Revanth Reddy
x

సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ ఫిర్యాదు

ఫేక్ ఎక్స్ ఖాతాను ఆధారంగా చేసుకుని అసెంబ్లీని తప్పుదోవ పట్టించారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.


తెలంగాణ అసెంబ్లీలో ఫేక్ ఎక్స్ ఖాతా వివాదం రాజకీయ వేడిని పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ‘సంధ్యారావు బీఆర్ఎస్’ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా పోస్టర్‌ను ప్రస్తావించారు. ఈ ఖాతా నుంచి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను బీఆర్‌ఎస్ ఖండించింది. తమ పార్టీ పేరుతో కాంగ్రెస్ ఫేక్ ఖాతాలు సృష్టించి దుష్ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.

సీఎం సభలో చూపించిన ఖాతా కూడా అలాంటి ఫేక్ అకౌంటేనని పేర్కొన్నారు. సీఎం చూపించిన ఫేక్ ఎక్స్ ఖాతాను ఆధారంగా చేసుకుని అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆధారాలు లేని విషయాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ నిబంధనల్లోని రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు.

అలాగే స్పీకర్‌కు కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. సీఎం వ్యాఖ్యలను పరిశీలించి, సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్‌కు చెందిన ఫేక్ అకౌంట్ల నుంచే పోస్టులు పెట్టించి, వాటి ఆధారంగా సీఎం అసెంబ్లీలో మాట్లాడారని ఆయన ఆరోపించారు. ఫేక్ అకౌంట్లపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని, బాధ్యులను అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హరీశ్ రావు తెలిపారు.

చట్టసభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడంతో వివాదం మరో దశకు చేరింది. ఈ వ్యవహారంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story