
హైదరాబాద్‌లో కదం తొక్కిన సీజేపీ..
తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు
నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో మొదలైన సెగ ఇప్పుడు హైదరాబాద్‌ను తాకింది. సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ సహా యువత చలో పార్లమెంట్ చేపట్టడంతో ఢిల్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అందుకు నిరసనగా మంగళవారం తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ నుంచి లోక్‌భవన్ వరకు మార్చ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు నినాదాలు చేశారు. యువత భవిష్యత్తులో చలగాటాలు ఆడొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో సాయంత్రం 5 గంటలకు సెక్రటేరియట్ దగ్గర నుంచి మరో మార్చ్ చేశారు. దీంతో తెలంగాణలో కూడా బొద్దింకల వేడి పెరిగింది. నీట్ పేపర్ లీక్‌పై తీవ్ర చర్చలు మొదలయ్యాయి.
ఈ నిరసనల్లో పలు విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్ కూడా పాల్గొన్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపాయి. విద్యార్థులు శాంతియుతంగా లోక్‌భవన్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని సంఘాల నాయకులు ఆరోపించారు. కొందరు విద్యార్థులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారని, ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని పేర్కొన్నారు.
ఢిల్లీలో "చలో పార్లమెంట్" సందర్భంగా లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో కూడా విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం శాంతియుత నిరసన హక్కును ఉల్లంఘించడమేనని విమర్శించారు. జాతీయ విద్యా విధానం-2020 పేరుతో విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్‌లు, విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కేంద్ర విద్యాశాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నాయి.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాయి. అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కూడా కోరాయి. ఈ ఘటనతో నీట్ పేపర్ లీక్ అంశం తెలంగాణలో కూడా రాజకీయ, విద్యార్థి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి సంఘాలు తమ ఆందోళనలను కొనసాగిస్తామని ప్రకటించాయి.

