
10న ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు
వరుస రివ్యూ మీటింగ్స్ లో బీజేపీ శ్రేణులు
అనేక ఎదురుదెబ్బల తర్వాత తెలంగాణ బీజేపీ లో పండుగ వాతావరణం నెలకొంది. మరో మూడు రోజుల తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగు పెట్టడమే దీనికి కారణం . తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామ్ చందర్ రావు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మోడీ రావడం ఇదే ప్రథమం. అంతేకాదు మూడోసారి ప్రధాని అయ్యాక మోడీ తెలంగాణలో పర్యటించడం కూడా ఇదే మొదటిసారి. అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల ఘనవిజయం వెన్వెంటనే ప్రధాని పర్యటన సాగుతున్నది. ఈ ఉత్సాహంతో ప్రధాని ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ బీ అర్ ఎస్ లను టార్గెట్ చేసుకుని 2028 ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరనున్నారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు మధ్యాహ్నం తర్వాత జింఖానా మైదానంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నది. ప్రధాని కార్యక్రమాలు: జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీకి శంకుస్థాపన. వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్పార్క్ ప్రారంభం. వీటిని రిమోట్ పద్ధతిలో ప్రారంభిస్తారు. తర్వాత సికిందరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ ప్రధాని ప్రసంగిస్తారు.
ప్రధానిప్రసంగించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు నగరమంతా 'వాల్ రైటింగ్' (గోడలపై రాతలు) ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హిమాయత్‌నగర్, కూకట్‌పల్లి, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు బండా కార్తీక తదితర ముఖ్య నేతలు స్వయంగా వాల్ రైటింగ్స్ రాసి ప్రజలను సభకు ఆహ్వానిస్తున్నారు. మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ నినాదాలు రాస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో కూడా స్థానిక నాయకులు వాల్ రైటింగ్స్ ద్వారా ప్రధాని సభకు రావాలని ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నారు. మోదీ సభను గ్రాండ్ సక్సెస్ చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంటు సభ్యులు ధర్మ పురి అరవింద్, ఈటెల రాజేందర్ తదితరులు మోడీ సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆ పార్టీ తెలంగాణా చీఫ్ రామ్ చందర్ రావు పార్టీ నాయకులతో కల్సి జనసమీకరణ కోసం రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ప్రజలను తరలించడానికి ప్రత్యేక ఆర్ టీ సి బస్సులను రామ్ చందర్ రావు ఏర్పాటు చేశారు.300 ఆర్టీసీ బస్సులను బుక్ చేసినట్లు సమాచారం.
మోదీ పదో తేదీన బెంగుళూర్ నుంచి ప్రత్యేక విమానంలో 2. 30 నిముషాలకు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత 2.30 నుంచి 3 గంటల వరకు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ బేగంపేట ఎయిర్పోర్టు ప్రాంగణంలోనే జరుగుతాయి. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి హైటెక్సిటీలో సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో గుజరాత్ వెళ్లిపోతారు.
హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఏ చిన్న బహిరంగ సభ జరిగినా ఉత్సాహంగా పాల్గొనే గోషా మహల్ శాసన సభ్యుడు రాజాసింగ్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా, విబేధాల కారణంగా ఆయన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది.

