2024 ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయా?.. CEC రాజీనామా చేయాలంటున్న రాహుల్
x

2024 ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయా?.. CEC రాజీనామా చేయాలంటున్న రాహుల్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై లోక్‌సభా ప్రతిపక్ష నేత తీవ్ర ఆరోపణలు


Click the Play button to hear this message in audio format

భారత ఎన్నికల సంఘం వ్యవహారంలో అంతర్గత విభేదాలు బయటపడుతున్న వేళ..కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘మొత్తం రిగ్గింగే..’

2024 లోక్‌సభ ఎన్నికలు..అలాగే వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. ఇవన్నీ రిగ్గింగ్‌కు గురయ్యాయని తాను నమ్ముతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ఈసీపై తమకు చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అంటే SIR పై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి SIRలోని కొన్ని నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేసినట్లు వచ్చిన నివేదికలను రాహుల్ ప్రస్తావించారు.


‘ఎన్నికలపైనా వారిద్దరి ప్రభావం’

జ్ఞానేష్ కుమార్ నియామక ప్రక్రియను కూడా రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభావం ఎన్నికల సంఘంపై ఉందన్నట్టుగా ఆయన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల విషయంలో ఒక రకంగా, బీజేపీ విషయంలో మరో రకంగా వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు.


ఈసీ కౌంటర్..

అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను అంగీకరించలేదు. SIR సహా కీలక నిర్ణయాలు CECతో పాటు ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది.


‘ప్రభుత్వాలపై వ్యతిరేకత పూర్తిగా మాయమవ్వదు’

హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను రాహుల్ ప్రస్తావించారు. ఈ రాష్ట్రాల్లో గతంలో అధికార పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలలో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు ఎలా మాయమవుతోందని ప్రశ్నించారు. హర్యానాలో దశాబ్దాలుగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి అధికారం మారుతూ వచ్చిందని గుర్తుచేశారు. మహారాష్ట్రలోనూ రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ వంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన సందర్భాలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్, గుజరాత్ ఎన్నికలను కూడా ఆయన ఉదాహరణగా తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై ప్రజల్లో సహజంగా వ్యతిరేకత ఉంటుందని, అది పూర్తిగా మాయమవడం ఎలా సాధ్యమని రాహుల్ ప్రశ్నించారు.


‘ఓటు దెబ్బతింటే.. రాజ్యాంగమే దెబ్బతిన్నట్టే’

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఓటు హక్కును ప్రజాస్వామ్యానికి పునాదిగా అభివర్ణించారు. ఎన్నికల ద్వారా ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, ఆ ప్రక్రియ సక్రమంగా లేకపోతే మొత్తం వ్యవస్థపై ప్రభావం పడుతుందని అన్నారు. ఓటు వ్యవస్థ దెబ్బతింటే.. దాని ప్రభావం రాజ్యాంగ వ్యవస్థపైనా పడుతుందని ఆయన అన్నారు..


‘ఓటు చోరీ అయితే.. చట్టాల పరిస్థితి ఏంటి?’

రాహుల్ మరోసారి ‘ఓటు చోరీ’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఒకవేళ ఓటు దొంగతనం ద్వారా ఎంపీలు ఎన్నికైతే, వారు పార్లమెంటులో చేసే చట్టాల చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు.


వారిద్దరిపైనా విచారణ..

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై కూడా రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల వ్యవహారంలో జరిగినదానిపై భవిష్యత్తులో విచారణ జరుగుతుందని అన్నారు. ఈ వ్యవహారంలో మోదీ, షా కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. మోదీ, షా, జ్ఞానేష్ కుమార్‌లను ‘దేశద్రోహులు’గా అభివర్ణించారు.

మొత్తంమీద రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్టుగా CEC రాజీనామా చేస్తారా? SIRపై రాజకీయ వివాదం మరింత ముదురుతుందా?..లేక ఎన్నికల సంఘం ఈ ఆరోపణలకు మరింత స్పష్టమైన సమాధానం ఇస్తుందా?. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది..

Read More
Next Story