
రైల్ రోకో కేసు.. కవితకు కోర్టు సమన్లు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో కామారెడ్డిలో చేపట్టిన రైల్ రోకోపై కవితతో పాటు 12 మంది నేతలపై కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రక్షణ సేన అధినేత్రి దేవనపల్లి కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది. రైల్ రోకో కేసుకు సంబంధించి రైల్వే కోర్టు ముందు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది న్యాయస్థానం. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ రైల్ రోకో నిర్వహించారు. దానికి సంబందించిన కేసులోనే తాజాగా పరిణామం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా కేసులో ఉన్నాయి.
2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ఈ కార్యక్రమంలో డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని కవిత తెలిపారు. రైల్ రోకో సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఈ ఆందోళన కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఒక గూడ్స్ రైలును కూడా ఆపివేశారు. రైల్ రోకో ఘటనపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 147, 174(a) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కోసం కోర్టు సమన్లు జారీ చేయడంతో రాజకీయంగా ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.

