
మరణం వెంటాడిన టన్నెల్.. SLBCలో మరో 4 డేంజర్ జోన్లు!
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) మరణం వెంటాడిన టన్నెల్.. SLBCలో మరో 4 డేంజర్ జోన్లు!
2) నాలాల్లో పూడిక తీయలేదు… బిల్లులు మాత్రం పాస్? హైదరాబాద్ వరదలకు కారణం ఇదేనా?
3) వందేళ్ల చరిత్రకు వర్షం దెబ్బ.. సిటీ కాలేజీలో కూలిన కారిడార్
1) మరణం వెంటాడిన టన్నెల్.. SLBCలో మరో 4 డేంజర్ జోన్లు!
గతంలో 8 మంది కార్మికుల ప్రాణాలను బలిగొన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ SLBC టన్నెల్‌లో.. ఇప్పుడు కీలక ముందడుగు పడింది. టన్నెల్ తవ్వకంలో అత్యంత ప్రమాదకరమైన షీర్ జోన్‌ను అధికారులు సురక్షితంగా దాటేశారు. షీర్ జోన్ అంటే.. భూమి లోపల తీవ్రమైన ఒత్తిడి కారణంగా రాళ్లు బలహీనంగా మారిన ప్రాంతం. ఇక్కడ తవ్వకాలు చేస్తే రాళ్లు కూలడం, నీరు ఉప్పొంగడం వంటి ప్రమాదాలు ఉంటాయి. గతంలో ఇదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. దీంతో పాత మార్గాన్ని వదిలి.. సుమారు 100 మీటర్ల ముందే అలైన్‌మెంట్ మార్చి బైపాస్ టన్నెల్ తవ్వడం మొదలుపెట్టారు. 15 మీటర్ల షీర్ జోన్‌ను దాదాపు నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా తవ్వి దాటినట్లు టన్నెలింగ్ సెక్రటరీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
ఈసారి ఒక్క అడుగు కూడా తొందరగా వేయలేదు. ముందుగా రాతి పొరల్లోకి స్టీల్ పైపులు చొప్పించారు. గ్రౌటింగ్ చేసి టన్నెల్ పైకప్పు, పక్క గోడలను బలోపేతం చేశారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో తవ్వకుండా.. చిన్న చిన్న భాగాలుగా తవ్వుతూ ముందుకు వెళ్లారు. తవ్విన ప్రతి భాగాన్ని వెంటనే రాక్ బోల్టులు, స్టీల్ గర్డర్లతో బలోపేతం చేశారు. ఇలా ప్రమాదానికి అవకాశం లేకుండా షీర్ జోన్‌ను దాటారు. ఇప్పుడు బైపాస్ టన్నెల్‌లో 141 మీటర్ల తవ్వకం పూర్తయింది. మరో 240 మీటర్లు తవ్వితే ఔట్‌లెట్ వైపు ఉన్న మార్గంతో కలవనుంది.
SLBC టన్నెల్ మొత్తం పొడవు 43.930 కిలోమీటర్లు. ఇప్పటివరకు ఇన్‌లెట్ వైపు 13.750 కి.మీ., ఔట్‌లెట్ వైపు 7.046 కి.మీ. పనులు పూర్తయ్యాయి. అంటే మొత్తం 20.796 కి.మీ. టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ఇంకా 23.134 కి.మీ. పనులు మిగిలి ఉన్నాయి.
షీర్ జోన్ దాటేశామని ఊపిరి పీల్చుకునేలోపే.. మరో హెచ్చరిక వచ్చింది. మిగిలిన మార్గంలో మరో నాలుగు డేంజర్ జోన్లు ఉన్నట్లు NGRI గుర్తించింది.
15 కిలోమీటర్ల దగ్గర ఒకటి..
17 కిలోమీటర్ల దగ్గర మరోటి..
19 నుంచి 20 కిలోమీటర్ల మధ్య మరో రెండు బలహీన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నల్లవాగు కారణంగా భూమి లోపల బలహీన ప్రాంతాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. అందుకే ముందుకు వెళ్లే సమయంలో సెన్సర్లతో భూమి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తవ్వకాలు చేయనున్నారు.
గత ప్రమాదం తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ TBMను పక్కనపెట్టి.. ఇప్పుడు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేస్తున్నారు. ఇక నుంచి టన్నెల్ పనులను వేగవంతం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
సెప్టెంబర్ తర్వాత ప్రతి నెలా 350 మీటర్లు.. డిసెంబర్–జనవరి తర్వాత ప్రతి నెలా 425 మీటర్లు తవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. రెండు వైపులా మూడు షిఫ్టుల్లో సుమారు 400 మంది పనిచేస్తున్నారు. 2028 మే నాటికి టన్నెల్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ముందున్న నాలుగు డేంజర్ జోన్లు కీలక పరీక్షగా మారనున్నాయి. ఎందుకంటే ఇది కేవలం టన్నెల్ నిర్మాణం కాదు. గతంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంలో.. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ముందుకు సాగాల్సిన సవాల్. గండాన్ని దాటేశారు. ముందున్న నాలుగు గండాలను కూడా సురక్షితంగా దాటగలరా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
2) నాలాల్లో పూడిక తీయలేదు… బిల్లులు మాత్రం పాస్? హైదరాబాద్ వరదలకు కారణం ఇదేనా?
హైదరాబాద్‌ను వరద ముంపు నుంచి కాపాడేందుకు ఏటా కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా నాలాల్లో పూడికతీత, దాన్ని జవహర్‌నగర్‌కు తరలించే పనులకు భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. కానీ ప్రశ్న ఒక్కటే… నాలాల్లో పూడిక నిజంగా తొలగించారా? లేక కాగితాలపైనే పూడికతీత జరిగిందా? పూడిక తీయకుండానే తీసినట్లు రికార్డులు సృష్టించి, రవాణా చేసినట్లు బిల్లులు క్లెయిమ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనంగా మారాయి.
మురీ నాలా నుంచి బలాపూర్ నాలా వరకు… ఓల్డ్‌సిటీ నుంచి న్యూసిటీ వరకు… పూడికతీత పనులపై ఎమ్మెల్యేల ఫిర్యాదులు ఇప్పుడు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విచారణకు దారితీశాయి. అంటే… ప్రజల డబ్బు ఖర్చవుతోంది… బిల్లులు చెల్లిస్తున్నారు… అయినా వర్షం వస్తే నగరం ఎందుకు మునుగుతోంది? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
జీహెచ్‌ఎంసీ పరిధిలో వందల కిలోమీటర్ల మేర నాలాలు, డ్రెయినేజ్ నెట్‌వర్క్ ఉంది. వీటిలో పూడిక పేరుకుపోకుండా క్రమం తప్పకుండా తొలగించడం అత్యంత కీలకం. కాంట్రాక్టర్లకు పూడికతీత, రవాణా పనులు అప్పగిస్తే… వారు నిజంగా ఎంత పూడిక తీశారు? ఎక్కడి నుంచి తీశారు? ఎన్ని వాహనాల్లో తరలించారు? ఎక్కడ డంప్ చేశారు? అనే ప్రతి అంశానికి రికార్డు ఉండాలి. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలు మాత్రం వ్యవస్థను ప్రశ్నించేలా ఉన్నాయి.
పూడిక తీయకుండానే తీసినట్లు నమోదు చేశారా? తరలించకుండానే తరలించినట్లు బిల్లులు పెట్టారా?రోడ్డుపై తిరగని వాహనాల నంబర్లతోనే రవాణా చూపించారా?బైక్‌లు, ఆటోలు, కార్ల నంబర్లతో పూడిక రవాణా చేసినట్లు చూపించారన్న ఆరోపణలు నిజమైతే… అది కేవలం నిర్లక్ష్యం కాదు. ప్రజాధనంతో నడిచే వ్యవస్థలో పర్యవేక్షణ ఎంత బలహీనంగా ఉందన్నదే అసలు ప్రశ్న.
కాంట్రాక్టర్ పని… ఇంజినీర్ బాధ్యత ఏంటి?
పూడికతీత పనులు కాంట్రాక్టర్‌కు అప్పగించవచ్చు. కానీ పనులు సక్రమంగా జరిగాయా లేదా అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అందుకే ఇప్పుడు మరో కీలక ప్రశ్న ముందుకొస్తోంది. కాంట్రాక్టర్ పూడిక తీయకపోతే గుర్తించాల్సింది ఎవరు? వాహనాలు నిజంగా తిరిగాయో లేదో ధృవీకరించాల్సింది ఎవరు? పూడిక ఎక్కడ డంప్ చేశారో పరిశీలించాల్సింది ఎవరు? పని పూర్తయిందని బిల్లులు పాస్ చేయడానికి ముందు తనిఖీ చేసింది ఎవరు?
ఒకవైపు కోట్ల రూపాయల బిల్లులు… మరోవైపు ప్రతి వర్షాకాలంలో వరద ముంపుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. అందుకే ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ మాత్రమే కాదు… పర్యవేక్షణ వ్యవస్థ మొత్తం పరిశీలనకు రావాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేల ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో… ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయా? అన్నదే ఆసక్తికరం.
14 ఏళ్ల క్రితం కూడా ఇదే ఆరోపణలు!
ఇది కొత్తగా తెరపైకి వచ్చిన ప్రశ్న కాదు. సుమారు 14 ఏళ్ల క్రితం కూడా నాలాల పూడికతీతలో కోట్ల రూపాయల అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో సుమారు రూ.40 కోట్ల వ్యవహారంపై దర్యాప్తు జరగగా… పలువురు ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇన్నేళ్లు గడిచినా… మళ్లీ దాదాపు అదే తరహా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వ్యవస్థలో లోపమా? పర్యవేక్షణలో వైఫల్యమా?కాంట్రాక్టర్లపై నియంత్రణ లేకపోవడమా? లేదా పనులు పూర్తయ్యాయని నిర్ధారించే విధానంలోనే సమస్య ఉందా?
ఒక నగరం వరదల నుంచి రక్షించబడాలంటే నాలాలు కేవలం మ్యాప్‌లపై ఉండటం సరిపోదు. వాటిలోని పూడిక నిజంగా తొలగాలి. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా డ్రెయినేజ్ వ్యవస్థ పనిచేయాలి. పాత ఆరోపణలే కొత్త పేర్లతో మళ్లీ వస్తుంటే… మారింది కాలమేనా? వ్యవస్థ మాత్రం మారలేదా? ఇప్పుడు విజిలెన్స్ విచారణ ముందున్న అసలు పరీక్ష ఇదే. పూడికతీత జరిగినట్లు చూపించిన ప్రతి ప్రదేశాన్ని పరిశీలిస్తారా? రికార్డుల్లో ఉన్న వాహనాల వివరాలను వాస్తవంగా ధృవీకరిస్తారా? పూడిక రవాణా చేసినట్లు చూపించిన మార్గాలు, డంపింగ్ ప్రాంతాలను తనిఖీ చేస్తారా? చెల్లించిన బిల్లులు… జరిగిన పనులతో సరిపోలుతున్నాయా లేదా అన్నది బయటపెడతారా? అన్నింటికంటే ముఖ్యంగా… కాంట్రాక్టర్ తప్పు చేస్తే పర్యవేక్షణ చేసిన అధికారుల బాధ్యత ఎంత?
హైదరాబాద్‌కు ప్రతి ఏడాది వరదలు వస్తున్నాయనే కారణంతో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం మాత్రమే పరిష్కారం కాదు. ఆ డబ్బుకు తగిన పని జరిగిందా? నగరానికి దాని ప్రయోజనం అందిందా? అన్నదే అసలు లెక్క.పూడిక తీయకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలు నిజమైతే… అది కేవలం ఒక నాలా కథ కాదు. ఇది ప్రజాధనం, అధికారుల బాధ్యత, కాంట్రాక్టర్ల జవాబుదారీతనం, హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.
3) వందేళ్ల చరిత్రకు వర్షం దెబ్బ.. సిటీ కాలేజీలో కూలిన కారిడార్
ఒక్కసారి ఊహించండి.. వందేళ్ల చరిత్ర ఉన్న కాలేజీ భవనం. ఆ భవనంలో 6 వేల మంది విద్యార్థులు. అదే భవనంలోని కారిడార్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఒక్క విద్యార్థి కూడా లేడు. మరి విద్యార్థులు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇది కేవలం ఒక కారిడార్ కూలిన ఘటన కాదు. ఇప్పటికే పైకప్పు నుంచి నీరు కారుతోంది.. పెచ్చులు ఊడిపడుతున్నాయి.. ఫిజిక్స్ ల్యాబ్‌ను మూసేశారు.. ఇప్పుడు కారిడార్ కూడా కూలింది. మరి తదుపరి ప్రమాదం ఎక్కడ? వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన హైదరాబాద్ సిటీ కాలేజీ భవనం ఇప్పుడు ప్రమాదకర స్థితికి చేరిందా? ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఈ చారిత్రక భవనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో సిటీ కాలేజీలోని ఫిజిక్స్ ల్యాబ్ వైపు ఉన్న కారిడార్ కూలిపోయింది. వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మి, డాక్టర్ నీరజ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న సిటీ కాలేజీ పూర్వ విద్యార్థి, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భవనం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను కేవలం ఒక కారిడార్ కూలిన ఘటనగా చూడాల్సిన అవసరం లేదంటున్నారు కళాశాల వర్గాలు. ఎందుకంటే.. సిటీ కాలేజీ భవనం ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. ప్రత్యేకంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. వర్షం పడిన ప్రతిసారీ పైకప్పు తడిసి.. సైన్స్ ల్యాబ్‌ల్లోకి నీరు కారుతున్న పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు పైకప్పు పెచ్చులు కూడా ఊడిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ నెల 20న కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం చార్మినార్ ఎమ్మెల్యేతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అప్పటికే పెచ్చులు ఊడిపడటంతో ఫిజిక్స్ ల్యాబ్‌ను మూసివేశారు. ఇప్పుడు కారిడార్ కూడా కూలిపోవడంతో భవనం భద్రతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్యార్థుల ప్రాక్టికల్స్ పరిస్థితి ఏంటి?కారిడార్ కూలిన ఘటన నేపథ్యంలో ప్రస్తుతం సైన్స్ ల్యాబ్‌లన్నింటినీ మూసివేశారు. దీంతో విద్యార్థుల ప్రాక్టికల్స్‌పై కూడా ప్రభావం పడుతోంది. కనీసం వారం రోజుల పాటు ప్రాక్టికల్స్ నిర్వహించే అవకాశం లేదని సంబంధిత ప్రొఫెసర్లు చెబుతున్నారు. అవసరమైతే ప్రాక్టికల్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. అంటే.. ఒకవైపు చారిత్రక భవనం భద్రత ప్రశ్నార్థకంగా మారితే.. మరోవైపు అక్కడ చదువుతున్న వేలాది మంది విద్యార్థుల విద్య కూడా ప్రభావితమవుతోంది.
సిటీ కాలేజీకి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. దీని మూలాలు 1865లో ప్రారంభమైన సిటీ స్కూల్ వరకు వెళ్తాయి. ఆరవ ఆసిఫ్ జా కాలంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్.. ‘దారుల్ ఉల్ ఉలూం’ పేరుతో సిటీ స్కూల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఏడో ఆసిఫ్ జా ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఇది హైస్కూల్‌గా రూపాంతరం చెందింది. 1929లో సిటీ కాలేజీగా ఉన్నతీకరించారు. కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలో.. ప్రస్తుతం సుమారు 6 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఈ భవన నిర్మాణాన్ని అప్పటి చీఫ్ ఇంజినీర్ నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ చేపట్టారు. అంటే, ఇది కేవలం ఒక కాలేజీ భవనం కాదు. హైదరాబాద్ చరిత్ర, విద్యా ప్రస్థానంలో కీలకమైన వారసత్వ కట్టడం. మరి మరమ్మతులు ఎందుకు ఆలస్యం? ఇక్కడే అసలు సమస్య. సిటీ కాలేజీ భవనం హెరిటేజ్ నిర్మాణం కావడంతో సాధారణ భవనాల మాదిరిగా ఇష్టానుసారంగా మరమ్మతులు చేయడం సాధ్యం కాదు. పురావస్తు శాఖ అధికారుల అనుమతితోనే మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది.
అయితే.. గత కొన్నేళ్లుగా భవనానికి పెద్దగా మరమ్మతులు జరగలేదని కళాశాల వర్గాలు చెబుతున్నాయి. అనుమతులు, నిధులు, అధికారిక ప్రక్రియల మధ్య ఆలస్యం జరుగుతుండగా.. మరోవైపు భవనం మాత్రం రోజురోజుకూ బలహీనపడుతోంది.వర్షం వస్తే నీరు కారడం. పెచ్చులు ఊడిపడటం. ఇప్పుడు ఏకంగా కారిడార్ కూలిపోవడం. ఇవి భవనం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ఎక్కడ ప్రమాదం పొంచి ఉంది? ఏ ప్రాంతాలకు తక్షణ మరమ్మతులు అవసరం? ఎలాంటి నిర్మాణ పద్ధతులతో హెరిటేజ్ భవనాన్ని అసలు రూపం దెబ్బతినకుండా పునరుద్ధరించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సమయం వచ్చింది.
వందేళ్ల చరిత్రను మోస్తున్న సిటీ కాలేజీ భవనం, ఇప్పుడు వర్షాలకు తట్టుకోలేక కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అదృష్టవశాత్తూ కారిడార్ కూలిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిటీ కాలేజీ ఘటన ఇప్పుడు అధికారులు, పురావస్తు శాఖ ముందు ఇదే సవాల్‌ను ఉంచుతోంది.

