
బొల్లారం ఆయుధాల కేసులో బిగ్ ట్విస్ట్!
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం. మహబూబ్‌నగర్‌లో మాజీ ఆర్మీ అధికారి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఆర్మీ ఆయుధాల చోరీ ఘటన కీలక మలుపు తీసుకుంది. ఈ ఆయుధాల చోరీకి ఓ మాజీ అధికారే పాల్పడ్డారు. చోరీకి గురైన ఆయుధాలు మహబూబ్‌నగర్‌లోని ఓ మాజీ ఆర్మీ అధికారి ఇంట్లో లభించాయి. దీంతో ఆ మాజీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి మాజీ అధికారి ఇంటిపై దాడి చేశారు. అక్కడ దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ ఇందులో ఉన్నాయి.
బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మల్కాజిగిరి పోలీసులు, బొల్లారం పోలీసులు, ఎన్‌ఐఏ, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కేసును పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మాజీ ఆర్మీ అధికారి గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాలు అతడి ఇంటికి ఎలా చేరాయి? వాటిని ఎక్కడి నుంచి చోరీ చేశారు? ఇంకా ఎవరైనా ఈ వ్యవహారంలో ఉన్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఆయుధాలను దాచడంలో మరెవరైనా సహకరించారా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసులో అసలు ఉద్దేశం ఏంటనే దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు పూర్తి వివరాలను వెల్లడించలేదు. మల్కాజిగిరి సీపీ, ఆర్మీ అధికారులతో కలిసి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

