
అప్పటి వరకు మేడిగడ్డ పనులు షురూ చేయొద్దు: రేవంత్ రెడ్డి
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలించిన సీఎం. నిపుణులతో సమీక్ష, పునరుద్ధరణ చర్యలపై కీలక సూచనలు.
మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రాజెక్ట్ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మరమ్మతు పనులు షురూ చేయాలని, అప్పటి వరకు ఎటువంటి పనులు స్టార్ట్ చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కుంగిపోయిన ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి, జరుగుతున్న పరీక్షలను సమగ్రంగా పరిశీలించినట్టు వెల్లడైంది. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి డ్యామ్ సైట్‌కు చేరుకున్న సీఎం, పునరుద్ధరణకు అవసరమైన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల ప్రక్రియను పరిశీలించినట్టు సమాచారం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చేపడుతున్న పనులను ఒక్కొక్కటిగా పరిశీలించినట్టు అధికారులు తెలిపారు.
కుంగిన ప్రాంతంలో పరిస్థితులను అధికారులు వివరించగా, సీఎం పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. ప్రత్యేకంగా పియర్స్ 20, 21, 22 వద్ద జరుగుతున్న బోర్ రిగ్స్ పనులను పరిశీలించారు. జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరణ కొనసాగుతున్నట్టు వివరించారు. మొత్తం 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్‌కు పంపించనున్నట్టు తెలిపారు. డ్రోన్ ఆధారిత జీపీఆర్ పరీక్షల వివరాలను కూడా అధికారుల నుంచి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ పరీక్షల ద్వారా నేల స్వభావం, లోతు పరిస్థితులపై స్పష్టత లభిస్తుందని అధికారులు వివరించినట్టు చెప్పారు.
బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి జరుగుతున్న అన్ని పరీక్షలను పరిశీలించిన అనంతరం సీఎం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని సూచించినట్టు తెలిపారు. సేకరించిన శాంపిల్స్ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని, ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని స్పష్టం చేసినట్టు సమాచారం. మొత్తానికి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలను సరిచేసి పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ఈ పర్యటన ద్వారా సంకేతాలు వెలువడ్డాయి.

