
‘ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
ఫార్మా సిటీ రద్దు పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశం
ప్రభుత్వాలు మారినా పేదల నుంచి భూములు సేకరించే విధానాలలో మార్పు రావటం లేదని, ఇందులో ప్రధానంగా భూమిలేని వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నారని ‘ఫార్మా సిటీ ప్రాంతంలో ఏం జరుగుతోంది?’ అనే అంశంపై జరిగిన సమావేశంలో వక్తలు ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా భూములు సేకరించమని హామీ ఇచ్చిన నాయకులే ఇప్పుడు మాట మార్చి కుంటి సాకులు చెప్తున్నారని వాళ్ళు దుయ్యబట్టారు.
కోర్టు స్టే విధించి అసైన్మెంట్ భూమి అయినా, పట్టా భూమి అయినా, చివరికి రైతుల ఆమోదం తెలిపిన భూముల్లో కూడా ఎటువంటి పనులు చేయకూడదని ఆర్డర్స్ ఉన్నా రోడ్డు వేయడం లాంటి పనులు చేస్తున్నారని వారు గుర్తు చేశారు. ఫార్మా సిటీ ని రద్దు చేశామని బహిరంగ ప్రకటన చేసిన ప్రభుత్వం జీవో నో. 31 ని మాత్రం రద్దుచేయటం లేదని వాళ్ళు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని గౌరవించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 2017 చట్టాన్ని ఉపయోగించి భూసేకరణ చేయటం దురదృష్టకరమని అన్నారు.
2014-2023 BRS ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్ మండలాల్లో 19,333 ఎకరాల్లో ఫార్మా సిటీ ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రతిపాదించింది. దీన్ని రద్దుచేయని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడే ఫ్యూచర్ సిటీ పేరుతో గ్రీ ఫీల్డ్ సిటీ కడతామని ముందుకు వచ్చింది. భూ సేకరణపై కోర్టులో స్టే ఆర్డర్స్ ఉండగా, చట్ట వ్యతిరేకంగా, టెండర్ లు వేసి, రాఘవ కన్స్ట్రక్షన్ కంపనీ, L& T కన్స్ట్రక్షన్ కంపెనీ లకు కాంట్రాక్టులు ఇచ్చి భూమిని చదను చేస్తున్నారు. ఏ భూములనైతే అప్పుడు కాపాడుతాం అని హామీ ఇచ్చారో, అవే భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మీరు ఇయ్యల్సిందే అని కుర్మిద్ద తండా గిరిజిన రైతులను బెదిరిస్తున్నారు. ఆ గ్రామాల రైతులు గత 50 రోజులుగా రిలే నిరసన దీక్ష చేస్తున్నారు. కాని ఈ ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేదు.
ఇది చట్ట వ్యతిరేకం, కోర్టు ధిక్కరణ అని రైతులు చెప్పినా పోలీసు ఆఫీసర్లు పెడచెవిన పెట్టి, 'మీరు కంటెంప్ట్ వేస్కుంటే వేస్కోండి పొండి" అని రైతులను భయ పెడుతున్నారని సభకు హాజరు అయిన రైతులు తెలిపారు. ఈ అత్యవసర పరిస్థితిని అందరి దృష్టికి తీసుకురావటానికే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశామని సమావేశం నిర్వహించిన ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(TPJAC) తెలిపాయి.
ఫార్మా సిటీ రద్దు చేస్తామని మ్యానిఫెస్టో లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమను యూరియా కొనడానికి, రైతు బంధుకు చివరికి ఆన్లైన్ లో పేర్లు తీసేసి రైతు భీమాకు దూరం చేశారని మేడిపల్లి గ్రామ రైతు, కొండల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “పంట రుణాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే రేపు అన్నమో రామచంద్ర అనకతప్పదు,” అని హెచ్చరించారు.
హైదరాబాద్ కు కేవలం 30 కిలోమీటర్ ల దూరంలో ఉన్న మూడు పంటలు పండే తమ ప్రాంతం నుంచే పాలు సరఫరా అవుతున్నాయని శ్రీకాంత్ అనే మరో రైతు గుర్తు చేశారు. భూసేకరణలోనూ పెద్ద కమతాలు ఉన్న వాళ్ళను వదిలేసి చిన్న రైతుల భూములు మాత్రమే తీసుకుంటున్నారని ఆయన అన్నారు. “ఫార్మా సిటీ భూసేకరణ రద్దు చేయటానికి సాంకేతిక కారణాలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక లో విమానాశ్రయం భూముల సేకరణ ఎలా ఆగిందో తెలుసుకోవాలన్నారు.”
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ అభివృద్ది అంటే పెద్ద రోడ్లు, కాలుష్యం చేసే పరిశ్రమలు స్థాపించటం అయిపోయిందని మనిషి జీవితాన్ని మెరుగుపరచని నమూనాకు ప్రత్యామ్నాయం కావాలని అన్నారు. ప్రజలు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కావాలని పోరాటం చేశారని అభివృద్ధిని వ్యతిరేకించరని గుర్తు చేశారు. “ఈ నమూనా మారనంత వరకు ఘర్షణ తప్పదు. పోరాడే ప్రజలకు మద్దతుగా ఉంటాము,” అని హామీ ఇచ్చారు.
మాజీ ఎంపీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి అనే విధానంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. “వెలుగుమట్లలో మేము ఇళ్ళు కోల్పోయిన బాధితుల సమస్యకు పరిష్కారం వచ్చే వరకు అక్కడే కూర్చున్నాం. దాంతో జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దిగి వచ్చారు. ఇళ్లు కూల్చిన బాధితుల్లో దాదాపు సగానికి పైగా వారికి న్యాయం చేస్తామని చెప్పారు. మనం జిద్దు గా ఉండాల్సిందే. మంచి మాటకు వినే ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వం కూడా నిస్సిగ్గుగా ఇదే విధంగా అబద్దాలు చెప్పింది. ఫార్మా సిటీ కోసం మొత్తం 13 వేల 5 వందల ఎకరాలు సేకరించామని చెప్పింది. కానీ అందులో కుందుకూరు మండలంలో 3500, యాచారం లో 6500 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకున్నారు. రైతులు మేము పట్టా భూములను ఇవ్వమని చెప్పినప్పటికీ బలవంతంగా వారి భూములను తీసుకునే ప్రయత్నం చేశారు. కోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా అబద్దాలు చెబుతూ ముందుకు వెళ్లే కుట్ర చేశారు. ఇప్పుడు అదే అబద్దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెబుతోంది,” అని తెలిపారు.
దేశమంతా రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రకారం పని చేస్తామని చెప్తూ తిరుగుతుంటే రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం మాత్రం చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నారని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ కి చెందిన కవుల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. “2015 నుంచే ఫార్మా సిటీ పేరుతో వనరుల పై దాడి మొదలైంది. అసైన్డ్ భూములు తీసుకుంటామంటే మనకు హక్కులు లేవు కదా అని ప్రజలు మొదట రాజీ పడ్డారు. ఇప్పుడు పట్టా భూములు తీసుకుంటాం అంటున్నారు. భూ సేకరణ చేస్తున్న నాలుగు గ్రామాల్లో 10,000 వరకు భూమి లేని కూలీలు ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఫార్మా సిటీ రద్దు గురించి ఆన్లైన్ లో భూములను చేర్చడం పై అడిగితే పార్లమెంటు ఎన్నికల తరువాత చేస్తామని చెప్పిన నాయకులు అందుకు భిన్నంగా సర్వే లు చేస్తూ రోడ్డులు వేస్తూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు,” అని ఆదేవన వ్యక్తం చేశారు.
ప్రధానంగా దళితుల చేతిలో ఉన్న అసైన్డ్ భూములను కాపాడాల్సిన అవసరం ఉందని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ కు చెందిన మీరా సంఘమిత్ర అన్నారు. బిఆర్ఎస్ హయాంలో 2013 చట్టానికి సవరణ చేసి తెలంగాణా లాంటి రాష్ట్రాలు తీసుకువచ్చిన చట్టాలు మూల చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఇది రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకమని ప్రశాంత్ భూషణ్ లాంటి మేధావులు అభిప్రాయ పడుతున్నట్టు తెలిపారు.
భూసేకరణలో మహిళలు బాగా నష్టపోతున్నారని వ్యవసాయం కూడా అభివృద్ది అని చెప్పాల్సిన సమయం వచ్చిందని మహిళా రైతుల వేదిక కు చెందిన ఉష సీతాలక్ష్మి అన్నారు.
సైంటిస్ట్ ఫర్ పీపుల్ కు చెందిన డా. కె. బాబు రావు ప్రజాభిప్రాయ సేకరణ దశ నుంచే లోపాలు ఉన్నాయని అన్నారు. “కాలుష్యం లేని పరిశ్రమ పెడతామని చెప్తున్న ప్రభుత్వం ఒక్క ఉదాహరణ చూపటం లేదు. ఏ దేశంలోనూ ఆ సాంకేతిక పరిజ్ఞానం లేదు. జహీరాబాద్ ప్రాంతంలో కాన్సర్ వస్తున్నా ఎవరు దాని గురించి మాట్లాడటం లేదు. గొంతు ఎత్తిన వాళ్ళను నోరుమూయిస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత సమాచార సేకరణ చట్టం క్రింద రాష్ట్రం 2.5 లక్షల ఎకరాలు సేకరించిందని ఎమ్మెల్సీ కోదండరామ్ కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ భూములు ఏమి అయ్యాయని ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కి చెందిన కన్నెగంటి రవి అన్నారు. “తెలంగాణ పోరాటమే వనరుల కోసం జరిగింది. వనరుల మీద ప్రజలకు హక్కు ఉండాలి. భూముల రక్షణ, ఖనిజాల మీద, అసైన్డ్ భూముల మీద, అభివృద్ది నమూనా మీద చర్చ జరగాలి,” అని గుర్తు చేశారు.

