
కుల గణనను తప్పుదోవ పట్టిస్తున్నారు: రాహుల్, ఖర్గే
మోదీకి మూడో లేఖ రాసిన ప్రతిపక్ష నాయకులు
రాజ్యసభ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకులైన మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రధాని మోదీకి వరుసగా మూడో లేఖ రాశారు. జనగణ సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుత జనాభా లెక్కలలో కులగణన ను వివరాలు కూడా సేకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఉన్న స్వేచ్ఛాయుత ప్రశ్నల విధానంలో లోపం ఉందని వారు లేఖలో విమర్శించారు.
కులాల గణనను కచ్చితంగా చేసినప్పుడే వివిధ కులాల సంఖ్య, సామాజిక-ఆర్థిక స్థితిపై సరైన అంచనా సాధ్యమవుతుందని, ఈ కచ్చితమైన సమాచారం లేకుండా సామాజిక న్యాయ విధానాలను నెరవేర్చడం సాధ్యం కాదని ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుత విధానంలో నిర్వహిస్తున్న కులగణనను తాము అంగీకరించబోమని, దీనికోసం ఉన్న ప్రశ్నావళిని ప్రభుత్వం రద్దు చేసి, రాజకీయ పార్టీలు, నిపుణులు, సాధారణ ప్రజలతో సంప్రదించి కొత్తదాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, బీహార్ ప్రభుత్వాలు చేసిన కులగణన నుంచి స్ఫూర్తి పొందాలని వారు కోరారు.
ముగింపు లేని ప్రశ్నలు...
స్వేచ్ఛాయుత ప్రశ్నలతో సమస్య “జనాభా లెక్కలలో కుల సమాచారాన్ని నమోదు చేయడానికి మీ ప్రభుత్వం స్వేచ్ఛాయుత ప్రశ్నల విధానాన్ని ఎంచుకుంది.. ఇది తప్పుదోవ పట్టిస్తుంది. ఈ పద్ధతిలో, ఒక వ్యక్తి తన కులానికి ఏ పేరు చెప్పినా, అది ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేస్తున్నారు” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
“భారతదేశంలో, ఒకే కులాన్ని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భాషలతో పిలుస్తారు. ఇలాంటి పరిస్థితులలో, జనాభా లెక్కల సమయంలో ఒకే కులానికి చెందిన వ్యక్తులను వేర్వేరు పేర్లతో నమోదు చేస్తే, అప్పుడు ఒకే కులం వేలాది పేర్లుగా విడిపోతుంది. దేశంలో లక్షలాది కుల పేర్లు పుట్టుకొస్తాయి. కుల గణన నుంచి పొందిన మొత్తం సమాచారం నిరుపయోగంగా మారుతుంది” అని వారు విమర్శించారు.
“ఏదైనా ఒక వర్గానికి చెందిన సరైన సంఖ్యను కూడా నమోదు చేయనప్పుడు, దాని పరిస్థితి అంచనా కూడా లోపభూయిష్టంగా ఉంటుంది. దీనివల్ల వెనుకబడిన, అత్యంత వెనుకబడిన,ఇతర నిరుపేద వర్గాలకు హాని కలుగుతుంది.
అంతేకాకుండా విద్య, ఉపాధి, ప్రభుత్వ పథకాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ప్రభావితమవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, దీనివల్ల దేశంలోని ఓబీసీల జనాభా పరిమాణం కూడా బయటపడదు, ఎందుకంటే ఈ జనాభా లెక్కలలో 'వెనుకబడిన తరగతి' అనే పదాన్ని చేర్చలేదు.” అని లేఖలో ప్రతిపక్ష నాయకులు ఆక్షేపించారు.
పరిష్కారం ఏం సూచించారు..
తెలంగాణ, బీహార్‌లలో కుల సర్వే సమయంలో అనుసరించిన డ్రాప్-డౌన్ జాబితాలో పరిష్కారం ఉందని, తెలంగాణ కుల సర్వే 2024, బీహార్ కుల సర్వే 2022 కుల జాబితాల కాపీలను జతచేస్తూ ఆ ఇద్దరూ సూచించారు.
“షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) గణన సమయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితా, ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ జాబితాల ఆధారంగా ఈ జాబితాను సులభంగా తయారు చేయవచ్చు” అని వారు రాశారు
"ఈ పద్ధతిలో కుల గణన నిర్వహించడాన్ని మేము అంగీకరించము. ప్రభుత్వం ప్రస్తుత ప్రశ్నాపత్రాన్ని రద్దు చేసి, రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో సంప్రదించి కొత్తదాన్ని రూపొందించాలి. తద్వారా ప్రతి కులం, వర్గానికి చెందిన కచ్చితమైన సంఖ్య వెలుగులోకి వచ్చి, కుల గణనను కచ్చితమైనదిగా, అర్థవంతమైనదిగా, ప్రయోజనకరమైనదిగా చేస్తుంది" అని ఆ లేఖ ముగిచింది..
ఎలాంటి సమాధానం ఇవ్వని కేంద్రం..
ప్రతిపక్ష నాయకులు ఇప్పటికి మూడు లేఖలు రాసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2023 ప్రారంభంలోనే మొదటి లేఖను ఖర్గే రాశారు. జనగణనతో పాటు కులగణనపై కొత్తగా కొన్ని సూచనలు చేశారు. రెండో సారి 2025 మే 5న పంపారు. అయితే వీటిపై ఎలాంటి స్పందన లేదని జైరాం రమేశ్ ఆరోపించారు.
Next Story

