
టెండర్లలో బిగ్ చేంజ్! L1 విధానానికి గుడ్‌బై?
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) టెండర్లలో బిగ్ చేంజ్! L1 విధానానికి గుడ్‌బై?
2) హైదరాబాద్‌లో ఘోర పారిశ్రామిక ప్రమాదం..
3) చిలకలగూడలో కొత్త బస్ హబ్..
1) టెండర్లలో బిగ్ చేంజ్! L1 విధానానికి గుడ్‌బై?
తెలంగాణలో ప్రభుత్వ టెండర్ల విధానంలో భారీ మార్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్ల రింగ్‌లు, పోటీ లేకపోవడం, ప్రభుత్వానికి అదనపు భారం పడుతోందనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లు-భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ కమిటీ ఏం చేయబోతోంది? టెండర్ విధానంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముందుగా టెండర్ విధానం ఎలా ఉంటుందో చూద్దాం.
ప్రభుత్వం రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి పనులను స్వయంగా చేయదు. ఈ పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలుస్తుంది. అర్హత కలిగిన కాంట్రాక్టర్లు బిడ్లు వేస్తారు. ప్రస్తుతం ఎక్కువగా L1 లేదా Lowest Bidder విధానమే అమల్లో ఉంది. అంటే అర్హత ఉన్న వారిలో అత్యల్ప ధర కోట్ చేసిన కాంట్రాక్టర్‌కే పని దక్కుతుంది. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో పని జరుగుతుందని భావించినా... ఆచరణలో అనేక విమర్శలు ఎదురయ్యాయి.
L1 విధానంలో తక్కువ ధర చెప్పి టెండర్ దక్కించుకున్న తర్వాత పనులు ఆలస్యం చేయడం, నాణ్యత తగ్గించడం, అదనపు నిధులు కోరడం, కొన్ని సందర్భాల్లో పనులు మధ్యలోనే నిలిపివేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఇరిగేషన్, సంక్షేమం, రోడ్లు-భవనాల శాఖల టెండర్లలో కొంతమంది కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడి పోటీని దెబ్బతీస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెండర్ విధానాన్ని పూర్తిగా సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వికాస్ రాజ్ కమిటీ టెండర్ ప్రక్రియలో పలు కీలక అంశాలను పరిశీలించనుంది. టెండర్ దాఖలు విధానం, అంచనా వ్యయం నిర్ణయం, బిడ్ మూల్యాంకనం, పారదర్శకత వంటి అంశాలపై సిఫార్సులు చేయనుంది. ఇకపై తక్కువ ధర మాత్రమే కాకుండా... కాంట్రాక్టర్ గత అనుభవం, సాంకేతిక సామర్థ్యం, ఆర్థిక బలం, గత పనుల నాణ్యత, సమయానికి పనులు పూర్తి చేసిన రికార్డును కూడా పరిగణనలోకి తీసుకునే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంటే "చౌకగా పని" కంటే "నాణ్యమైన పని"కి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉంది.
ప్రతిపాదిత మార్పులు అమల్లోకి వస్తే ప్రభుత్వ పనుల్లో నాణ్యత పెరుగుతుందని, టెండర్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తోంది. అయితే మరోవైపు చిన్న కాంట్రాక్టర్లకు పోటీ కష్టమవుతుందా? కొత్త మూల్యాంకన విధానంలో పారదర్శకత ఎలా ఉంటుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వికాస్ రాజ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోనుంది. మరి ఈ సంస్కరణలు నిజంగా టెండర్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొస్తాయా? లేక కొత్త చర్చలకు దారి తీస్తాయా? అనేది త్వరలోనే తేలనుంది.
2) హైదరాబాద్‌లో ఘోర పారిశ్రామిక ప్రమాదం..
హైదరాబాద్‌లో మరో విషాదకర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు యంత్రాన్ని పరిశీలిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
చర్లపల్లి ఫేజ్-2లోని సుదర్శన ఇండస్ట్రీస్లో సీఎన్సీ యంత్ర ఆపరేటర్‌గా పనిచేస్తున్న భక్తుని సురేష్‌బాబు (42) విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన సురేష్‌బాబు.. కుటుంబంతో కలిసి చక్రిపురంలో నివసిస్తూ సుమారు 20 రోజుల క్రితమే ఈ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మెకానిక్‌తో కలిసి దానిని పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. యంత్రం నుంచి వచ్చిన శక్తివంతమైన కిరణాలు లేదా యంత్ర భాగాల ప్రభావంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తోటి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే "లేజర్ కిరణాలు తాకి తల తెగిపోయింది" అనే ప్రచారం అధికారికంగా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ప్రమాదానికి సంబంధించిన ఖచ్చితమైన సాంకేతిక కారణాలపై పోలీసులు, నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.దర్యాప్తులో ముఖ్యంగా ఈ అంశాలపై దృష్టి పెట్టారు.
పరిశ్రమలో భద్రతా నిబంధనలు పాటించారా? యంత్రంలో సాంకేతిక లోపం ఉందా? నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా?కార్మికుడికి అవసరమైన భద్రతా పరికరాలు అందించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తు తర్వాతే వెల్లడికానున్నాయి.
చర్లపల్లి ఘటన ఒక్కటే కాదు... తెలంగాణలో పారిశ్రామిక ప్రమాదాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్ల గణాంకాలు రాష్ట్రంలో సుమారు 703 ఫ్యాక్టరీ ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 500కు పైగా ప్రమాదాలు ఫార్మా, కెమికల్, హాజార్డస్ కెమికల్ పరిశ్రమల్లోనే జరిగాయి. ఈ ప్రమాదాల్లో వందలాది మంది గాయపడగా, అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాన ఘోర ప్రమాదాలు పశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు (2025)లో 54 మంది కార్మికులు మరణించారు. ఇది తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఘోర పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటిగా నమోదైంది. పటాన్‌చెరు, బొల్లారం, జీడిమెట్ల, కాజీపల్లి, చర్లపల్లి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లో కూడా తరచూ అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, యంత్ర ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం పారిశ్రామిక ప్రమాదాలకు ప్రధాన కారణాలు:
భద్రతా నిబంధనలను పూర్తిగా అమలు చేయకపోవడం.
యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం.
ప్రమాదకర రసాయనాల నిర్వహణలో లోపాలు.
ఫైర్ సేఫ్టీ, స్ప్రింక్లర్లు, ఎమర్జెన్సీ అలారం వంటి భద్రతా వ్యవస్థలు సరిగా లేకపోవడం.
తగిన శిక్షణ, భద్రతా పరికరాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించడం.
పాత యంత్రాలు, విద్యుత్ లోపాలు, సాంకేతిక నిర్లక్ష్యం.
అత్యధిక ప్రమాదాలు నమోదవుతున్న రంగాలు...
ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు
కెమికల్ యూనిట్లు
ఫ్యాబ్రికేషన్ కంపెనీలు
ఇంజినీరింగ్, మెటల్ ప్రాసెసింగ్ యూనిట్లు
హాజార్డస్ కెమికల్ తయారీ పరిశ్రమలు
చర్లపల్లి ఘటన మరోసారి ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది. కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించే వ్యవస్థలు నిజంగా పరిశ్రమల్లో అమలవుతున్నాయా? తెలంగాణలో గత ఐదేళ్లలో 703 ఫ్యాక్టరీ ప్రమాదాలు... అంటే సగటున ప్రతి మూడు రోజులకు ఒక ప్రమాదం. ఈ గణాంకం పారిశ్రామిక భద్రత ఎంత కీలకమో చెబుతోంది.
"ప్రమాదం జరిగిన తర్వాత దర్యాప్తు కంటే... ప్రమాదం జరగకుండా చేసే భద్రతా వ్యవస్థే కీలకం. సేఫ్టీ ఆఫీసర్లు, క్రమం తప్పని తనిఖీలు, కఠిన నిబంధనల అమలే కార్మికుల ప్రాణాలను కాపాడగలవు."
3) చిలకలగూడలో కొత్త బస్ హబ్..!
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో కొత్త బస్ టెర్మినల్‌తో పాటు ఎలక్ట్రిక్ బస్సుల కోసం అత్యాధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. చిలకలగూడలో ఐదెకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. దీనితో సికింద్రాబాద్, రేతిఫైల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్ విస్తరణకు తగిన స్థలం లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ ఆర్టీసీ భూముల పరస్పర మార్పిడి ప్రతిపాదనపై పనిచేస్తున్నాయి.
కాచిగూడ ఆర్టీసీ డిపోలోని 9 ఎకరాల్లో 5 ఎకరాలను రైల్వేకు ఇవ్వాలని ప్రతిపాదన.బదులుగా చిలకలగూడలోని 5 ఎకరాల రైల్వే భూమిని ఆర్టీసీ తీసుకోనుంది.
మిగిలిన 4 ఎకరాల్లో కాచిగూడకు కొత్త డిపో నిర్మించే ప్రణాళిక కూడా ఉంది.ఈ భూమిపైనే కొత్త బస్ టెర్మినల్ నిర్మించనున్నారు.
చిలకలగూడలో నిర్మించనున్న ఈ టెర్మినల్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.
అందులో...ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్బస్సుల నిర్వహణ కోసం మెయింటెనెన్స్ షెడ్లుడిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ఆధునిక వెయిటింగ్ హాల్స్ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మరింత సులభం కానుంది.
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రేతిఫైల్ బస్ స్టేషన్ పరిసరాల్లో రోజూ భారీ ట్రాఫిక్ ఉంటుంది.
కొండాపూర్, మెహిదీపట్నం, చార్మినార్, పటాన్‌చెరు, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ వంటి ప్రధాన మార్గాలకు వెళ్లే బస్సుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
కొత్త టెర్మినల్ నిర్మాణంతో...రేతిఫైల్ బస్ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికులకు బస్సులు మారడం మరింత సులభమవుతుంది. మరోవైపు, రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా...సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 120 మీటర్ల స్కైవాక్ నిర్మించనున్నారు. ప్రస్తుతం మెట్రో నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయాణికులు సుమారు అర కిలోమీటర్ నడవాల్సి వస్తోంది. స్కైవాక్ నిర్మాణంతో మెట్రో, రైల్వే, బస్సు సేవల మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది.
భూముల బదిలీ ప్రక్రియ, ఆర్టీసీ-రైల్వే అధికారుల మధ్య చర్చలు పూర్తయిన తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు తుది రూపు రానుంది. కొత్త బస్ టెర్మినల్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్, స్కైవాక్‌తో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత ఆధునికంగా మారే అవకాశం కనిపిస్తోంది.

