
రైతు గోస బీజేపీ భరోసా ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తెలంగాణా చీఫ్ రాంచందర్ రావు
రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు నిరసనగా రైతు గోస బీజేపీ భరోసా పేరిట సోమవారం తెలంగాణా బీజేపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సందర్శించారు. రైతు అత్మ హత్యలు లేని తెలంగాణా బీజేపీ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. వరుసగా మూడు రోజుల పాటు జరుగుతున్నఈ యాత్రను వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా పరిగి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన రైతులతో ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు, అక్కడి నుంచి గజ్వెల్ సమీపంలోని కుల్కచర్ల చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు అండగా ఉండేందుకే భారతీయ జనతా పార్టీ "రైతు గోస - బీజేపీ భరోసా" యాత్రను చేపట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరపకపోవడంతో రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు రావడం తీవ్ర విచారకరం. రైతులకు బీజేపీ అండగా ఉంటుంది- ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ మండే ఎండల్లో, ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా రైతన్నలు కొనుగోలు కేంద్రాల్లో పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూసి, వారికి ధైర్యాన్ని, భరోసాను ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ రైతుల వద్దకు వచ్చింది అని ఎన్ . రామ్ చందర్ రావు భరోసా ఇచ్చారు . గతంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేం భువనగిరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినప్పుడు, అప్పటికే నల్గొండ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ సమయంలోనే మేం రైతులకు స్పష్టమైన భరోసా ఇచ్చాం. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడొద్దని, ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నాం. రైతుల పక్షాన పోరాటంలో భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని బీజేపీ చీఫ్ భరోసా ఇచ్చారు.
బీజేపీ ఈ యాత్రను ప్రకటించగానే, తాము మొత్తం కొనుగోళ్లు చేసేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. బీజేపీ బృందం వస్తోందని తెలిసి, నిన్న రాత్రికి రాత్రి, తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడికి గోనె సంచులు (గన్నీ బ్యాగ్స్) తీసుకొచ్చి దొంగచాటుగా ధాన్యం నింపే ప్రయత్నం చేశారు. ఇక్కడ ధాన్యాన్ని తరలించడానికి లారీలు గానీ, ట్రాక్టర్లు గానీ లేవు. రవాణా సదుపాయాలు కల్పించకుండా నాటకాలు ఆడుతున్నారు అని రాంచందర్ రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు అధికారుల సమన్వయ లోపం వల్లే కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఐకేపీ కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. కేవలం వరి ధాన్యమే కాకుండా మక్కలు (మొక్కజొన్న), జొన్నలు లాంటి ఇతర పంటలను కూడా విక్రయ కేంద్రాలకు తెచ్చిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొనుగోళ్లలో కావాలనే ఆలస్యం చేస్తూ రైతులపై తీవ్ర మానసిక ఒత్తిడి తెస్తున్నారు అని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు, రైతులు ఇబ్బంది పడి, విసిగిపోయి చివరకు కేంద్ర ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధర (MSP) కన్నా తక్కువ ధరకు తమ పంటను అమ్ముకునేలా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.
రైతులకు నష్టం చేకూర్చి, కష్టపడకుండా దళారులకు, ప్రైవేట్ వ్యాపారులకు మరియు మిల్లర్లకు లాభం చేకూర్చాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, శాసనసభ్యులు . శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు.

