
రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులు ప్రకటించిన బీజేపీ
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారని అనుమానం
రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీకి కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఒక్కో అభ్యర్థులను గెలిపించడానికి అవసరమైన సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఎం. నాగరాజు, మధ్యప్రదేశ్ నుంచి మహేశ్ కేవత్ లను ప్రకటించింది. అలాగే కర్ణాటక శాసన మండలి ఎన్నికలకు లింగరాజ్ పాటిల్, రఘు కౌటిల్యలను కూడా పార్టీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
ఈ అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు.
క్రాస్-ఓటింగ్‌కు ఆస్కారం
మధ్యప్రదేశ్ స్థానానికి మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. సోమవారం (జూన్ 8) నాడు కేవత్ తన నామినేషన్ దాఖలు చేస్తారని, దీంతో మూడవ స్థానానికి పోటీ అనివార్యమవుతుందని భావిస్తున్న నేపథ్యంలో, జూన్ 18న జరిగే ఎన్నికల్లో నటరాజన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్-ఓటింగ్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్, కర్ణాటక సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జూన్ 18న జరగనున్నాయి. కర్ణాటక శాసన మండలికి కూడా జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
Next Story

