పులుల పేరుతో మా జీవితాల్ని చీల్చొద్దు: చెంచు ఆదివాసీలు
x
అమ్రాబాద్ అడవిలో చెంచు గిరిజనులతో సమావేశమైన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు

పులుల పేరుతో మా జీవితాల్ని చీల్చొద్దు: చెంచు ఆదివాసీలు

అడవే మా జీవితం: తరలింపును నిలిపివేయాలని డిమాండ్


పులుల సంరక్షణ కోసమని మా జీవించే హక్కుకూ విలువ ఇవ్వకుండా మా జీవితాలను చిన్నాభిన్నం చేసే ఈ తరలింపునకు మేము వ్యతిరేకమని చెంచు ఆదివాసిలు ఆదివారం ప్రకటించారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతం నుంచి తమను మైదాన ప్రాంతానికి తరలించటం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతపు తమ హక్కులను కోల్పోతామని, అటవీ ఫలసాయాన్ని పొందే హక్కును, పశువుల మేతకు ఉపయోగపడే అడవిని కోల్పోతామని చెంచు ఆదివాసీలు అంటున్నారు.మానవ హక్కుల వేదిక , దళిత బహుజన ఫ్రంట్ సంస్థలకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని అటవీ గ్రామాల తరలింపు విషయంలో ఆదివారం నిజనిర్ధారణ చేపట్టింది.ఈ బృందం పర్యటనలో పలు విషయాలు వెలుగుచూశాయి. నిజనిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళ రోహిత్, సంజీవ్, శ్రీధర్ , భరత్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ పాల్గొన్నారు.

తరలిస్తే ఉపాధి కోల్పోతాం

ఇప్పటికే చాలా కుటుంబాలకు తగినంత వ్యవసాయ భూమి ఉందని, దాని ద్వారా పొందే ఆదాయాన్ని కోల్పోతామని, కొత్త ప్రాంతంలో తమకు ఉపాధి కూడా దొరకక అన్యాయం అయిపోతామని చెంచు గిరిజనులు ఆందోళన చెందుతున్నారని నిజనిర్ధారణ బృందం వెల్లడించింది. వాస్తవానికి చెంచు ఆదివాసి తెగ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన పీవిటిజి తెగకు చెందిన అట్టడుగు వర్గపు ఆదివాసీ తెగ అని వారు పేర్కొన్నారు.

పులికి మనుషులకు మధ్య ఘర్ణణలు జరగలేదు

గత యాభై సంవత్సరాలుగా పులికీ మనుషులకు మధ్య అక్కడ ఏ ఘర్షణా జరగ లేదు. పులి వెళ్లే దారులు, పులి అలవాట్లు చెంచులకు సాంప్రదాయ పరంగా వచ్చిన జ్ఞానం. ఇది పులికి మనిషికి మధ్య ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. పులులను పెద్దమ్మ తల్లిగా కొలుస్తామని, తామెన్నడూ పులులకు హాని చేయలేదని, చేయమని ఆదివాసులు ముక్తకంఠంతో చెబుతున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతం కోసం జరుగుతున్న అటవీ గ్రామాల తరలింపు దానికి సంబంధించి అసత్యాలుప్రచారంలో ఉన్నాయన్నారు. సార్లపల్లి గ్రామ పంచాయతీ, దాని పరిధిలోని కుడిచింతలబయలు,తాటిగుండల పెంట, వటవర్లపల్లి పంచాయతీ, కొల్లంపెంట గ్రామాలు మొదటి విడతలో తరలిస్తున్నారు.

అసత్య ప్రచారం

గ్రామాల తరలింపునకు ఆదివాసి తెగలే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారన్న ప్రచారం రెవెన్యూ, అటవీ శాఖలు ముమ్మరంగా చేస్తున్నాయని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఇప్పటికే స్వగ్రామం వదిలి పట్టణంలో స్థిరపడ్డ అది కొద్ది మంది ఆదివాసీలు తప్ప, దాదాపు ఆదివాసి, గిరిజనులెవ్వరూ వారి స్వగ్రామాలను వదిలి, అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాచారం వంటి మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళటానికి సిద్ధంగా లేరని వారు స్పష్టం చేశారు. ఈ మధ్య తాము తరలివెళ్లడానికి సిద్ధం అని తీసిన ర్యాలీ లో పాల్గొన్నది సార్లపల్లి సర్పంచ్ భర్త తప్ప మిగతావారంతా గిరిజనేతరులేనని వారు పేర్కొన్నారు.

ఆదివాసీల తరలింపును మానుకోవాలి

‘‘అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్న చెంచు తెగ ప్రజలకు ప్రత్యేక సంరక్షణ అందించాల్సింది పోయి, ఈ రకమైన విధానాలకు పాల్పడటం విచారకరం.అటవీ అధికారులు అక్రమ పద్ధతిలో గ్రామసభ తీర్మాలను చేయిస్తూ, గిరిజనేతరులను కూడగడుతూ, తరలింపుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చేస్తున్న ప్రచారం పూర్తి నిజం కాదు. గ్రామ సభలు ఎక్కడా జరగలేదు. జరిగిన ఒక్కసార్లపల్లిలో డీఎఫ్ఓ ఆధ్వర్యంలో, వారికి అనుకూలంగా ఉన్న కొద్దిమందితో సంతకాలు చేయించుకున్నారు. అక్కడ కూడా గ్రామ సభకు కావలసిన కోరం లేనే లేదు. తరలింపునకు అనుకూలంగా లేని ఆదివాసులను రెవెన్యూ, పోలీసు , అటవీ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మొత్తం గ్రామాలు స్వచ్ఛందంగా తరలిపోతున్నట్టు, ఆ గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మొదలగు కొత్త ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తున్నారు. మహిళా సంఘ భవనానికి అనుమతి ఇవ్వటం లేదు. రోడ్లు వేయటం లేదు. ప్రజలను చైతన్యం చేస్తున్న వారిని బెదిరిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు’’అని కమిటీ సభ్యులు చెప్పారు.

బలవంతపు తరలింపు వద్దు

స్వచ్ఛందంగా వెళతామని ముందుకొచ్చిన గిరిజనేతురలతో ఇంగ్లీష్ భాషలో రాసిన అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకోవడం,రూ. 15 లక్షలు ఇస్తామని, భూములు ఇస్తామని , ఇళ్లు కట్టించి ఇస్తామని నోటిమాటగా చెప్పడం అభ్యంతకరం. పేరుకు స్వచ్ఛంద తరలింపు కానీ, వాస్తవంగా ఇది ప్రలోభ పూరిత, బలవంతపు తరలింపు. టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి గ్రామస్థుల తరలింపునకు ప్రభుత్వం చేస్తున్న ఈ రకమైన ప్రయత్నాలను ఈ బృందం ఖండిస్తోంది. వన్య ప్రాణుల సంరక్షణ ఎంత అవసరమో, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న మనుషుల హక్కులను పరిరక్షించటం కూడా అంతే అవసరం. నిజానికి, రాజ్యాంగపరంగా అంతకు మించిన అవసరం. ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన 5 వ షెడ్యూల్లు, పీసా చట్టం , వన్ ఆఫ్ 70 చట్టం, అటవీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కటమే అవుతుంది. ఆదివాసుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే, ఈ రకమైన నిర్లక్ష్యపు ధోరణిని అవలంబించటం సరైంది కాదు.

చెంచు ఆదివాసీల డిమాండ్లు

టైగర్ రిజర్వ్ కోసం ఆదివాసుల తరలింపును నిలిపివేయాలి.
కోరం తో కూడిన గ్రామసభ తీర్మానాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. తరలింపుకు తాము వ్యతిరేకమని ఆదివాసీ ప్రజలు చేసిన గ్రామసభ తీర్మానాలను ప్రభుత్వం గౌరవించాలి.
ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో వాళ్లు పొందే హక్కులను పరిరక్షించాలి. పీసా చట్టాన్ని , అటవీ హక్కుల చట్టాన్ని వాటి స్ఫూర్తితో అమలు పరచాలి. వారు ఉన్న ప్రాంతంలోనే విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను పెంపొందించాలి.
అటవీ గ్రామాల తరలింపునకు సిద్ధంగా లేని ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష వేధింపులను మానుకోవాలి.
గ్రామాలను వదిలి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వారికి ప్రభుత్వం నోటిమాటగా కాకుండా, ఆ హామీలకు చట్టబద్ధత కల్పించి మాత్రమే తరలించాలి.
Read More
Next Story