తెలంగాణలో ఏరులై పారుతున్న బీర్లు..
x

తెలంగాణలో ఏరులై పారుతున్న బీర్లు..

ఎండలు పెరగడంతో తెలంగాణలో బీర్ డిమాండ్ భారీగా పెరిగింది. ఉత్పత్తి, సరఫరాపై నీటి కొరత ప్రభావం పడే అవకాశం ఉంది.


తెలంగాణలో ఎండలతో పాటు బీరు విక్రయాలు పోటీ పడుతున్నాయి. ఎండలు మండే కొద్దీ బీరు కొనుగోళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే తెలంగాణలో బీరు ఏరులై పారుతోంది. అందుకు ఈ ఏడాది మార్చ్ నెలలో జరిగిన విక్రయాలే నిదర్శనం. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మార్చ్‌లో బీర్ విక్రయాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ డేటా ప్రకారం, మార్చి 2025లో 30 లక్షల కేసులు అమ్ముడవగా… మార్చి 2026లో అది 50.78 లక్షల కేసులకు పెరిగింది. ఇది 22 శాతం వృద్ధిగా నమోదైంది.

ఈ పెరుగుదల ఈ ఏడాది ప్రారంభం నుంచే కనిపించింది. జనవరి 2025లో 31 లక్షల కేసులు అమ్ముడవగా, జనవరి 2026లో 34 లక్షల కేసులకు పెరిగింది. ఫిబ్రవరిలో 28 లక్షల నుంచి 38 లక్షల కేసులకు భారీగా పెరిగింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో డిమాండ్ మరింత వేగం అందుకుంది. ఏప్రిల్ నెలలో తొలి 13 రోజుల్లోనే 21 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం రోజుకు సగటున 1.7 నుంచి 1.8 లక్షల కేసులు అమ్ముడవుతున్నాయి.

అధికారులు తెలిపిన ప్రకారం, మే నెలలో డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే మంజీరా నదిలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది. నీటి కొరత పెరిగితే ఉత్పత్తి తగ్గి సరఫరాలో అంతరాయం కలగొచ్చని అధికారులు హెచ్చరించారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం కష్టమవుతుందని సూచించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి డిపో నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా పెంచినట్లు, గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తిని 10 నుంచి 12 శాతం పెంచినట్లు తెలిపారు.

గోదాముల్లో నిల్వలను కూడా 15 రోజుల నుంచి 35 రోజులకు పెంచినట్లు పేర్కొన్నారు. అయితే డిమాండ్ ఇదే రీతిలో కొనసాగితే సరఫరాను నిలబెట్టడం సవాలుగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా 450 నుంచి 500 లక్షల కేసుల మధ్య ఉండే వార్షిక అమ్మకాలు ఈ ఏడాది 600 లక్షల కేసులను దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక ముందు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Read More
Next Story