
హైదరాబాద్‌లో మరోసారి భగ్గుమంటున్న గ్యాస్ మంటలు
19 కిలో, 5 కిలో సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. హోటళ్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం. అధికారిక డీలర్ల నుంచి కొనాలని సూచన.
హైదరాబాద్‌లో వంట గ్యాస్ మంటలు మరోసారి భగ్గుమన్నాయి. మొన్నటి వరకు కొరత కారణంగా ప్రజలు నానాతిప్పలు పడితే.. ఇప్పుడు వాటి ధరలు దరువేస్తున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్య ప్రజలకు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాన్ కమర్షియల్ గ్యాస్ సిలెండర్లు ఆల్‌టైమ్ అత్యధిక ధరకు చేరాయి. మే 1 నుంచి అమల్లోకి రానున్న గ్యాస్ ధరల అంశమే ఈ పెరుగుదలకు కారణంగా. ఈ విషయాన్ని తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వెెల్లడించింది. ‘‘కొత్త రేట్లు అత్యధికంగా పాయింట్‌కు చేరాయి. కమర్షియల్ సిలెండర్లలో అయితే దేశంలోనే ఇది అత్యధిక ధరగా నిలిచింది’’ అని అసోసియేషన్ చెప్పింది. ఈ ధర పెరుగుదల హైదరాబాద్ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపనుంది.
హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,321 నుంచి రూ.3,315కి పెరిగింది. ఒక్క సిలిండర్‌పై రూ.994 పెరుగుదల నమోదైంది. 5 కిలోల సిలిండర్ ధర కూడా రూ.673 నుంచి రూ.914.50కి పెరిగింది. ఇది రూ.241.50 పెరుగుదలగా ఉంది. పెద్ద సిలిండర్ల ధర కూడా కిలోకు రూ.53 పెరిగి, సుమారు రూ.175కి చేరింది. ఈ పెరుగుదల చరిత్రలోనే అత్యధికమని అసోసియేషన్ పేర్కొంది. కమర్షియల్ వినియోగదారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఈ పరిస్థితిలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిలిండర్లను కేవలం అధికారిక డిస్ట్రిబ్యూటర్ల నుంచే కొనాలని తెలిపారు. అధికారిక ధరలకే సరఫరా ఉంటుందని చెప్పారు. ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తే ఎక్కువ ధరలు వసూలు చేసే అవకాశం ఉందని వివరించారు. అనధికారిక మార్గాల్లో నాణ్యత, పరిమాణం విషయంలో సమస్యలు రావచ్చని హెచ్చరించారు. తక్కువ గ్యాస్ నింపే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు.
అధికారిక డీలర్లు ఆయిల్ కంపెనీల పర్యవేక్షణలో పనిచేస్తారని గుర్తు చేశారు. ఇక చిన్న వినియోగదారుల కోసం 5 కిలోల సిలిండర్లు సరిపోతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు, వలస కార్మికులు, చిన్న వ్యాపారులు వీటికి కొత్త కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉండే వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సులభంగా కనెక్షన్ పొందవచ్చని తెలిపారు. అదనపు ఛార్జీలు ఉండవని చెప్పారు.

