ఉప ఎన్నికల ఫలితాలు:  తమిళనాడులో టీవీకే ఆధిక్యం..
x

ఉప ఎన్నికల ఫలితాలు: తమిళనాడులో టీవీకే ఆధిక్యం..

తమిళనాడులోని మదురాంతకం, ధారపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.


Click the Play button to hear this message in audio format

ఉప ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులోని రెండు అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానంలోనూ కమలం పార్టీ ముందంజలో ఉంది. మరోవైపు, పుదుచ్చేరిలోని తట్టంచవాడి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు. / కాంగ్రెస్ అభ్యర్థి ఇ. వినాయగంపై 8,482 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


తమిళనాడులో టీవీకే ఆధిక్యం..

తమిళనాడులోని మదురాంతకం, ధారపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మదురాంతకంలో టీవీకే అభ్యర్థి కె. మరకతం కుమర్వేల్, డీఎంకే అభ్యర్థి ఐ. పరంతమెన్‌పై 4,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ధారపురంలో టీవీకే అభ్యర్థి పి. సత్యభామ, ఏఐఏడీఎంకే అభ్యర్థి కె. భానుమతిపై 2,112 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు స్థానాలు గతంలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న మరకతం కుమారవేల్, సత్యభామ పార్టీని వీడి టీవీకేలో చేరారు.అంతకుముందు జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీంతో మదురాంతకం, ధారపురం స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీవీకే విజయంపై సెంగోట్టియన్ ధీమా ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు, తమిళనాడు మంత్రి కేఏ సెంగోట్టియన్ టీవీకే విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు స్థానాల్లోనూ తమ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ అందిస్తున్న సుపరిపాలనకు ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రజల ఆమోదంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయిలో మెజారిటీ సాధిస్తామని అన్నారు.


బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం..

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై 31,943 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. రెజినగర్‌లో బీజేపీ అభ్యర్థి శంఖరావు సర్కార్ 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భబానీపూర్‌లో ఓడించి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి సువేందు అధికారి, నందిగ్రామ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. మరోవైపు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్, నౌదా స్థానాన్ని నిలబెట్టుకున్నారు. దీంతో రెజినగర్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానంలో ఆయన కుమారుడు గోలం నబీ ఆజాద్‌ను ఏజేయూపీ బరిలోకి దించింది. ఇదిలా ఉండగా, మే 6న నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ కుమారుడు చంద్రనాథ్ రథ్ కాల్పుల్లో హత్యకు గురయ్యారు. ఆయన గతంలో సువేందు అధికారి వద్ద సహాయకుడిగా పనిచేశారు. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది.


నాగావ్‌లోనూ బీజేపీ ముందంజ..

అస్సాంలోని నాగావ్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థి దేవాశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పార్టీని వీడి బీజేపీలో చేరి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దిస్పూర్ నుంచి గెలవడంతో నాగావ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ మాజీ డిప్యూటీ కమిషనర్ దేవాశిష్ శర్మను బరిలోకి దించింది. కాంగ్రెస్ తరఫున బటాద్రోబా మాజీ ఎమ్మెల్యే సిబామోని బోరా పోటీ చేస్తున్నారు. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ కూడా బరిలో ఉన్నారు.


పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ విజయం..

పుదుచ్చేరిలోని తట్టంచవాడి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇ. వినాయగంపై 8,482 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో తట్టంచవాడిలో ఏఐఎన్‌ఆర్‌సీ నేతృత్వంలోని ఎన్డీఏకు విజయం దక్కింది. ముఖ్యమంత్రి రంగస్వామి గత అసెంబ్లీ ఎన్నికల్లో తట్టంచవాడి, మంగళం రెండు స్థానాల నుంచీ గెలిచారు. అయితే, మంగళం స్థానాన్ని తన వద్దే ఉంచుకోవడంతో తట్టంచవాడి ఖాళీ అయింది. తాజా ఫలితాల ప్రకారం, తమిళనాడులో టీవీకే, బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ ఉప ఎన్నికలో విజయం సాధించింది.

Read More
Next Story