
తప్పు చేస్తే నా కొడుకుకు అయినా శిక్ష పడాల్సిందే: బండి
కరీంనగర్ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన కుమారుడు భగీరథ్ వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు.
తన తనయుడు బండి బగీరథ్ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగంగా స్పందించారు. తప్పు చేసి ఉంటే తన కొడుకుకు అయినా శిక్ష తప్పదన్నారు. శిక్ష పడాల్సిందేనని అన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఎవరకి అయినా శిక్ష పడాల్సిందేనని అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. తన కుమారుడు భగీరథ్ వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందిస్తూ, తప్పు చేస్తే తన కొడుకైనా చట్టపరమైన శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగం యాత్రలో పాల్గొన్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.
వేలాదిమంది హిందుత్వవాదులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్న ఈ యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ, హిందూ సమాజం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నానని చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలిచానని, సహాయం చేశానని గుర్తు చేశారు. అయితే ప్రజా జీవితంలో బిజీగా ఉండటం వల్ల తన కుమారుడికి సరైన సమయం ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుమారుడిని ఒక నేరస్తుడిలా చూపించే ప్రయత్నం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. భగీరథ్ తాను కేవలం స్నేహంగా మాత్రమే ఉన్నానని చెబుతున్నాడని, కానీ బయట మాత్రం రకరకాల ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అయినప్పటికీ నిజంగా తప్పు జరిగితే చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. చట్టం ఎవరికీ ప్రత్యేకం కాదని, అందరికీ సమానంగా వర్తిస్తుందని బండి సంజయ్ చెప్పారు.
తన కుమారుడు అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఈ సమయంలో ఆయన గొంతు బిగుసుకుంది. తన భార్య కూడా హిందుత్వ భావజాలం కోసం తనతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. కానీ ప్రస్తుతం తల్లి మనసు చాలా బాధపడుతోందని, కన్నపేగు తల్లడిల్లిపోతోందని చెప్పుతూ బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన భావోద్వేగ ప్రసంగం చూసిన యాత్రలో పాల్గొన్న వేలాదిమంది హిందువులు సంఘీభావ నినాదాలు చేశారు. యాత్ర ప్రాంగణంలో కొంతసేపు ఉద్విగ్న వాతావరణం కనిపించింది. ఈ ఘటనతో బండి సంజయ్ కుటుంబ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.

