
తెలంగాణ లో బిజెపి దూకుడు - రేవంత్ విరుగుడు వ్యూహం
బిజెపిని నడిపించే ప్రాంతీయ నాయడొకరంటూ లేనందున తెలంగాణలో మోదీ-షా వర్సెస్ రేవంత్ యుద్ధమేనా?
పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బిజెపి సాధించిన విజయాలు భారత రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా, తూర్పు భారతం తర్వాత బిజెపి తదుపరి లక్ష్యం తెలంగాణ అని స్పష్టమవుతోంది. మే 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన, సుమారు రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఈ దిశగా పడుతున్న బలమైన అడుగులే. అయితే, 2023 ఎన్నికల నాటి 'డబుల్ ఇంజిన్' నినాదం నుంచి పాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిజెపి సవాల్‌ను స్వీకరించడమే కాకుండా తనదైన శైలిలో సోషల్ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్త్రాలను బయటకు తీశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే—బిజెపి అభివృద్ధి, జాతీయవాదం అనే రెండంచు అజెండాతో ముందుకు వస్తుండగా, కాంగ్రెస్ స్థానిక సామాజిక కుల సమీకరణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి రెండంచుల కత్తి ఝళిపిస్తున్నది.
1. నామినేటెడ్ పదవులు: కుల సమీకరణాల అస్త్రం
బెంగాల్ ఫలితాల అనంతరం బిజెపి దూకుడును అడ్డుకోవాలంటే కేవలం అభివృద్ధి మాటలు సరిపోవని రేవంత్ రెడ్డి గుర్తించినట్లు కనిపిస్తోంది. అందుకే, రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 28 కార్పొరేషన్ పదవులను (17 చైర్‌పర్సన్‌లు, 11 వైస్ చైర్‌పర్సన్‌లు) భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
• సామాజిక న్యాయం: కమ్మల నుంచి మున్నూరు కాపుల దాకా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ కేటాయించడం ద్వారా గ్రౌండ్ లెవల్‌లో బిజెపి హిందూత్వ ఓటు బ్యాంకు చీలకుండా, సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనేది ఆయన వ్యూహం.
• క్యాడర్ బలోపేతం: కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఈ నియామకాలు ఒక 'టానిక్' లా పనిచేస్తాయని ఆయన నమ్మకం. ఇలా ప్రతికులానికి దగ్గిరయ్యే ప్రయత్నం చేశారు ఈ పదవులతో.
2. మెట్రో విస్తరణ: 'ఫ్యూచర్ సిటీ' కల నిజం. ఫ్యూచర్ సిటి కార్యకలాపాలు వేగమంతమవుతున్నాయి.దీనితో హైదరాబాద్ మొత్తం దక్షిణం వైపు జరుగుతూ ఉంది. ఇంత కాలం ఓల్డ్ సిటి చీకటి భూతం బెంగుళూరు హైవే మీద అభివృద్ధికి ఆటంకంగా ఉండింది. ఇపుడు రేవంత్ ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన దక్షిణాభివృద్ధికి కట్లు విప్పినట్లయింది. ఆరాామ్ గడ్ దాటా గతంలో ఒక్క నిర్మాణం జరిగేది కాదు. ఇపుడు ఆరామ్ గడ్ నుంచి విపరీతంగా సిటి పెరుగుతూ ఉంది. అక్కడ బుల్లెట్ ట్రైన టర్మినల్ రాబోతున్నది. కొత్త బస్టాండ్ రాబోతున్నది. శంషాబాద్ మరొక గచ్చి బౌళి అవున్నది.
బిజెపి 'వికాస్' మంత్రాన్ని జపిస్తుంటే, రేవంత్ రెడ్డి దానికి రెట్టింపు వేగంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో రైల్వే మంత్రితో భేటీ అయి రూ. 38,595 కోట్ల భారీ మెట్రో విస్తరణ ప్రాజెక్టు (ఫేజ్-2 & 3) గురించి చర్చించడం ఇందులో భాగమే.
• కనెక్టివిటీ: రాయదుర్గం నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు, ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించడం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చాలని ఆయన భావిస్తున్నారు.
• ఆర్థిక కేంద్రం: పాతబస్తీ మెట్రోతో పాటు, శివారు ప్రాంతాలను కలపడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకోవడం రేవంత్ లక్ష్యం. ఇది నగర శివారు ప్రాంతాలను ప్రభావితం చేసే చర్య.
3. మోదీ వర్సెస్ రేవంత్: అభివృద్ధి పోరు
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును బిఆర్ఎస్ కు 'ఏటీఎం' గా మోదీ అభివర్ణించారు. అప్పట్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే వ్యూహం మరోసారి పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా బిజెపి అదే తరహా విమర్శలు చేసే అవకాశం ఉంది. దీనిని ముందుగానే పసిగట్టిన రేవంత్ రెడ్డి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి తెస్తూనే, రాష్ట్ర సొంత ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నారు. మే 10న ప్రధాని వచ్చే సమయానికే, తన ప్రభుత్వం కూడా వేల కోట్ల ప్రాజెక్టులతో సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఆయన పంపారు. అంతే, మోదీ చెప్పిన ‘కాళేశ్వరం ఎటిఎం’ లో జరిగినఅవినీతి మీద సిబిఐ చేత దర్యాప్తు చేయించేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదనే శక్తివంతమయిన విమర్శ చేస్తున్నారు. ఎనిమిది నెలల కిందట సిబిఐదర్యాప్తుకోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రంలో చలనం లేదు. ఇపుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద సిబిఐ దర్యాప్తు రేవంత్ కోరుతున్నాడు. ఇలా కేంద్రం ‘కాళేశ్వరం ఎటిఎం’ లబ్దిదారు అయిన కెసిఆర్ మీద చర్య తీసుకోవడం లేదని, ఇది మోదీరాజకీయమని అంటున్నాడు.
మోదీ వికాస్ వర్సెసె రేవంత్ వికాస్
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమి తర్వాత, ప్రాంతీయ అస్తిత్వం కంటే జాతీయవాదం బలపడుతుందనే సంకేతాలు వచ్చాయి. దీనిని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి 'తెలంగాణ మోడల్'ను అభివృద్ధి చేస్తున్నారు.
• మూసీ పునరుజ్జీవం: ఇది కేవలం పర్యావరణ ప్రాజెక్టు మాత్రమే కాదు, నగరంపై పట్టు సాధించే రాజకీయ ప్రాజెక్టు కూడా.
• స్కిల్ యూనివర్సిటీ: యువతకు ఉపాధి కల్పించడం ద్వారా బిజెపి వైపు మళ్లే యువ ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిజెపి పోటీ యే కాదని పార్టీ సీనియర్ నాయకుడు, బిసి కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. వచ్చేఎన్నికల గురించి మాట్లాడుతూ పార్టీకి ఉన్న ఎనిమిది ఎంపిలు, అందులో ఇద్దరు కేంద్రమంత్రులు గత రెండున్న సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏమి తెచ్చారో రేపు ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు. " ఎనిమిది మంది ఎంపిలు అంటే 52 మంది అసెంబ్లీ నియోకవర్గాలతో సమానం. ప్రజల నుంచి ఇంత లబ్దిపొందిన ఈ ఎంపిలు ఎక్కడ ఉన్నారు? దీనిని ప్రజలు గమనిస్తున్నారు. వీళ్లందరిని ప్రజలు నిలదీస్తారు. అందువల్ల బిజెపి కాంగ్రెస్ కు పోటీ యేకాదు," అని శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి పథకాలే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తాయని, ఈ సారి ఎన్నిక చరిత్ర సృష్టిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటన గురించి మాట్లాడుతూ, "గత ఎన్నికల ముందు కూడా ప్రధాని నరేంద్ర మోదీగారు చాలా సార్లు పర్యటించారు. చాలా మాటలు చెప్పారు. అయితే ప్రజలు వినలేదు. కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇపుడు కూడా బిజెపి మాటలు వినరు, కాంగ్రెస్ కు మద్దతు ప్రకప్రకటిస్తారు," అని ఆయన అన్నారు.
ఈ సారి తెలంగాణ ప్రత్యేకత
మొత్తానికి, తెలంగాణ ఇప్పుడు ఒక కొత్త రాజకీయ ప్రయోగశాలగా మారింది. బిజెపి తన 'దక్షిణాది ద్వారం' తెరిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంటే, రేవంత్ రెడ్డి తన పరిపాలనా దక్షతతో, చాణక్య వ్యూహాలతో దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రధాని పర్యటన తర్వాత ఈ రాజకీయ సెగ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడి బిజెపిలో ప్రాంతీయ నాయకులెవరూ ఎదగలేదు. రేవంత్ కు సమ ఉజ్జీ బిజెపిలో లేరనే చెప్పాలి. పార్టీలోచాలా మంది నేతలు ఉన్నా, వారి మధ్య సఖ్యత లేదు. ఒకరి నాయకత్వంలో మరొకరు పని చేసే వీలులేదు. అది తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో బయటపడింది. బండి సంజయ్ మొదలుకు రఘనందన్ దాకా ఎంపిలంతా ఈ పదవికోసం పోటీ పడ్డారు. చివరకు సౌమ్యుడయిన రామచందర్ రావును నియమించారు. ఆయన ఇతర మంచి పదవుల్లో హోదాలో ఉన్న నేతలెవరూ సహకరిస్తున్నట్లు లేరు. అందువల్ల ఇక్కడ బిజెపికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా యే నాయకత్వవ వహించాలి. అంటే, తెలంగాణలో మోదీ-షా వర్సెస్ రేవంత్ పోరాటం సాగేలా కనిపిస్తూ ఉంది. ఈ పోలిక అతిశయోక్తిగా కనిపించినా, రేపు జరగబోతున్నది అదే...
Next Story

