
బహుజన తెలంగాణయే నా సంకల్పం: కవిత
బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే తన ధ్యేయమని కవిత అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం కొత్త శక్తితో ముందుకు వస్తున్నానని చెప్పారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం, ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే తన లక్ష్యమని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. నిజామాబాద్‌లో సోమవారం తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత కీలక ప్రకటనలు చేశారు. అందరూ అంటున్నట్లు బంగారు తెలంగాణ తన ధ్యేయం కాదని, బహుజన తెలంగాణయే తన సంకల్పమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడం కోసమే తాను తాపత్రేయపడుతున్నానని అన్నారు. ఈ సభ ఆరంభంలోనే కవిత భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏ తప్పూ చేయకపోయినా లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించారని, జైల్లో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లు ఈడీ, సీబీఐ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను ధైర్యం, మనోస్థైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మెట్టింటి వారు అక్కున చేర్చుకున్నారని, కానీ సొంత ఇంటివాళ్లు నిర్ధాక్ష్యణ్యంగా తరిమేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టిన నాలుగు నెలల తర్వాత సొంతూరు నిజామాబాద్‌కు వచ్చి ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ వచ్చినా.. ఇంకా మారాల్సింది ఉంది
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు పెద్ద పోరాటం చేశారని కవిత అన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఆశతో ఉద్యమించారని చెప్పారు. ఆ పోరాటంలో 1,600 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత మంచి జరిగినప్పటికీ.. ప్రజలకు ఇంకా జరగాల్సిన మంచి చాలా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు మరింత మేలు ఎలా చేయాలన్న దానిపై కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కాళేశ్వరం ఉన్నా.. నిజామాబాద్‌కు నీళ్లు రాలేదు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై కవిత విమర్శలు చేశారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కొత్త రాజకీయ శక్తి అవసరమని అన్నారు. అందుకే ప్రజల కోసం పార్టీ పెట్టినట్లు చెప్పారు. నిజామాబాద్ ప్రజలు తనను 20 ఏళ్లుగా తమ బిడ్డగా చూస్తున్నారని కవిత అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా గెలిపించారని గుర్తు చేశారు.
ఎక్కడికి వెళ్లినా ప్రజల ధైర్యంతోనే మాట్లాడానని చెప్పారు. తనకు పదవుల కొరత లేదని స్పష్టం చేశారు. పదవుల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉండేదని అన్నారు. కానీ ప్రజలకు మంచి చేయాలనే పట్టుదలతో కొత్త పార్టీ పెట్టినట్లు చెప్పారు.
తాను ఏ తప్పు చేయకపోయినా తీహార్ జైలులో పెట్టారని కవిత అన్నారు. తనను అన్యాయంగా జైలులో పెట్టారని అప్పట్లో మాట్లాడిన కొందరు నాయకులు ఆ తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు సీబీఐ, ఈడీ దర్యాప్తులతో ఇబ్బందులు ఎదురైనా తన ధైర్యం సడలలేదని చెప్పారు. తాను తప్పు చేయలేదన్న మాటపైనే నిలబడ్డానని తెలిపారు.
సొంతూరుకు వచ్చిన సమయంలో తనలోని ఆవేదన బయటకు వచ్చిందని కవిత అన్నారు. ఆపుకోవాలని ప్రయత్నించినా కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. అయితే తనను పిరికిదానిగా భావించవద్దని అన్నారు. కష్టాల్లో ఉన్న మహిళకు అండగా నిలవాల్సిన సమయంలో తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అత్తింటి వారు తనను కన్న కూతురిలా చూసుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్‌పై పోరాటం.. పార్టీ నిర్మాణం
రాష్ట్రంలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నప్పుడు కొత్త పార్టీ ఎందుకు అవసరమనే ప్రశ్న రావచ్చని కవిత అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలు సరిగా అమలు కాలేదని ఆరోపించారు. రైతు భరోసా విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమైందని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని కవిత ప్రకటించారు. ఐదు కీలక అంశాలతో తమ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. శ్రీకృష్ణుడి పాంచజన్య శంఖం పేరుతో ఆ ఐదు అంశాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలు విద్య, వైద్యం కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయని కవిత అన్నారు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఇళ్లు, బంగారం అమ్ముకునే పరిస్థితి వస్తోందని చెప్పారు. తమ పార్టీకి అవకాశం ఇస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని విద్య, వైద్య రంగాలకు కేటాయిస్తామని తెలిపారు. యువత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని కవిత చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
అన్ని వర్గాలకు సామాజిక న్యాయం
సామాజిక న్యాయం అంటే అన్ని రంగాల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండటమేనని కవిత అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ ముందుకు వెళ్తుందని అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పారు. భూమి లేని అర్హులైన పేదలకు ఎకరం భూమి అందించేలా ‘భూలక్ష్మి’ పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
షుగర్ ఫ్యాక్టరీని కేటీఆర్ అడ్డుకున్నారు
నిజామాబాద్‌లోని బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చేలా తాను గతంలో కృషి చేశానని కవిత చెప్పారు. అయితే పెన్షన్ పెంపు, కొత్త వారికి పెన్షన్ విషయంలో సమస్యలు ఉన్నాయని అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం గతంలో తాను ప్రయత్నించానని చెప్పారు. కార్మికులకు సంబంధించిన బకాయిల విషయంలో కూడా సమస్యలు ఉన్నాయని తెలిపారు. సారంగపూర్‌లో షుగర్ ఫ్యాక్టరీ కోసం ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు ప్రకటించారు. అవసరమైతే వారి కోసం పోరాటం చేస్తానని చెప్పారు.
ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న సమయంలో తాను నిరాహార దీక్ష చేసినట్లు కవిత తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం పేదలకు 400 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. పేదల సమస్యలపై తాను గతంలోనూ పోరాటాలు చేశానని గుర్తు చేశారు.
నవ చరిత్రను నవ నాయకులే లిఖిస్తారు
తమ పార్టీలో పెద్ద నాయకులు లేరని కొందరు విమర్శిస్తున్నారని కవిత అన్నారు. అయితే పెద్ద నాయకత్వం ఉన్న బీఆర్ఎస్‌ను ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. తమ పార్టీలోని చిన్న నాయకులైనా ప్రజల కోసం పనిచేస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలను తయారు చేస్తామని తెలిపారు. తమకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని.. బహుజన తెలంగాణ అని కవిత స్పష్టం చేశారు. గత పాలనలో కొంతమంది మాత్రమే లాభపడ్డారని విమర్శించారు.
తాను బహుజన తెలంగాణ కోసం కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తున్నానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం కోరారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని కవిత పేర్కొన్నారు. ఒకవైపు కాంగ్రెస్‌పై పోరాటం చేస్తూనే మరోవైపు తమ పార్టీని నిర్మించుకుంటామని కవిత చెప్పారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మైనార్టీల హక్కుల కోసం వారి గొంతుకగా పోరాడతామని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన యాప్‌లను తొలగించాలని డిమాండ్ చేశారు.

