అద్భుతమైన పునరాగమనం చేసి.. ఏకంగా స్వర్ణ పతకాన్ని దేశానికి అందించారు.

Read More
Next Story