కాంగ్రెస్ నేతలకు తీపి కబురు నామినేటెడ్ పోస్టుల జాతర.. ఎవరికి ఛాన్స్?
x

కాంగ్రెస్ నేతలకు తీపి కబురు నామినేటెడ్ పోస్టుల జాతర.. ఎవరికి ఛాన్స్?


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా... నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. పార్టీ కోసం కష్టపడిన వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఇప్పటికీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎట్టకేలకు ఊపొచ్చింది. వారం రోజుల్లో అర్హులైన కార్యకర్తల పేర్లతో నివేదికలు పంపాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టేందుకు పార్టీ, ప్రభుత్వం కసరత్తు ప్రారంభించాయి. దీంతో చాలా కాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ నియామకాలపై అందరిలోనూ ఒకే ప్రశ్న... ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు?ప్రభుత్వం మొత్తం ఎన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తొలి విడతలో సుమారు 50 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే వెల్లడించారు. అనంతరం దశలవారీగా మరిన్ని పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.

ఈ విడతలో రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు, PACS ఛైర్మన్, డైరెక్టర్ పదవులు, అలాగే కార్పొరేషన్లు, బోర్డులు, కమిటీల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసే అవకాశముంది.ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 60 శాతం నామినేటెడ్ పోస్టులను పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కేటాయించాలని నిర్ణయించింది.

మండల, జిల్లా కమిటీల్లో పనిచేసిన నాయకులు... ఉద్యమాలు, ఆందోళనల్లో పాల్గొన్న కార్యకర్తలు... పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నేతలు... నియోజకవర్గ స్థాయిలో చురుకుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది.

మరో కీలక అంశం ఏమిటంటే... ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేకుండా, కేవలం పార్టీకి అందించిన సేవలు, క్రమశిక్షణ, పనితీరు ఆధారంగానే ఎంపిక చేస్తామని టీపీసీసీ ప్రకటించింది.

నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం గాంధీభవన్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమావేశమై ఆశావహుల జాబితాను సిద్ధం చేయనున్నారు. జిల్లాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదానికి పంపనున్నారు.

ఈ నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఎంతో కీలకం. అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం కూడా కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఆశావహులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అసంతృప్తిని ఎలా నియంత్రిస్తారు? నిజంగానే సిఫార్సులు లేకుండా ఎంపిక జరుగుతుందా? 60 శాతం పోస్టుల కేటాయింపు ఏ ప్రమాణాల ఆధారంగా ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.నామినేటెడ్ పోస్టుల భర్తీ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నప్పటికీ... అదే సమయంలో అసంతృప్తికి కూడా కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకే పోస్టుకు పలువురు ఆశావహులు ఉండటం, జిల్లాల్లో వర్గపోరు, కుల-ప్రాంతీయ సమీకరణాలు, నిజంగా కష్టపడిన కార్యకర్తలకే అవకాశం దక్కుతుందా అనే ప్రశ్నలు ఈ నియామకాలపై రాజకీయ రచ్చకు దారితీయొచ్చని గాంధీభ‌వ‌న్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Read More
Next Story