Secunderabad Cantonment
x

కంటోన్మెంట్‌లో ఆయుధాల చోరీ.. రంగంలోకి ఆర్మీ ఇంటెలిజెన్స్

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో 12 తుపాకులు, 1,912 తూటాలు చోరీ అయ్యాయి. పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్‌ దర్యాప్తు చేస్తున్నారు.


సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ అయ్యాయి. ఈ ఘటనలో నిగ్గు తేల్చడం కోసం ఇప్పుడు ఆర్మీ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి బొల్లారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్మీ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో కేసులో మరిన్ని కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఆయుధాలను అసలు బయటకు ఎలా క్యారీ చేశారు? అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన సైనిక అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు.

ఆయుధాల గది తాళాలు పగులగొట్టి చోరీ చేసినట్లు గుర్తించారు. తూటాలు ఉన్న పెట్టెల తాళాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు చోరీ చేయడం ఒక్కరితో సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. చోరీకి ముందు రెజిమెంట్‌ వెనుక భాగంలోని ప్రహరీని పరిశీలించినట్లు అనుమానిస్తున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో గోడ బలహీనంగా ఉందని గుర్తించారు. గోడకు అవతల ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో ఆయుధాలను గోడ మీదుగా బయటకు విసిరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

మంగళవారం అధికారులు రెజిమెంట్‌ గేట్లను పరిశీలించారు. హనుమాన్‌ టెంపుల్‌, అమ్ముగూడ, తూముకుంట, బొల్లారం వైపు ఉన్న గేట్ల వద్ద భద్రతను తనిఖీ చేశారు. లోపలికి వచ్చేవారిని గుర్తింపు కార్డులతో తనిఖీ చేస్తున్నా.. బయటకు వెళ్లేవారిపై అదే స్థాయిలో తనిఖీలు లేవని గుర్తించారు. చోరీ అయిన ఆయుధాల్లో నాలుగు ఏకే47 రైఫిళ్లు ఉన్నాయి. ఒక్కో రైఫిల్‌ బరువు 3.8 కిలోలు. ఇన్సాస్‌ రైఫిల్‌ బరువు 4.3 కిలోలు. ఆయుధాలు పొడవుగా ఉండటంతో వాటిని ఎవరి కంటా పడకుండా తీసుకెళ్లడం సులభం కాదని అధికారులు భావిస్తున్నారు.

చోరీ అయిన బుల్లెట్ల బరువు కూడా కనీసం 15 కిలోలు ఉంటుందని అంచనా. దీంతో ఆయుధాలను గోడ అవతలికి విసిరారా? లేక రెజిమెంట్‌లోనే ఎక్కడైనా దాచి పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్రాస్‌ రెజిమెంట్‌తో పాటు బొల్లారం కంటోన్మెంట్‌లోని ప్రాంతాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. సమీపంలోని మిల్కాసింగ్‌ మైదానంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. చోరీ జరిగిన రోజు తెల్లవారుజామున 3.48 గంటలకు అక్కడ ఓ బైక్‌ కనిపించింది. వేగంగా వచ్చి అంతే వేగంగా వెళ్లిపోయింది.

చీకటి, హెడ్‌లైట్‌ వెలుతురు కారణంగా నంబర్‌ స్పష్టంగా కనిపించలేదు. ఈ బైక్‌కు చోరీతో సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంఘ విద్రోహుల ప్రోద్బలంతో చోరీ జరిగిందా? సిబ్బందిలో ఎవరైనా చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీల్లో ఓ జాగిలం రెజిమెంట్‌ సిబ్బందిలో ఒకరి వద్ద ఆగింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

తనిఖీల్లో ప్రహరీ సమీపంలోని గడ్డిలో ఓ మ్యాగజైన్‌ కూడా లభ్యమైనట్లు సమాచారం. చోరీ నేపథ్యంలో మద్రాస్‌ రెజిమెంట్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రికార్డులను పూర్తిగా తనిఖీ చేశారు. ఆయుధాల గదికి వెళ్లే అధికారం ఉన్న సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. కంటోన్మెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆర్మీ స్థావరాలు, శిక్షణ కేంద్రాల మధ్య సాధారణ పౌరుల రాకపోకలకు ఉన్న 16 మార్గాలను మూసివేశారు. గేట్ల వద్ద తనిఖీల తర్వాతే రక్షణశాఖ సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. చోరీకి అసలు కారణం, ఆయుధాలు ఎక్కడికి వెళ్లాయి, ఇందులో ఎవరి పాత్ర ఉంది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.

Read More
Next Story