చలో లోక్‌భవన్‌ ఉద్రిక్తం.. మంత్రులు అరెస్టు
x

చలో లోక్‌భవన్‌ ఉద్రిక్తం.. మంత్రులు అరెస్టు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో హైదరాబాద్‌లో చేపట్టిన చలో లోక్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.


హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్‌’ ఉద్రిక్తంగా మారింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండి కూటమి నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. లోక్‌భవన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూటమి నేతలు వెనక్కు తగ్గకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేయడం కోసం మంత్రులతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఈ ఆందోళన చేపట్టారు. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ర్యాలీ మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. సీఈసీ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ లోక్‌భవన్‌ వైపు కదిలారు.

లోక్‌భవన్‌కు సుమారు 300 మీటర్ల దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీని అక్కడే అడ్డుకున్నారు. దీంతో నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంత్రులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దేశంలో యథేచ్ఛగా ఓటు చోరీ జరుగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే తాము నిరసన తెలుపుతున్నామని చెప్పారు.

బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ తర్వాత తెలంగాణను కూడా బీజేపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కై 92 లక్షల ఓట్లు తొలగించిందని ఆయన ఆరోపణలు చేశారు. మోదీ, అమిత్‌షా పాలనలో దేశ ప్రజలకు 12 ఏళ్లలో జరిగిన మేలును ఆలోచించాలని సూచించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

అరెస్టులతో కాంగ్రెస్‌, వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ వద్దకు కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఇండియా కూటమి ఈ నిరసన చేపట్టింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్నది ప్రధాన డిమాండ్‌గా నేతలు పేర్కొన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

Read More
Next Story