పార్టీ చేసుకునేందుకే పార్టీ పెట్టారా? కవితపై విపక్షాల సెటైర్లు!
x

పార్టీ చేసుకునేందుకే పార్టీ పెట్టారా? కవితపై విపక్షాల సెటైర్లు!

తెలంగాణ రాష్ట్ర సేనపై రాంచందర్ రావు, చామల కిరణ్ విమర్శలు. అవినీతి, కుటుంబ పాలనపై విపక్షాల ప్రశ్నల వర్షం.


తెలంగాణ రాజకీయాల్లో 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) ప్రకటన వేడి పుట్టిస్తోంది. ఎమ్మెల్సీ కవిత పెట్టిన ఈ కొత్త పార్టీపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు ఒకేసారి విమర్శల బాణాలు విసిరారు. అసలు ఈ పార్టీ ప్రజల కోసం పెట్టారా లేక పార్టీలు చేసుకోవడానికి పెట్టారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చాలా మంది పార్టీలు పెట్టారు, ఇప్పుడు ఇంకొకరు పెట్టారు అని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్.. కవిత పార్టీపై స్పందిస్తూ దోచుకోవడం, దాచుకోవడంలో తేడాలు రావడం వల్లే ఇప్పుడు కొత్త పార్టీ వచ్చిందంటూ చురకలంటించారు.

హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాంచందర్ రావు.. కవిత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయని, చాలామంది కొత్త పార్టీలు పెడుతున్నారని ఆయన అన్నారు. అయితే పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదని, ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందో ఆలోచించుకోవాలని సూచించారు. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నాయని.. ఇప్పుడు వీటికి పుట్టబోయే బిడ్డ కూడా టీఆర్ఎస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ పన్నెండేళ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తోందని, తెలంగాణలో అవినీతికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు. నాయకులు దోచుకున్న సొమ్మును ప్రజలకు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కవితపై చురకలు వేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడంలో తేడాలు రావడం వల్లే ఇప్పుడు ఈ కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని ఆరోపించారు. గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, వైద్యం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. 2016లోనే ఈ పార్టీ పెట్టి ప్రజలను చైతన్యపరిచి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ప్రజల కడుపు చూడకుండా, వారి జేబులు చూసి పరిపాలించిందని కవిత ఒప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

Read More
Next Story