
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం 4 కీలక నిర్ణయాలు
ఉద్యోగుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు ప్రకటించారు. రూ.6000 కోట్ల బకాయిల చెల్లింపు, హెల్త్ కార్డులు, పీఆర్‌సీపై ఆదేశాలు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై సమావేశం నిర్వహించి నాలుగు ముఖ్య నిర్ణయాలను ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పెండింగ్ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగుల పాత్రను ఆయన గుర్తించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రూ.6000 కోట్ల బకాయిలను 100 రోజుల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల వినియోగ ప్రాధాన్యతను ఉద్యోగ సంఘాలే నిర్ణయించుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు జారీ చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జూన్ 1 నాటికి అన్ని ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జీతాల పెంపు అంశంపై త్వరగా నిర్ణయం తీసుకునేందుకు పీఆర్‌సీ కమిషన్ తక్షణమే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై తమ సమస్యలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సంతృప్తి చెందిన ఉద్యోగుల జేఏసీ, మే 5న నిర్వహించాల్సిన ధర్నాలు మరియు నిరసన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి పెండింగ్ బిల్లులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో పేరుకుపోయిన బకాయిలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే 67,760 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయ బదిలీలను కూడా ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించినట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

