మూసీ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్
x
Musi river

మూసీ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్

55 కిలోమీటర్ల మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును మొత్తం 5 దశల్లో పూర్తి చేయాలన్నది కమిటి నిర్ణయం.


మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు మొదటిదశ పనులకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. మూసీ ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏర్పాటుచేసిన మంత్రుల కమిటి శుక్రవారం సమావేశమైంది. ఈ కమిటిలో డిప్యుటి సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే చేపట్టాలని క్యాబినెట్ సబ్ కమిటి డిసైడ్ చేసింది. 55 కిలోమీటర్ల మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును మొత్తం 5 దశల్లో పూర్తి చేయాలన్నది కమిటి నిర్ణయం. ఫేజ్-1 కు రు. 7055 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. నిధుల సర్దుబాటు కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో సాంకేతిక, ఆర్ధిక చర్చలను కమిటి పూర్తిచేసింది.

హిమాయత్ సాగర్ నుండి బాపూఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుండి బాపూఘాట్ వరకు చేపట్టాల్సిన పనులకు సబ్ కమిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను సబ్ కమిటి ఆదేశించింది. నదిలోని చెత్తను తొలగించటం, రివర్ బెడ్ ప్రొఫైలింగ్ ను ప్రభుత్వమే చేపట్టబోతోంది. వరద నియంత్రణకు రీటైనింగ్ వాల్స్ నిర్మించాలని కమిటి డిసైడ్ చేసింది. నదికి రెండువైపులా రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, నీటి నిల్వకోసం బ్యారేజీలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు కూడా చేపట్టబోతున్నారు. నార్సింగి నుండి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలను కూడా సిద్ధంచేశారు. ఉప్పల్ భగాయత్ నుండి గౌరెల్లి వరకు విస్తరణకు డీపీఆర్ తయారీకి నిర్ణయం తీసుకున్నది కమిటి.

మొదటి దశ పనులను రాబోయే ఆగస్టులో మొదలుపెట్టాలని కమిటి డిసైడ్ చేసింది. డిసెంబర్, 2027 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యాన్ని కూడా కమిటి ప్రకటించింది. ఈ ప్రాజెక్టు సాంకేతిక పర్యవేక్షణకు ఐఐటి, జేఎన్టీయూ సహకారం తీసుకోవాలని కూడా మంత్రుల కమిటి నిర్ణయించింది. బస్టాండ్లు, ప్రధాన రోడ్ల కూడళ్ళు, థియేటర్లలో ప్రాజెక్టుకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని కూడా కమిటి నిర్ణయించింది.

Read More
Next Story