
తెలంగాణలో మరిన్ని సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
గత పదేళ్లుగా తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు కాలేదన్న సీఎం రేవంత్.
తెలంగాణకు మరిన్నిసైనిక స్కూళ్లు అవసరమని, వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి భారత సైనికాధికరులను కోరారు.
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం నాడు జరిగిన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” లో ముఖ్యమంత్రి ఈ విజ్ఞప్తి చేశారు. సమావేశానికి ముఖ్య మంత్రి అధ్యక్షత వహించారు.
భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారం గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లు మంజూరయ్యాయని గుర్తు చేసిన సీఎం, గత పదేళ్లుగా తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో తక్షణమే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం, భారత సైన్యం మధ్య నిరంతర చర్చలు కొనసాగితేనే వివిధ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, పరిపాలనా అంశాలను వేగంగా పరిష్కరించేందుకు ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
దేశ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి, భారత సైన్యానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద ‘లోఫ్రీక్వెన్సీ వీఎల్ఎఫ్ (VLF)’ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు మూడు వేల ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు కీలక అంశాలనుసైన్యం ఉన్నతాధికారుల దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
ఈ సమావేశం తెలంగాణ ప్రభుత్వం, భారత సైన్యం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధితో పాటు జాతీయ భద్రతకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.


