
సీఎం రేవంత్‌పై 89 కేసులు.. దేశంలో టాప్!
దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, అప్పులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులు... ఈ మూడు అంశాలను ఒకే నివేదికలో విశ్లేషిస్తే ఎలాంటి చిత్రం కనిపిస్తుంది? ఎవరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రి? ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్.. అంటే ADR.. తాజాగా విడుదల చేసిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఈ నివేదికలో ప్రత్యేకంగా నిలిచింది.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్.. సంక్షిప్తంగా ADR.. ఎన్నికల్లో పారదర్శకతను పెంచేందుకు పనిచేసే స్వతంత్ర సంస్థ. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించే అఫిడవిట్లలోని ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలను విశ్లేషించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఈసారి దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 31 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది.
ADR నివేదిక ప్రకారం.. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.3,660 కోట్లుగా నమోదైంది. సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూ.931 కోట్లతో రెండో స్థానంలో, తమిళనాడు సీఎం విజయ్ రూ.648 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు.
అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రుల జాబితాలో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షలతో మొదటి స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి రూ.85 లక్షలతో రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సుమారు రూ.1 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.
కేసుల్లో రేవంత్ దేశంలోనే నంబర్-1అయితే.. ఈ నివేదికలో అత్యంత చర్చనీయాంశమైన అంశం ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసులు.
ADR నివేదిక ప్రకారం.. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ముఖ్యమంత్రులపై హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అత్యధికంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు నమోదై దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29 కేసులు ఉన్నాయి. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై చెరో 19 కేసులు నమోదయ్యాయి.
రేవంత్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో మొత్తం 89 పెండింగ్ క్రిమినల్ కేసులను ప్రకటించారు. వీటిలో 72 కేసులు సీరియస్ IPC సెక్షన్ల కింద నమోదైనట్లు ADR పేర్కొంది.
ఈ కేసుల్లో ప్రధానంగా నమోదైన IPC సెక్షన్లు ఇవి...
IPC 506 – క్రిమినల్ ఇంటిమిడేషన్ లేదా బెదిరింపులు – 34 ఆరోపణలు.
IPC 505(2) – వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రకటనలు – 22 ఆరోపణలు.
IPC 505 – ప్రజల్లో భయాందోళనలు లేదా అల్లర్లు రెచ్చగొట్టే ప్రకటనలు – 3 ఆరోపణలు.
IPC 420 – మోసం.IPC 477A – ఖాతాల తారుమారు.
IPC 295A – మతపరమైన మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం.
IPC 153A – వర్గాల మధ్య విద్వేషాన్ని ప్రేరేపించడం.
IPC 201 – నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం.
IPC 332 – ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించేలా దాడి చేయడం.
IPC 171C, 171F – ఎన్నికల్లో అక్రమ ప్రభావం చూపడం లేదా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.
IPC 354 – మహిళపై అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణ.
IPC 406 – నమ్మకద్రోహం.
IPC 467, 468 – విలువైన పత్రాల ఫోర్జరీ, మోసం కోసం ఫోర్జరీ వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ కేసులు ఎలా నమోదయ్యాయి?
ఈ కేసుల్లో చాలావరకు రాజకీయ నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల సందర్భంగా నమోదైనవేనని అఫిడవిట్ వివరాలు సూచిస్తున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఈ FIRలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసుల్లో అధిక భాగం వివిధ కోర్టుల్లో విచారణ దశలో లేదా పెండింగ్‌లో ఉన్నాయి.
ADR నివేదికలో ముఖ్యమంత్రుల వయస్సుకు సంబంధించిన గణాంకాలు కూడా ఉన్నాయి. 31 మంది ముఖ్యమంత్రుల్లో 17 మంది 51 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు. మరో 8 మంది 41 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మధ్య వయస్సు నాయకులే ఎక్కువగా ఉన్నారని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు తొలి మూడు స్థానాలు దక్కించుకోగా.. క్రిమినల్ కేసుల సంఖ్యలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ADR విడుదల చేసిన ఈ వివరాలన్నీ ఎన్నికల సమయంలో అభ్యర్థులు స్వయంగా సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా సేకరించినవే. కేసులు నమోదై ఉండటం మాత్రమే నేరం రుజువైనట్లు కాదు. వీటిలో చాలావరకు కేసులు ఇప్పటికీ విచారణ లేదా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

