
ఫలితాలకు ముందు బెంగాల్‌లో కలకలం
బీజేపీ వాహనాల ప్రవేశంపై టీఎంసీ ప్రశ్నలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రోజు, కోల్‌కతాలోని భవానిపూర్ నియోజకవర్గంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్ర ఆరోపణలు చేసింది.
సఖావత్ మెమోరియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్ వద్ద, బీజేపీ జెండాలు ఉన్న రెండు వాహనాలను ప్రాంగణంలోకి అనుమతించారని టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటన ఫలితాల ప్రకటనకు ముందు రోజు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది.
ధర్నా, ఆరోపణలు..
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు, అదే కేంద్రం వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుమారు నాలుగు గంటల పాటు ధర్నా చేపట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు అనధికార వ్యక్తులు యాక్సెస్ పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిరసన చేపట్టారు. “లెక్కింపులో అవకతవకలు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది,” అని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
బీజేపీ వాహనాలపై వివాదం..
కౌంటింగ్ కేంద్రం సమీపంలో గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ జెండాలు ఉన్న రెండు వాహనాలు స్ట్రాంగ్‌రూమ్ సమీపానికి వెళ్లాయని ఆరోపించారు. “గుర్తింపు పత్రాలు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించరు. అలాంటప్పుడు ఈ వాహనాలు ఎలా లోపలికి వెళ్లాయి?” అని టీఎంసీ కార్యకర్త ప్రశ్నించారు. పోలీసులు వాహనాన్ని తొలగిస్తామని చెప్పినా, కొంతసేపు అది అక్కడే నిలిచి ఉందని టీఎంసీ పేర్కొంది.
ఈసీ వివరణ
అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. భద్రతా తనిఖీల తర్వాత ఆ వాహనంలో ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లేవని గుర్తించి వెళ్లనిచ్చినట్లు అధికారులు తెలిపారు.
టీఎంసీ–బీజేపీ మధ్య పోరు..
రాష్ట్రంలో అధికార టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని సూచించినా, టీఎంసీ వాటిని ఖండించింది.
ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తత..
హౌరా, అసన్‌సోల్, బరసత్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని టీఎంసీ ఆరోపించగా, అవి నిరంతరం పనిచేశాయని ఈసీ స్పష్టం చేసింది.
టీఎంసీ నాయకులు శశి పంజా, కునాల్ ఘోష్‌లు కూడా స్ట్రాంగ్‌రూమ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.
బీజేపీ స్పందన..
బీజేపీ నేత సజల్ ఘోష్ టీఎంసీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. “ఎన్నికల్లో అక్రమ మార్గాలు అనుసరించే టీఎంసీ ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తోంది. ప్రజలు దీన్ని హాస్యాస్పదంగా చూస్తున్నారు,” అని ఆయన అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఫలితాల రోజుకు ముందు భద్రతా అంశాలు, రాజకీయ ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.

