
‘మీకు చేత కాదు అంటే కేసీఆర్ పై మేము చర్య తీసుకుంటాం’
రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బండి సంజయ్
తెలంగాణ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ని ఇంత వరకు అరెస్ట్ చేయలేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ ఆరోపించారు. ముడుపులు ముట్టినందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని అన్నారు. కేసీఆర్ తో సంబంధాలు చెడినందుకే రేవంత్ రెడ్డి కేంద్రానికి సిబిఐ కోసం లేఖ రాసినట్టు ఆయన అన్నారు. బీజేపీ పై తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కాల్పులు చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేతికి మట్టి అంటకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ అక్రమాలకూ పాల్పడినట్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కూడా కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. మాకు చేత కాదు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ మీద చర్య తీసుకుంటుందని బండి సంజయ్ సవాల్ విసిరారు.

