
ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
చింతపల్లి రైతు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ చీఫ్ రామ్ చందర్ రావు.. ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు.
రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని తెలంగాణ బీజెపీ చీఫ్ ఎన్ రామ్ చందర్ రావు అన్నారు. గురువారం నల్గొండజిల్లా చింతపల్లి మండలంలో రైతు కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగాఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతుల వద్ద నుంచి మార్చిలో ధాన్యం కొనుగోలు చేయాలి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నెలరోజులు ఆలస్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని బీజేపీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు,రవాణా సదుపాయం లేక పోవడం వల్ల ధాన్యాన్ని వృధాగా రోడ్ల పై పారా పోసి వెళ్లి పోయే పరిస్థితి తలెత్తిందని రాంచందర్ రావు మండి పడ్డారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్చిలో కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆరోపించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి నుండి బయలు దేరిన బీజేపీ బృందం
తెలంగాణలో రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు , పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ , బీజేపీ శాసన సభ్యులు వెంకట రమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పాటిల్, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి , ములకా కుమురయ్య ,బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య తదితరులు పెద్దపల్లి నుండి బీజేపీ బృందం బయలుదేరింది.మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకుంటున్నారు.

