
ఆర్నబ్ తుఫాన్: ఐదు జిల్లాలకు రెడ్ అలర్డ్
తీరాన్ని తాకే సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారే సూచనలు కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుపాను తాకే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం ఎనిమిది మంది మంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆయా జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు, సహాయక బృందాలను రంగంలోకి దించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అది నైరుతి దిశగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గాలుల వేగం అప్పుడప్పుడు 140 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించారు.
ఈ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
తుపాను ముప్పును దృష్టిలో పెట్టుకుని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఎనిమిది మంది మంత్రులకు ప్రభావిత జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ 27 నుంచి 29 వరకు వారు ఆయా జిల్లాల్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు, కీలక శాఖల అధికారుల సెలవులను రద్దు చేసి, వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఒడిశా విపత్తు సహాయక దళం, జాతీయ విపత్తు స్పందన దళం బృందాలను సిద్ధంగా ఉంచారు. సుమారు 60 ఓడీఆర్ఏఎఫ్ బృందాలు, 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించగా, 225 అగ్నిమాపక శాఖ బృందాలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాల్లో తుపాను ఆశ్రయ కేంద్రాలను సిద్ధం చేశారు. వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు, అవసరమైతే ఆసుపత్రులకు తరలించాలని అధికారులకు సూచించారు.
గంజాం జిల్లాలో ఇప్పటికే 100 తుపాను ఆశ్రయ కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు, అవసరమైతే ప్రజలకు వసతి కల్పించేందుకు మరో వెయ్యి తాత్కాలిక కేంద్రాలను గుర్తించారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యుత్ స్తంభాలు, ఇతర అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచడంతో పాటు, తుపాను కారణంగా సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రమాదకర హోర్డింగులను తొలగించాలని, తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
తుపాను ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది రానున్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రాణనష్టం తగ్గించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విద్యుత్, రవాణా వంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాయి.
Next Story

