
బీఆర్‌ఎస్ సభ్యులపై వేటు.. 20 మందిపై సస్పెన్షన్
సభలో నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్ సభ్యులను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో వాతావరణం వేడెక్కింది. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల మూడో రోజున సభ మరింత ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సేలు 20 మందిని వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్చించాలని కోరారు. అలాగే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపైనా చర్చించాలని డిమాండ్ చేశారు. సభలోనే ఉండి ఆందోళన కొనసాగించిన సభ్యులను సీట్లకు వెళ్లాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలుమార్లు కోరారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు కూడా వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
అయినా బీఆర్‌ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత స్పీకర్ బీఆర్‌ఎస్ సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్ సహా పలువురు సభ్యులు ఈ జాబితాలో ఉన్నారు. సస్పెన్షన్ తర్వాత స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.
మరోవైపు బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. సభాపతిని అవమానించే చర్యలను మానుకోవాలని కోరారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని సూచించారు. విపక్ష నేతల ఆందోళనలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందని భట్టి అన్నారు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులకు న్యాయం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్‌తో అసెంబ్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

